News


ఆర్‌బీఐ గవర్నరు రాజీనామా!

Tuesday 11th December 2018
news_main1544504154.png-22814

ఆరంభంలోనే పెద్ద నోట్ల రద్దులాంటి ఆర్థిక సునామీలను నిబ్బరంగా తట్టుకున్న భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌... ఆకస్మికంగా రాజీనామా చేసి అందరినీ నివ్వెరపరిచారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్‌పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐలోని విరాళ్‌ ఆచార్య వంటి డెప్యూటీ గవర్నర్లు దీనిపై మాట్లాడారు గానీ... మితభాషి, మృదుభాషిగా పేరున్న పటేల్‌ మాత్రం మాట్లాడలేదు. చివరికి రాజీనామా చేసేటపుడూ ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖను పొగడటం, తెగడటం వంటివేమీ చేయలేదు. పదవీకాలంలో సహకారం అందించిన సహోద్యోగులకు మాత్రం ధన్యవాదాలు తెలిపారు. 
నిజానికి రెండేళ్ల కిందట పెద్ద నోట్ల రద్దును ప్రధాన మంత్రి ప్రకటించినపుడు... జనం ఇబ్బందుల దృష్ట్యా ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌పై పలు విమర్శలొచ్చాయి. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు పడింది. కానీ తరవాత దాన్నుంచి మెల్లగా బయటపడ్డారు. కఠిన నిర్ణయాలతో స్వతంత్రంగా తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఆయన విధానాలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ని లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది కూడా. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అకస్మాత్తుగా పటేల్‌ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ దశలో ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నప్పటికీ... పదవీకాలం మరో ఎనిమిది నెలలు ఉండగానే పటేల్‌ రాజీనామా చేయడం గమనార్హం. 
బ్యాంకింగ్‌ను చక్కదిద్దారు: ప్రధాని
గందరగోళంగా ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దారని, క్రమశిక్షణలో పెట్టారని ఉర్జిత్‌ పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. చిత్తశుద్ధి గల ప్రొఫెషనల్‌ అని కితాబిచ్చారు.  ‘‘స్థూల ఆర్థిక అంశాలపై అపారమైన అవగాహన గల గొప్ప ఆర్థిక వేత్త ఉర్జిత్‌ పటేల్‌. బ్యాంకింగ్‌ వ్యవస్థను గందరగోళ పరిస్థితి నుంచి బయటపడేసి చక్కదిద్దారు. క్రమశిక్షణలో పెట్టారు. ఆయన సారథ్యంలో ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలిగింది. ఆర్‌బీఐలో ఆరేళ్ల పాటు డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయనందించిన సేవలు విస్మరించరానివి’  అని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌లో మోదీ వివరించారు.
పటేల్‌ సేవలు భేష్‌: జైట్లీ
ఆర్‌బీఐ గవర్నర్‌గా పటేల్‌ ఎనలేని సేవలందించారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసించారు. ఆయన విజ్ఞానంతో తాను కూడా లబ్ధి పొందానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ’ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ దేశానికి ఎనలేని సేవలందించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను ’  అని జైట్లీ పేర్కొన్నారు.
షాక్‌ అయ్యా : గురుమూర్తి
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా తనను షాక్‌కు గురిచేసిందని రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు స్వతంత్ర డైరెక్టర్, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్‌ గురుమూర్తి వ్యాఖ్యానించారు. వివాదాస్పద అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ ఒక అంగీకారానికి వస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆశ్చర్యకరమన్నారు. ఈ ప్రక్రియకు దీంతో విఘాతం ఏర్పడే అవకాశం ఉందని ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్రం, ఆర్‌బీఐకి విభేదాల నేపథ్యంలో నవంబర్‌ 19న బోర్డు సమావేశం సామరస్యంగానే జరిగినప్పటికీ, పటేల్‌ రాజీనామా నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చిందన్నారు. ‘’చాలా అంశాలపై మేం ఇద్దరు గంటలకొద్దీ వ్యక్తిగతంగా చర్చించుకునేవాళ్లం. చాలా విషయాల్లో ఏకాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలూ ఉండేవి. కానీ ఈ చర్చలు సుహృద్భావ ధోరణిలోనే జరిగేవి. భిన్నాభిప్రాయాల ఏకీకరణ ప్రక్రియపై ఆయన రాజీనామా ప్రభావం కచ్చితంగా ఉంటుంది‘ అని గురుమూర్తి తెలిపారు.

నోట్ల రద్దుకు నాయకత్వం...!
2016లో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించకుండా... ఆ స్థానంలో పటేల్‌ను (55) నియమించింది బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. 2016 సెప్టెంబర్‌ 5న ఆయన ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు దాకా అప్పటి గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సారథ్యంలో డెప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. 1992 తర్వాత అత్యంత తక్కువ కాలం ఈ హోదాలో ఉన్న గవర్నర్‌ ఉర్జిత్‌ పటేలే. మూడేళ్ల పాటు గవర్నర్‌గా నియమితులైన పటేల్‌ పదవీకాలం ముగియడానికి మరో ఎనిమిది నెలలుంది. రెండో దఫా పదవీకాలం పొడిగింపునకు కూడా అవకాశం ఉండేది. సాధారణంగా ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులయ్యేందుకు ఎక్కువగా బ్యూరోక్రాట్లు, ఆర్థికవేత్తలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ, కార్పొరేట్‌ నేపథ్యం కూడా ఉన్న కొద్ది మంది ఆర్‌బీఐ గవర్నర్లలో పటేల్‌ ఒకరు. రిజర్వు బ్యాంకుకు రావటానికి ముందు.. ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్‌) పాటు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాల్లో పని చేశారు. డెప్యుటీ గవర్నర్‌గా సేవలందించి పూర్తి స్థాయి గవర్నర్‌గా ఎదిగిన వారి జాబితాలో పటేల్‌ది 8వ స్థానం. చివరిసారిగా వైవీ రెడ్డి ఇలాగే నియమితులయ్యారు. మరికొందరు డెప్యుటీ గవర్నర్లు కూడా గవర్నర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. తాత్కాలికంగానే ఆ బాధ్యతలు చేపట్టారు. ఆర్‌బీఐ గవర్నర్లుగా చేసిన వారిలో చాలా మందికి ఐఎంఎఫ్‌తో కూడా అనుబంధం ఉంది. కొందరు ఐఎంఎఫ్‌లో పనిచేసిన తర్వాత గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టగా.. మరికొందరు గవర్నర్లుగా పదవీ విరమణ అనంతరం ఐఎంఎఫ్‌లో సేవలందించారు.

రాజీనామాకు కారణాలు ఇవేనా..?
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్‌ పటేల్‌ చెబుతున్నప్పటికీ.. అంతకు మించిన కారణాలే ఉన్నాయని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. పలు అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వివాదాలు రేగాయి. ఇవే అంతిమంగా పటేల్‌ నిష్క్రమణకు దారి తీసి ఉంటాయన్నది ఆర్థిక నిపుణుల మాట. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని డెప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అక్టోబƇ 26న ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించడం వివాదానికి ఆజ్యం పోసింది. లిక్విడిటీ మొదలుకుని రుణ వితరణ, బలహీన ప్రభుత్వ బ్యాంకుల నియంత్రణ దాకా అనేక విషయాల్లో ప్రభుత్వంతో విభేదాలను బయటపెట్టింది. ఒక దశలో ఆర్‌బీఐని కట్టడి చేసేందుకు కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్‌ 7(ఎ) నిబంధనను ప్రయోగించిందనే వార్తలొచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. అయితే, పలు అంశాలకు సంబంధించి బోర్డులోని ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆర్‌బీఐపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగించింది. ఈ నేపథ్యంలో గత నెలలో తలపెట్టిన బోర్డు సమావేశానికి ముందే పటేల్‌ రాజీనామా చేయొచ్చననే వార్తలు వచ్చినప్పటికీ అప్పటికి కాస్త సద్దుమణిగింది. బోర్డు సమావేశంలో మధ్యేమార్గంగా రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన కొన్ని చర్యలను ప్రతిపాదించారు. ఫలితంగా ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా కొన్ని బ్యాంకులు మొండిబాకీలపరంగా కఠినతర చర్యల నుంచి బయటపడేందుకు వీలయింది. మిగతా అంశాల్లోనూ సంధి కుదరవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ పటేల్‌ అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతిమంగా పటేల్‌ రాజీనామాకు దారితీసిన అంశాలు దాదాపు ఆరు ఉన్నాయి. అవి..

1. వడ్డీ రేట్లు
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటమే లక్ష్యంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించటం, పెంచడం, యథాతథంగా కొనసాగించటం వంటివి చేస్తుంది. అయితే వృద్ధి గణాంకాల కోసం తాపత్రయపడుతున్న కేంద్రానికి ఇది సమస్యగా మారింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గిస్తేనే రుణాలు పెరిగి, వృద్ధి రేటు పెరగటం సాధ్యమవుతుందన్నది కేంద్రం ఆలోచన. కానీ ద్రవ్యోల్బణం దృష్ట్యా అప్పటికి తగినట్లుగా ఆర్‌బీఐ వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై  అసంతృప్తిగా ఉన్న కేంద్రం... ఆర్‌బీఐ నియంత్రణలోని నిబంధనల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది.

2. ఎన్‌పీఏల వర్గీకరణ..
బ్యాంకులు మొండి బకాయిలను (ఎన్‌పీఏ) వర్గీకరించడానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్‌ ఇరువురి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని కేంద్రం భావించింది. తాజా సర్క్యులర్‌ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏలు మరింత పెరిగాయి. ఇవి కేటాయింపుల్ని మరింత పెంచాల్సి రావటంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ భారీ నష్టాలు నమోదు చేశాయి.

3. నీరవ్‌ మోదీ కుంభకోణం..
అదే సమయంలో నీరవ్‌ మోదీ కుంభకోణం చోటు చేసుకోవడంతో రెండింటి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆర్‌బీఐ పర్యవేక్షణా లోపాల కారణంగానే ఇలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లాగా ఆజమాయిషీ చేసేందుకు తమకు పూర్తి అధికారాల్లేవని, మరిన్ని అధికారాలు ఇస్తే కచ్చితంగా నియంత్రించగలమంటూ పటేల్‌ కౌంటర్‌ ఇచ్చారు కూడా!!.

4. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం..
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ పరిణామాల అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ కొరత ఏర్పడింది. కొత్తగా రుణాలు జారీ చేయటానికి... తాము బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఇబ్బందులు పడ్డాయి. ఈ లిక్విడిటీ కష్టాల నుంచి వీటిని గట్టెక్కించాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచించింది. కానీ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉందంటూ.. రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్రం ఒత్తిళ్లను పట్టించుకోలేదు.

5. నచికేత్‌ మోర్‌ తొలగింపు..
పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు నచికేత్‌ మోర్‌ను కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా కేంద్రం తొలగించింది. ఇది ఆర్‌బీఐని చికాకుపరిచింది. మరింత డివిడెండు ఇవ్వాలంటూ ఆర్‌బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తుండటాన్ని మోర్‌ గట్టిగా వ్యతిరేకించడమే ఆయన తొలగింపునకు దారి తీసిందన్న అభిప్రాయం నెలకొంది.

6. పేమెంట్స్‌ సంస్థల నియంత్రణ అంశం..
గూగుల్‌, పేటీఎం తదితర చెల్లింపు సంస్థల నియంత్రణను ఆర్‌బీఐకి కాకుండా వేరే నియంత్రణ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. దీన్ని తామెందుకు వ్యతిరేకిస్తున్నామో ఆర్‌బీఐ బహిరంగంగానే వివరణనిచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను తాము ఎందుకు తిరస్కరిస్తున్నామో వివరిస్తూ రూపొందించిన నోట్‌ను ప్రత్యేకంగా తమ వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది. 

 వ్యక్తిగత కారణాల వల్లే...
"వ్యక్తిగత కారణాల రీత్యా, ప్రస్తుత హోదా నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కొన్నాళ్లుగా రిజర్వ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇటీవలి కాలంలో బ్యాంకు సాధించిన విజయాలు ఆర్‌బీఐ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం ఎనలేని సహకారంతోనే సాధ్యపడ్డాయి. ఈ సందర్భంగా నా సహోద్యోగులు, ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు తెలపదల్చుకున్నాను’
- ఉర్జిత్‌ పటేల్‌
 

ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ..
ఎకానమీ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత రుణంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం దురదృష్టకరం. ఎకానమీకి ఇది పెద్ద దెబ్బ.

- మాజీ ప్రధాని మన్మోహన్ ‍సింగ్‌

రాజీనామా చేసిన ‍ఐదో గవర్నర్‌..
స్వాతంత్ర్యానంతరం ఇప్పటిదాకా ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన వారిలో ఉర్జిత్ పటేల్ అయిదోవారు. 1957లో అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారితో విభేదాల కారణంగా బెనెగల్‌ రామా రావు రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడు 1977లో కేఆర్‌ పురి, 1990లో ఆర్‌ఎన్ మల్హోత్రా తప్పుకున్నారు. 1992లో ఎస్ వెంకటరమణన్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా వైదొలిగారు.

ఈ నలుగురిలో.. ఉర్జిత్‌ వారసుడెవరు?
ఆర్‌బీఐ గవర్నరు పదవికి ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మికంగా రాజీనామా చేయటంతో కీలక పదవికి ఖాళీ ఏర్పడింది. బ్యాంకింగ్‌ రంగాన్ని నడిపించటమే కాదు... తద్వారా యావత్తు ఆర్థిక వ్యవస్థకూ దిశానిర్దేశం చేసే ఈ కీలక పదవి తదుపరి ఎవరిని వరిస్తుందనే విషయమై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికయితే ఆర్‌బీఐ డెప్యూటీ గవర్నరు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌, సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఆర్‌బీఐ 25వ గవర్నరుగా బాధ్యతలు చేపట్టవచ్చనేది ఆర్థిక వర్గాల అంచనా. 
విశ్వనాథన్‌ లేదా సుభాష్‌ చంద్రగార్గ్‌? 
డెప్యూటీ గవర్నర్లను గవర్నర్‌గా నియమించటమనే సంప్రదాయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఉర్జిత్‌ పటేల్‌ కూడా అలా వచ్చినవారే. రఘురామ్‌ రాజన్‌కు తదుపరి పొడిగింపు ఇస్తారని అంతా ఊహిస్తున్న సమయంలో కొన్ని అంశాల్లో విభేదాల వల్ల కేంద్రం ఆయనకు మరోసారి పొడగింపు ఇవ్వలేదు. అప్పటికప్పుడు కొత్త గవర్నర్‌గా వచ్చే వ్యక్తికి ఆర్‌బీఐపై పూర్తి అవగాహన ఉండాలి కనక అప్పట్లో ఉర్జిత్‌ను ఎంచుకుందనే వాదనలు వినిపించాయి. 
ఇప్పుడు పరిస్థితి ఇంకాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే పటేల్‌ రాజీనామా ముందుగా తెలిసినది కాదు. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కనక... కొత్తగా వచ్చే గవర్నరు ఆ వ్యవస్థతో బాగా సంబంధం ఉన్నవారైతేనే నయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సహజంగానే డెప్యూటీ గవర్నరు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ పేరు వినిపిస్తోంది. ఇప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలంటే సమర్థుడైన డెప్యూటీ గవర్నరుకే బాధ్యతలు అప్పగించటం మంచిదన్నది ఆర్థిక వర్గాల భావన. ఇక సుభాష్‌ చంద్ర గార్గ్‌ను తీసుకున్నా ఆయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. పైపెచ్చు ఈ హోదాలో ఆర్‌బీఐ బోర్డులోనూ కొనసాగుతున్నారు. కాబట్టే ఈయన పేరు కూడా తెరపైకి వస్తోంది. 
శక్తికాంత దాస్‌, అజయ్‌ త్యాగి కూడా...
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మార్కెట్లకు సంబంధించి పలు సంస్కరణలు తేవటంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పలు అంశాల్లో దన్నుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ గతంలో ఆ హోదాలో ఆర్‌బీఐ బోర్డులో కొన్నాళ్లున్నారు. ఆయనకూ ఆర్‌బీఐ గవర్నెన్స్‌ పట్ల అవగాహన ఉంది. పైపెచ్చు ఆయనకు మోదీ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా గార్గ్‌, దాస్‌ పేర్లు కూడా గవర్నర్‌ పదవి రేసులో వినిపిస్తున్నాయి.
ఇదీ... ఆర్‌బీఐ బోర్డు
డెప్యూటీ గవర్నర్లు నలుగురు...
- ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, విరాల్‌ ఆచార్య, బి.పి.కానుంగో, మహేశ్‌కుమార్‌ జైన్‌
- డైరెక్టర్లు 12 మంది: పీకే మహంతి, డి.ఎస్‌.సంఘ్వీ, రేవతీ అయ్యర్‌, సచిన్‌ చతుర్వేది, నటరాజన్‌ చంద్రశేఖరన్‌, బీఎన్‌ జోషి, సుధీర్‌ మన్కడ్‌, అశోక్‌ గులాటీ, మనీష్‌ సబర్వాల్‌, ఎస్‌కే మరాఠీ, స్వామినాథన్‌ గురుమూర్తి, సుభాష్‌ చంద్రగార్గ్‌, రాజీవ్‌ కుమార్‌. 
- ద్రవ్య పరపతి విధాన సమీక్ష కమిటీ సభ్యులు ఐదురుగు: డెప్యూటీ గవర్నరు విరాల్‌ ఆచార్య, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దేబబ్రత పాత్ర, రవీంద్ర హెచ్‌ ధోలాకియా, పామీ దువా, ఛేతన్‌ ఘాటే. 
తక్షణం తాత్కాలిక గవర్నర్‌ నియామకం.
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం తాత్కాలిక గవర్నర్‌ను నియమించాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. తరవాతే కొత్త గవర్నర్‌ నియామకం జరుపుతారన్నది ఆయన అభిప్రాయం. గవర్నర్‌ లేదా డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు తానుగా కానీ లేదా ఆర్‌బీఐ బోర్డు సిఫారసుల ప్రాతిపదికనగానీ కొత్త నియామకం జరపాల్సి ఉంటుందని ఆర్‌బీఐ యాక్ట్‌, 1934 పేర్కొంటోంది. 
 కేంద్రం తగిన నిర్ణయం
ఆర్‌బీఐ కార్యకలాపాల పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఆర్‌బీఐ- కేంద్రం మధ్య సన్నిహిత సహకారమూ అవసరమే. అందుకని గవర్నర్‌ నియామకంపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నా.
- రాకేష్‌ మోహన్‌, ఆర్‌బీఐ మాజీ డెప్యూటీ గవర్నర్‌
 కేంద్రానికి ‘ప్లాన్‌ బీ’ ఉంటుంది...
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై కేంద్రానికి ఎప్పుడూ ‘ప్లాన్‌ బీ’ ఉంటుంది. వెంటనే నియామకం జరిపితే, ఇప్పటికే ఒకరు ఎంపికైపోయారన్న భావన వ్యక్తమవుతుంది. వారం దాటిపోతే ఇదంతా రాజకీయమైపోతుంది. వీటన్నింటినీ సమతౌల్యం చేస్తూ నిర్ణయం ఉంటుంది
- ప్రణబ్‌ సేన్‌, మాజీ చీఫ్‌ స్టాటిస్టీషియన్‌

షాక్‌కి గురి చేసింది: ఉద్యోగుల సంఘం
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై అఖిల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం షాక్ వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయంలో నెలకొన్న విభేదాలు కూడా ఇందుకు కారణం కావొచ్చని పేర్కొంది. "ఈ వార్త షాక్‌లాగా తగిలింది. ఆయన రాజీనామా నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాకపోవచ్చు. ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మిగులు నిధుల బదలాయింపు అంశం కూడా ఒక కారణమై ఉంటుంది" అని యూనియన్ పేర్కొంది. 

సజావుగా బాధ్యతల బదలాయింపు జరగాలి: పరిశ్రమ వర్గాలు
పటేల్ రాజీనామా నేపథ్యంలో తదుపరి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో బాధ్యతల బదలాయింపు సాఫీగా జరగాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. "ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా రాజకీయ కోణంలో చూసే అవకాశం ఉంది. అయితే, దీని ద్వారా ఎలాంటి సంకేతాలు వెడుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలి. సమర్ధులైన వారిని నియమిస్తే.. ఈ సంక్షోభం సమసిపోయే అవకాశం ఉంది" అని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వాల్ అభిప్రాయపడ్డారు. "వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. ఆర్‌బీఐ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉంటుందని భావించడం లేదు. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. దాన్ని జోక్యం చేసుకోవడంగా భావించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా.. బాధ్యతల బదలాయింపు సాఫీగా జరగాలని, అంతిమంగా ఎకానమీకి ప్రయోజనం చేకూరేలా ఉండాలని కోరుకుంటున్నాం" అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. 

 

రాజీ నుంచి... రాజీనామాకు!!
పటేల్‌ రాజీనామాకు బీజం ఎప్పుడు పడిందో తెలుసా? ఈ ఏడాది ఆగస్టు 8న. ఆ తరవాత ఆయన రాజీనామా చేస్తారనే వదంతులూ వచ్చాయి. అప్పట్లో పరిస్థితి సర్దు మణిగినా... ఇప్పుడు తప్పలేదు. ఆ పరిణామాలు చూస్తే...

2018 ఆగస్టు 8: ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్ రంగ నిపుణుడు సతీష్ మరాఠీలను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. 

సెప్టెంబర్ మధ్యలో: ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు, ప్రముఖ బ్యాంకరు నచికేత్ మోర్‌కు అర్ధాంతరంగా ఉద్వాసన పలికింది. 

అక్టోబర్ 10: డజను పైగా డిమాండ్లకు అంగీకరించేలా రిజర్వ్ బ్యాంక్‌ మెడలు వంచేందుకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7 నిబంధనను ప్రయోగిస్తూ ఆర్‌బీఐకి కేంద్రం మూడు లేఖలు రాసింది. వీటికి ఆర్‌బీఐ వారం రోజుల తర్వాత సమాధానాలిచ్చింది.

అక్టోబర్ 23:  ఆర్‌బీఐ దాదాపు ఎనిమిది గంటలపాటు మారథాన్ సమావేశం నిర్వహించింది. కానీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై పరిష్కారం లభించకుండానే సమావేశం ముగిసింది.

అక్టోబర్‌ 26: ఆర్‌బీఐ అటానమీని కాపాడాల్సిన అవసరంపై డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాపాడకుంటే మార్కెట్ల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు.

అక్టోబర్ 29: మరో డిప్యుటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ కూడా గళమెత్తారు. బ్యాంకుల మూలధన నిష్పత్తులను తగ్గించే విషయంలో ఆర్‌బీఐ విముఖతను స్పష్టం చేశారు. 

అక్టోబర్ 31: ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరింత మెరుగైన గవర్నెన్స్ అవసరమని పేర్కొంది.

నవంబర్ 3: మార్కెట్‌ సూచీలు, రూపాయి, క్రూడ్ ధరలు అన్నీ బాగానే పుంజుకుంటున్నాయంటూ... కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్‍బీఐ స్వయం ప్రతిపత్తిపై విరల్ ఆచార్య వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అదే నెల 9వ తారీఖున.. ఆర్‌బీఐ దగ్గర అసలు ఎన్ని నిధులు ఉండాలన్నది నిర్ణయించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొనడం మంచిది కాదని గురుమూర్తి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు నిధులందకుండా చేయడం ద్వారా వృద్ధికి విఘాతం కలిగించకూడదంటూ నవంబర్ 17న ఆర్‌బీఐ బోర్డు సమావేశానికి రెండు రోజులు ముందు.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

నవంబర్ 19: పది గంటల పాటు ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు భేటీ. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్నది తేల్చేందుకు ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం. చిన్న సంస్థలకు ఊరటనిచ్చే చర్యలు.

డిసెంబర్ 5: ఆర్‌బీఐ, కేంద్రం మధ్య సంధి వార్తల నేపథ్యంలో విభేదాలపై స్పందించేందుకు పటేల్ నిరాకరణ.

డిసెంబర్ 10: వ్యక్తిగత కారణాలతో గవర్నర్‌ పదవికి పటేల్ రాజీనామా. You may be interested

ఎన్‌పీఎస్‌కు పూర్తిగా పన్ను మినహాయింపు 

Tuesday 11th December 2018

న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్‌పీఎస్‌ నుంచి రిటైర్మెంట్‌ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌ పథకాల మాదిరే ఎన్‌పీఎస్‌కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ

నిట్టనిలువునా రూపీ పతనం ..

Tuesday 11th December 2018

ఇండియన్‌ రూపాయి మంగళవారం భారీగా పతనమైంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం ఇందుకు కారణం. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.46 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ముగింపు స్థాయి 71.32తో పోలిస్తే 1.5 శాతం క్షీణించింది. 114 పైసలు నష్టపోయింది. డాలర్‌ ఇతర కరెన్సీలతో పోలిస్తే బలపడటం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది. రూపాయి మంగళవారం 72.44 వద్ద ప్రారంభమైంది.

Most from this category