STOCKS

News


ఆర్‌బీఐకి ‘శక్తి’ కాంత్‌!

Wednesday 12th December 2018
news_main1544590757.png-22839

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి స్వరాష్ట్రం ఒడిస్సా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి వ్యవహారాల్లో ఆరంభంలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్‌ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక పదవికి 61 సంవత్సరాల దాస్‌ పేరును ప్రకటించడం గమనార్హం. మూడేళ్లు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని అధికారిక ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి ఒక బ్యూరోక్రాట్‌కు సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ బాధ్యతలు అప్పగించటం ఐదేళ్లలో ఇదే తొలిసారి. అంతకు ముందు ఐఏఎస్‌ అధికారి దువ్వూరి సుబ్బారావు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆయన తరవాత మూడేళ్లపాటు రఘురామ్‌ రాజన్‌, రెండేళ్లకు పైగా ఉర్జిత్‌ పటేల్‌ ఈ పదవిలో కొనసాగటం తెలిసిందే. 
‘తాత్కాలికం’అంచనాలకు భిన్నంగా...
నిజానికి పటేల్‌ రాజీనామా నేపథ్యంలో- ఈ బాధ్యతలకు తాత్కాలిక ఎవరో ఒకరిని నియమిస్తారని అంతా భావించారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ దాస్‌ను మూడేళ్ల కాలానికి ఎంచుకోవడం గమనార్హం. డాక్టర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాను కేంద్రం ఆమోదించిందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేసిన కొద్ది గంటల్లోనే తాజా నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి శక్తికాంత దాస్‌కు విశేష అనుభవం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎ.ఎస్‌.ఝా పేర్కొన్నారు. 
ఐఏఎస్‌ నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌ వరకూ...
దాస్‌ 1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. నార్త్‌బ్లాక్‌లో నిర్వహించిన బాధ్యతల్లో పరిపూర్ణత ఆయనను మింట్‌ స్ట్రీట్‌ వరకూ నడిపించిందని చెప్పవచ్చు. 38 సంవత్సరాల కెరీర్‌లో ప్రతి సందర్భంలోనూ శక్తికాంత దాస్‌... వివాద రహిత ధోరణి కలిగిన వ్యక్తిగా, కీలక అంశాల్లో ఏకాభిప్రాయ సాధనలో విజయం సాధించే నేర్పరిగా ప్రత్యేకత సాధించారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీవంటి అంశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఆటుపోట్లను పరిష్కరించటంలో కీలక పాత్రను పోషించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత... భారత్‌లో జీ-20 సమావేశాల నిర్వహణ బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు.
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి చరిత్రలో పట్టభద్రులయిన శక్తికాంత దాస్‌... 2008లో పి.చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తదుపరి 2014 మధ్యలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక ఆర్థిక శాఖలో ఆయన కీలక బాధ్యతలు ప్రారంభమయ్యాయి. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖ పగ్గాలను ఆయనకు అప్పగించింది. అటు తర్వాత ఆర్‌బీఐ, ద్రవ్య పరపతి విధానంతో ప్రత్యక్ష సంబంధాలు నెరపే ఆర్థిక వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనల్లో పలు సంవత్సరాలు ఆయన ముఖ్య భూమిక వహించారు.

14  బోర్డ్‌ సమావేశం యథాతథం
ఈ నెల 14వ తేదీన యథాతథంగానే ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం జరుగుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశ నిర్వహణ తేదీలో ఎటువంటి మార్పూ ఉండబోదన్నారు. ఆర్‌బీఐలో నిర్వహణా పరమైన సంస్కరణలు, దిద్దుబాటు చర్యల షరతుల చట్రంలో ఉన్న పదకొండు బ్యాంకుల్లో కొన్నింటికి సడలింపులు వంటి కీలక అంశాలపై 14 మంది బోర్డ్‌ సభ్యులు ఈ సమావేశంలో చర్చిస్తారు.

దాస్‌ నియామకాన్ని తప్పుపట్టిన ఆర్థికవేత్త అభిజిత్ ముఖర్జీ ..
రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ శక్తికాంత్ దాస్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించడాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ తప్పుపట్టారు. దీనివల్ల కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో గవర్నెన్స్‌పరమైన అంశాలపై సందేహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ వంటి కీలక సంస్థల విశ్వసనీయతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, 7 శాతాన్ని మించిన వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని ముఖర్జీ పేర్కొన్నారు. ఒకవేళ ప్రస్తుత స్థాయి వృద్ధి రేటే కొనసాగిన పక్షంలో మధ్యస్త ఆదాయాలున్న దేశాల జాబితాలోకి జారిపోయే రిస్కులు ఉన్నాయన్నారు.  

ఈ నియామకం హర్షణీయం
ఆర్‌బీఐ చీఫ్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకం హర్షణీయం. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి నియామకం ఆర్‌బీఐ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నాం. కీలక కూడలిలో ఉన్న భారత్‌ ఆర్థిక వ్యవస్థకు తాజా నియామకం లాభిస్తుందని విశ్వసిస్తున్నాం. 
- రాకేశ్‌ షా, ఫిక్కీ ప్రెసిడెంట్‌
 

ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ప్రయోజనం
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నియామకం ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ద్రవ్య, వాణిజ్య పరమైన అంశాల్లో దాస్‌కు విశేష అనుభవం ఉండడమే దీనికి కారణం. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పనలోనూ ఈ నియామకం సాను‍కూల ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.
- రజనీష్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌

గొప్ప నిర్ణయం
దాస్‌కు నా శుభాకాంక్షలు. ఆయన నాకు కళాశాల రోజుల నుంచీ తెలుసు. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన, పరిపక్వత కలిగిన అధికారి ఆయన. గొప్ప టీమ్‌ లీడర్‌. ఏకాభిప్రాయ సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఆర్థికాభివృద్ధిలో, ఆర్‌బీఐ స్వతంత్ర్యత, ప్రతిష్టలను కాపాడ్డంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. 
- అమితాబ్‌కాంత్‌, నీతీ ఆయోగ్‌ సీఈఓYou may be interested

లాభాల్లోకి భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌

Wednesday 12th December 2018

ముంబై: భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ (భారతీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌) 2018-19వ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సర కాలానికి లాభాలార్జించినట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య ప్రీమియం ఆదాయం 38 శాతం పెరిగి రూ.1,087 కోట్లుగా నమోదయిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇది రూ.788 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. కంబైన్డ్‌ రేషియో (మొత్తం ప్రీమియం ఆదాయంలో

ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు నిబంధనలు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్‌ అండ్ కాస్మెటిక్స్‌ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయా లోక్‌సభకు తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్ పేరు మొదలైనవన్నీ కూడా ఈ-ఫార్మసీలు

Most from this category