STOCKS

News


నంబరు పోర్టబిలిటీ మరింత సులభతరం

Thursday 27th September 2018
news_main1538023071.png-20616

న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) మరింత సులభతరం చేసే క్రమంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది. వీటి ప్రకారం ఇకపై యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ)ని జనరేట్ చేసే బాధ్యతను ఎంఎన్‌పీ సర్వీస్ ప్రొవైడర్‌ (ఎంఎన్‌పీఎస్‌పీ)కి అప్పగించింది. ప్రస్తుత విధానం ప్రకారం టెలికం సంస్థే దీన్ని జనరేట్ చేసి సబ్‌స్క్రయిబర్‌కి పంపుతోంది. అయితే, నంబర్ పోర్ట్‌ చేసుకోవడానికి అర్హులా కాదా అన్నది సదరు సబ్‌స్క్రయిబర్‌కి తెలియడానికి నాలుగు రోజుల దాకా పట్టేస్తోంది. కొన్ని సందర్భాల్లో బిల్లుల బకాయిలు ఉన్నాయనో లేదా ప్రత్యేక స్కీమ్స్‌ కింద కనెక్షన్ ఇచ్చామనో టెలికం సంస్థలు ఎంఎన్‌పీ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నాయి. ఎంఎన్‌పీఎస్‌పీలు సమర్పించిన నివేదిక ప్రకారం.. మొత్తం పోర్టింగ్ అభ్యర్ధనల్లో దాదాపు 11 శాతం అభ్యర్ధనలను టెలికం సంస్థలు వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నాయి. 
    ఈ నేపథ్యంలో కొత్త సవరణలను ట్రాయ్ ప్రతిపాదించింది. యూపీసీ వ్యవధి ముగిసిపోయిందని, సరిపోలడం లేదన్న కారణాలతో కూడా టెల్కోలు పోర్టింగ్ అభ్యర్ధనలను తిరస్కరిస్తుండటాన్ని కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఇకపై టెలికం యూజరు గానీ నంబర్ పోర్టబిలిటీ అభ్యర్ధిస్తే వారి టెలికం సంస్థ .. దాన్ని ఎంఎన్‌పీఎస్‌పీకి పంపుతుంది. ఆ తర్వాత యూజర్ వివరాలన్నీ పరిశీలించిన మీదట పోర్టబిలిటీకి అర్హులని భావించిన పక్షంలో ఎంఎన్‌పీఎస్‌పీనే వారికి యూపీసీని సత్వరం జారీ చేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. అలాగే జారీ అయిన యూనిక్ కోడ్ వర్తించే కాలావధిని ఏడు పని దినాల నుంచి నాలుగు పనిదినాలకు ట్రాయ్ తగ్గించింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 24 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియజేయొచ్చు. వేరే టెలికం సంస్థకు మారినా.. పాత మొబైల్ నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు నంబర్‌ పోర్టబిలిటీతో లభిస్తుందన్న సంగతి తెలిసిందే. 

జరిమానాలు కూడా..
ట్రాయ్ ప్రతిపాదనల ప్రకారం నిర్దేశిత గడువు నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో టెలికం సంస్థకు రూ. 5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ అర్హతపరమైన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో జరిమానా రూ. 10,000గా ఉంటుంది. మరోవైపు, నిబంధనలను అమలు చేయడానికి పెనాల్టీలు విధించడమొక్కటే మార్గం కాదని.. సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం శ్రేయస్కరమని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. ఎయిర్‌సెల్‌, టెలినార్, ఆర్‌కామ్ మూతబడిన తర్వాత ఎంఎన్‌పీకి డిమాండ్ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. You may be interested

హీరో వాహనాలు మరింత ప్రియం

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. మోడల్‌, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500

కెమాన్‌ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు

Thursday 27th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ టెక్నో మొబైల్‌ తాజాగా కెమాన్‌ సిరీస్‌లో మూడు మోడళ్లను బుధవారం ప్రవేశపెట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ సాంకేతికతో కూడిన కెమెరాలు వీటి ప్రత్యేకత అని టెక్నోను ప్రమోట్‌ చేస్తున్న ట్రాన్సియాన్‌ ఇండియా సీఎంవో గౌరవ్‌ టికూ మీడియాకు తెలిపారు. ఎలాంటి వెలుతురులోనైనా చిత్రాలను తీయగలదని చెప్పారు. లైటింగ్‌ కండీషన్‌, బ్రైట్‌నెస్‌ ఆధారంగా సీన్‌ను అంచనా వేసి ఫోటోకు అందాన్ని తెచ్చేందుకు ఆటో సీన్‌ డిటెక్షన్‌ ఫీచరును

Most from this category