STOCKS

News


ఎక్కడి రేట్లు అక్కడే..!

Monday 3rd December 2018
news_main1543813037.png-22582

- యథాతథ స్థితిని కొసాగించవచ్చు...
- నిపుణుల అంచనా...
- 5న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ గత సమీక్ష(అక్టోబర్‌)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్‌బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా ఆర్‌బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్‌ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్‌ఆర్‌(నగదు నిల్వల నిష్పత్తి- బ్యాంకులు తమ డిపాజిట్‌ నిల్వల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం-దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది.
రూపాయి రివర్స్‌గేర్‌...
అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72-73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్‌ క్రూడ్‌) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్‌బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018-19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతానికి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం.

ఎవరేమంటున్నారంటే...
ఆర్‌బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.9-4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9-4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో 4.5 శాతం స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం. మరోపక్క, అధిక పెట్రో ధరలు శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్‌ రీసెర్చ్‌ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ దేవేంద్ర కుమార్‌ పంత్‌ అంచనా వేశారు. ఈ తరుణంలో తాజా పాలసీలో ఆర్‌బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు.



You may be interested

నవంబర్‌లోనూ అటో అమ్మకాలు నిదానమే

Monday 3rd December 2018

మారుతి, ఎంఅండ్‌ఎం, హోండా కార్ల అమ్మకాల్లో వృద్ధి టాటా, హ్యుందాయ్‌, టయోటా విక్రయాలు తగ్గుదల న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ నవంబర్‌లోనూ ఆటోమొబైల్‌ కంపెనీలకు ఆనందాన్నివ్వలేదు. స్థూల ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో పండుగల విక్రయాలు జోరుగా సాగలేదు. ప్రధాన కంపెనీలైన మారుతి సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు పెరగ్గా, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, టయోటా విక్రయాలు తగ్గాయి. - మారుతి సుజుకి

వాణిజ్యయుద్ధానికి తాత్కలిక బ్రేకులు

Monday 3rd December 2018

- అమెరికా, చైనా సంధి!! - వివాదాల పరిష్కారానికి నిర్ణయం - ప్రస్తుతానికి కొత్త టారిఫ్‌లు విధించబోమని ట్రంప్‌ హామీ - వాణిజ్య లోటు భర్తీకి జింగ్‌ భరోసా బ్యూనస్‌ ఎయిర్స్‌:- దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య  ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు

Most from this category