STOCKS

News


మరో విడత ‘వడ్డి’ంపు!

Wednesday 3rd October 2018
news_main1538542752.png-20813

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్‌ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు  ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, క్రూడ్‌ ఆయిల్‌ తీవ్రత, రూపాయి బలహీనత, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంపు అంశాల నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్‌బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్‌ 19 నుంచి 25 మధ్య  నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక డాలర్‌ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళక కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ. అమెరికాలో వడ్డీరేటు పెరుగుతున్న పరిస్థితుల్లో, దేశీయంగా ఈ తరహా నిర్ణయం లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్‌కు తగిన రిటర్న్‌ లభించని పరిస్థితి ఉంటుంది. దీనితో దేశానికి విదేశీ నిధులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి కరెంట్‌ అకౌంట్‌ లోటుకు, రూపాయి మరింత పతనానికి దారితీస్తుంది. 3వ తేదీ నుంచీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. 5వ తేదీన కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ అంశంపై కొందరి అభిప్రాయాలు చూస్తే...

 ఎస్‌బీఐ: రూపాయి బలహీనతను అరికట్టడానికి కనీసం పావుశాతం రేటు పెంపు తప్పదని ఎస్‌బీఐ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన ‘తటస్థ వైఖరి’ని కూడా ఆర్‌బీఐ మార్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. 
  ఐఎన్‌జీ: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడ్‌ వడ్డీరేట్ల (వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతం) పెంపు  నేపథ్యంలో - దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొంటోందని ఐఎన్‌జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్‌ శక్‌పాల్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ అక్టోబర్‌4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్‌ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగనే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. 
 రాబోబ్యాంక్‌: భారత్‌ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్‌ ఎఫెక్ట్‌ కారణమవుతుందని రబోబ్యాంక్‌లో సీనియర్‌ ఎకనమిస్ట్‌ హుగో ఎర్కిన్‌ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్‌ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్‌ అకౌంట్‌పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు. 
 డీబీఎస్‌: రూపాయి బలహీనత నేపథ్యంలో- పాలసీ రేటు పెంపు ఆర్‌బీఐకి తప్పనిసరేనని, అయితే ఇక్కడ ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్‌లో డీబీఎస్‌ ఎకనమిస్ట్‌ రాధికా రావు పేర్కొన్నారు.  బ్రెంట్‌ క్రూడ్‌ ధర తీవ్రత, దేశంలో ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశాలు రేటు పెంపు నిర్ణయం పట్ల ఆర్‌బీఐ మొగ్గుచూపేలా చేస్తాయని రాధికారావు పేర్కొన్నారు. 
 మోర్గాన్‌ స్టాన్లీ: రేటు పెంపు ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. రూపాయి బలహీనత ఇక్కడ కీలకాంశం. కరెన్సీ విలువ స్థిరీకరణకు తీసుకుంటున్న చర్యలూ ఫలితమివ్వడం లేదన్న విసయాన్ని మోర్గాన్‌ స్టాన్లీ ప్రస్తావించింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్య, ద్రవ్యోల్బణం ఎగసే అవకాశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 
పెట్రో ధరల మంట...
దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం మున్ముందు పెరుగుతుందనడానికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ముందస్తు చర్య తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటు పావుశాతం పెరుగుతుందని భావిస్తున్నా.
- రాజ్‌కిరణ్‌ రాయ్‌ జీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ 
-----------------
రూపీ బలహీనత కారణంగా...
కరెన్సీ విలువ డాలర్‌ మారకంలో భారీగా పడిపోతోంది. ఆయా పరిణామాలను ఎదుర్కొనడానికి పావుశాతం రేటు పెంపు తక్షణ అవసరం. 
- కేకి మిస్త్రీ, హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్మన్‌
---------
రయ్‌మంటున్న క్రూడ్‌...
అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో క్రూడ్‌ ధరలు నాలుగున్నర సంవత్సరాల గరిష్టస్థాయికి చేరాయి. మంగళవారం నైమెక్స్‌ క్రూడ్‌  బేరల్‌ ధర 75.91 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 75.30 వద్ద ట్రేడవుతోంది. ఇక భారత్‌ ప్రధానంగా వినియోగించే బ్రెంట్‌ ధర 85.36 స్థాయిని తాకి, అదే స్థాయిలో ట్రేడవుతోంది. సరఫరా పరమైన ఆందోళనలు అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదలకు కారణం.  100 డాలర్లకు బ్రెంట్‌ చేరుతుందన్న అంచనాలు భారత్‌ వంటి వర్థమాన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. 

జారిపోతున్న రూపాయి...
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ పడిపోతోంది.  మంగళవారం నైమెక్స్‌లో రూపాయి విలువ డాలర్‌ మారకంలో 73.77కు పడిపోయింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 73.30 వద్ద ట్రేడవుతోంది. ఇక ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ మళ్లీ 95 పటిష్ట స్థాయిని దాటింది. దేశీయ ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఇప్పటికి రూపాయి ఇంట్రాడే రికార్డు 72.99 అయితే, ముగింపులో రికార్డు 72.98. అంతర్జాతీయ ట్రేడింగ్‌ ధోరణిని చూస్తుంటే, బుధవారం దేశీయంగా 73ను రూపాయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.You may be interested

ఈ-గ్రోసరీ స్పేస్‌లో హోరాహోరీ

Wednesday 3rd October 2018

ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఈ-గ్రోసరీ సెగ్మెంట్‌ఈ-గ్రోసరీ సెగ్మెంట్‌ (ఆన్‌లైన్‌ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్‌ ఆర్డర్‌ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్‌ కేక్‌. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ-గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, -మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ

ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం .. బ్యాంకులకు వరం

Wednesday 3rd October 2018

ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం మరింతగా ముదురుతుండటం.. వాణిజ్య బ్యాంకులకు వరంగా మారొచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకింగ్ సంస్థ డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని అవకాశంగా మల్చుకుని బ్యాంకులు మళ్లీ కార్పొరేట్ల రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రుణ అవసరాలు తీర్చేందుకు బ్యాంకులే ప్రధాన వనరుగా మారవచ్చని వివరించింది. మొండిబాకీల సమస్యలతో 11 ప్రభుత్వ

Most from this category