News


వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు?

Friday 22nd February 2019
news_main1550825834.png-24276

- బ్యాంకర్లకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ప్రశ్న
- బ్యాంకింగ్‌ అధికారులతో భేటీ
- రేట్ల కోత లాభం కస్టమర్లకు చేరాలని స్పష్టీకరణ

ముంబై: బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. పాలసీ రేటు తగ్గింపు అమల్లో జాప్యం ఎందుకని ఆయన బ్యాంకర్లను ప్రశ్నించారు. శక్తికాంతదాస్‌ గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐకి లభించే వడ్డీరేటు) తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం, రుణ వృద్ధి వంటి అంశాలపై ఆయన బ్యాంకర్లతో చర్చించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తదతర బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న ఆర్‌బీఐ రెపో రేటును 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంకర్లతో తాజాగా ఆర్‌బీఐ చీఫ్‌ సమావేశమయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ రుణరేట్లును తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం మనకు చెప్పింది. సెంట్రల్‌ బ్యాంక్‌ తన విధాన రేట్లను తగ్గించినప్పుడు కస్టమర్లకు ఈ ప్రయోజనం అందితీరాలి’’ అని గవర్నర్‌ స్పష్టం చేశారు. తమ నెలవారీ అసెట్‌ లయబిలిటీ కమిటీ సమీక్షల్లో వడ్డీరేట్ల తగ్గింపుపై దృష్టి సారించి ఒక నిర్ణయానికి వస్తామని శక్తికాంతదాస్‌కు బ్యాంకర్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. 

దువ్వూరి నుంచీ ఇదే సమస్య...
ఆర్‌బీఐ రేటు తగ్గిస్తున్నప్పటికీ, ఈ ప్రయోజనాన్ని బ్యాంకర్లు బదలాయించకపోవడంతో ప్రధానంగా పరిశ్రమ నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తోంది. నిధుల సమీకరణ వ్యయాల భారం, ఇప్పటికే ఉన్న మొండిబకాయిలు, తగ్గిపోతున్న మార్జిన్లు వంటి అంశాలను బ్యాంకులు సాకుగా చూపుతున్నాయి. గత పావుశాతం పాలసీ రేటు తగ్గింపు సందర్భంగా కూడా కేవలం రెండే బ్యాంకులు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలే రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. అదీ కేవలం ఐదు బేసిస్‌ పాయింట్లే (100 బేస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించాయి. దువ్వూరి సుబ్బారావు గవర్నర్‌గా ఉన్న సమయం నుంచీ ఆర్‌బీఐ- బ్యాంకర్ల మధ్య పాలసీ రేటు బదలాయింపుపైనే వివాదం ఉంది. కేవలం ఇదే ప్రయోజనం నిమిత్తం 2013 జూలైలో దువ్వూరి బీపీఎల్‌ఆర్‌ ఆధారిత రేటు స్థానంలో బేస్‌ రేటును తీసుకువచ్చారు. అప్పటికీ ఫలితం రాకపోవడంతో తదుపరి గవర్నర్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ 2015 ఏప్రిల్‌ నుంచి స్వల్పకాలిక నిధుల సమీకరణ వ్యయ ప్రాతిపాదికన ఎంసీఎల్‌ఆర్‌ను (మార్జినల్‌ కాస్ట బేస్డ్‌ ఫండింగ్‌) తీసుకువచ్చారు. అయినా ఇందుకు సంబంధించిన పరిస్థితులపై బ్యాంకింగ్‌ తీరుపట్ల ఆర్‌బీఐ సానుకూలంగా లేకపోవడం గమనార్హం. 

ఏప్రిల్‌ నుంచీ కొత్త రేటు విధానం?
ప్రస్తుత నిబంధనల ప్రకారం- వడ్డీ తగ్గింపునకు ఆర్‌బీఐ ‍కేవలం సూచనలు ఇవ్వగలదుతప్ప, ఎటువంటి ఆదేశాలూ జారీచేయలేదు. సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం ఆర్‌బీఐ పరిశీలినలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత ప్రైసింగ్‌ విధానం పరిశీలనలో ఉంది. శక్తికాంత్‌దాస్‌ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్‌ పటేల్‌ నుంచి ఈ విధాన ప్రతిపాదన తొలుత వచ్చింది. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ బాగుంటే ఏప్రిల్‌లో కొత్త రేటు విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రేటు ప్రయోజన బదలాయింపు అంశాలపై చర్చలకు మరోదఫా ఆర్‌బీఐ చీఫ్‌ బ్యాంకర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉందని ఒక బ్యాంకర్‌ పేర్కొనడం గమనార్హం.



You may be interested

రూ. 260 కోట్లు కడతాం... అనుమతివ్వండి

Friday 22nd February 2019

- ఎరిక్సన్‌ బకాయిలపై బ్యాంకుల్ని కోరిన ఆర్‌కామ్ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్‌కు బాకీల చెల్లింపుల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) నిధుల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆదాయ పన్ను రిఫండ్ ‍ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించేందుకు సత్వరం అనుమతివ్వాలంటూ రుణదాతలను అభ్యర్థించింది. "ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిఫండ్స్ రూపంలో వచ్చిన సుమారు రూ.260 కోట్లను బ్యాంక్

తెలుగు రాష్ట్రాల్లో ‘సిమెంటు’ జోరు

Friday 22nd February 2019

- అత్యధికంగా 47 శాతం వృద్ధి నమోదు - అమ్మకాల్లో దేశంలోనే తొలి స్థానం - 2018లో 2.89 కోట్ల టన్నుల విక్రయం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు విక్రయాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మంచి జోరు మీదున్నాయి. 2017తో పోలిస్తే 2018లో అమ్మకాల్లో ఏకంగా 47 శాతం వృద్ధి నమోదయింది. అమ్మకాల్లో వృద్ధి పరంగా తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2017లో 1.96 కోట్ల టన్నుల

Most from this category