STOCKS

News


తక్షణం రూ.1.2 లక్షల కోట్లు కావాలి

Wednesday 7th November 2018
news_main1541576222.png-21767

 ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలపై క్రిసిల్ నివేదిక
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్‌బీలు బలహీన మార్కెట్ వేల్యుయేషన్స్‌, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ మేరకు నిధులు సమకూర్చిన పక్షంలో ఆర్థిక గణాంకాలు లెక్క తప్పే ప్రమాదముందని, ఈసారి ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేకపోవచ్చని నివేదికను రూపొందించిన క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్‌ సీతారామన్ తెలిపారు.
    పీఎస్‌బీలకు రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తామంటూ 2017 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా ఇందులో రూ. 1.12 లక్షల కోట్లు సమకూర్చగా, బ్యాంకులు మరో రూ. 12,000 కోట్లు మాత్రమే మార్కెట్ల నుంచి సమీకరించుకోగలిగాయి. పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, వేల్యుయేషన్లు బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతల కారణంగా పీఎస్‌బీలు ప్రస్తుతం మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించుకునే పరిస్థితి లేదని కృష్ణన్ తెలిపారు. అయితే, పటిష్టమైన బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న వాటిని విలీనం చేయడం ద్వారా అదనపు మూలధన అవసరాలు కొంత మేర తగ్గొచ్చని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ వైద్యనాథన్ రామస్వామి చెప్పారు. మార్కెట్ల నుంచే మూలధనం సమీకరించుకునేలా మెరుగ్గా ఉన్న బ్యాంకులను ప్రోత్సహించవచ్చన్నారు.

రూ. 20 వేల కోట్ల సమీకరణలో ఎస్‌బీఐ..
కార్యకలాపాల విస్తరణ తదితర అవసరాల కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌ సహా వివిధ మార్గాల్లో ఈ నిధులు సమీకరించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్ 7న బ్యాంక్ షేర్‌హోల్డర్లు సమావేశం కానున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.



You may be interested

ఆర్‌బీఐ స్వతంత్ర​తను గౌరవించాల్సిందే..!

Wednesday 7th November 2018

- అది సీట్‌బెల్ట్‌ లాంటిది; పెట్టుకోకుంటే ప్రమాదం - ప్రభుత్వ ఒత్తిళ్లకు నో చెప్పే స్వేచ్ఛ దానికి ఉండాలి - బ్యాంక్‌ బోర్డు ద్రావిడ్‌లా ఆడాలి .. సిద్ధూలా కాదు - ద్రవ్యోల్బణం ఓకే... ఉద్యోగాల కల్పన పెరగాలి - లిక్విడిటీ సమస్య పరిష్కరించలేనంత పెద్దది కాదు - ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్‌ బ్యాంక్‌కు మధ్య రగులుతున్న వివాదంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పందించారు. రిజర్వ్‌

రూ.1,331కే గోఎయిర్‌ టికెట్‌...

Wednesday 7th November 2018

న్యూఢిల్లీ:- బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ రూ.1,313(అన్నీ కలుపుకొని) ధరకే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 13 లక్షల సీట్లను ఆఫర్‌ చేస్తున్నామని గోఎయిర్‌ తెలిపింది. ఈ టికెట్లకు బుకింగ్స్‌ ఈ నెల 5 నుంచే ఆరం‍భమయ్యాయని, ఈ నెల 18 వరకూ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని గోఎయిర్‌ సీఈఓ కార్నిలిస్‌ వీస్‌జివిక్‌ పేర్కొన్నారు. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్లతో  వచ్చే ఏడాది నవంబర్‌

Most from this category