STOCKS

News


ప్రపంచ ఎకానమీకి చమురు సెగ..

Tuesday 16th October 2018
news_main1539665486.png-21185

న్యూఢిల్లీ: అంతకంతకూ పెరిగిపోతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల గరిష్టానికి చేరిన రేట్లను కట్టడి చేయకపోతే వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని చమురు ఉత్పత్తి దేశాలను హెచ్చరించారు.  చమురు రేట్లను సముచిత స్థాయులకు తెచ్చేందుకు ఉత్పత్తి దేశాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. ఇండియా ఎనర్జీ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా సోమవారం దిగ్గజ చమురు, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న ముడిచమురు రేట్లు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని, భారత్‌ వంటి వర్ధమాన దేశాల బడ్జెట్‌లను తల్లకిందులు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుమారు రెండు గంటలపైగా సాగిన భేటీలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ మంత్రులు, బ్రిటన్‌ ఇంధన దిగ్గజం బీపీ సంస్థ సీఈవో బాబ్‌ డడ్లీ, టోటల్‌ చీఫ్‌ ప్యాట్రిక్‌ ఫోయేన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్, వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.
తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీ కరెన్సీకి తాత్కాలికంగానైనా మద్దతు లభించేలా.. చెల్లింపు విధానాలను కూడా సమీక్షించాలని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 14.5 శాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. సుమారు 83 శాతం చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే భారత్‌ ఆధారపడుతున్న నేపథ్యంలో రూపాయి పతనం కారణంగా చెల్లింపులు భారంగా మారుతున్నాయి.
పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు..
గత సదస్సుల్లో కోరినట్లు నిబంధనలను సడలించినప్పటికీ చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి సంబంధించి భారత్‌లో కొత్తగా పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదంటూ కంపెనీల సీఈవోలను ప్రధాని ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు ధరలు, ఉత్పత్తి పరిమాణం మొత్తం అంతా ఉత్పత్తి దేశాలే శాసిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. తగినంత ఉత్పత్తి ఉంటున్నప్పటికీ మార్కెటింగ్‌ విధానాల కారణంగా చమురు రేట్లు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా తగినన్ని వనరులు లేక వినియోగ దేశాలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఉత్పత్తుల తరహాలోనే  ఉత్పత్తి దేశాలు, వినియోగదేశాల మధ్య భాగస్వామ్యం ఉండాలని మోదీ పేర్కొన్నారు. "ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ప్రపంచ ఎకానమీ స్థిరపడేందుకు ఇది తోడ్పడగలదు" అని ఆయన చెప్పారు. అలాగే చమురు ఎగుమతి దేశాలు తమ దగ్గర పెట్టుబడులకు ఉపయోగపడే మిగులు నిధులను.. వర్ధమాన దేశాల్లో ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తి కార్యకలాపాలపై ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించాలన్నారు.
మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం: సౌదీ మంత్రి
పెరుగుతున్న చమురు ధరలతో భారత్‌ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అధిక ముడి చమురు ధరల కారణంగా వినియోగ దేశాలు పడుతున్న బాధలను ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వివరించారని  సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి అల్‌–ఫలిహ్‌ చెప్పారు. "బంగారు గుడ్లు పెట్టే కోడిని (వినియోగ దేశాలు) ఒక్కసారిగా చంపేయొద్దు అంటూ మాలాంటి ఉత్పత్తి దేశాలను ప్రధాని మోదీ హెచ్చరించారు" అని ఫలిహ్‌ పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఇప్పటికే తన వంతు చర్యలు తీసుకుంటోందని, లేకపోతే ఈ బాధ మరింత తీవ్రంగా ఉండేదని ఆయన తెలిపారు. దేశీయంగా ఇంధన రంగ అభివృద్ధికి తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరపడం ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సుల ప్రధానోద్దేశం. 2016 జనవరి 5న జరిగిన ఇండియా ఎనర్జీ ఫోరం సందర్భంగా సహజ వాయువు ధరల సంస్కరణలపై వచ్చిన సూచనలను పరిశీలించిన కేంద్రం ఆ తర్వాత రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో జరిగిన సదస్సులో ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ వంటి సంస్థల చమురు, ఆయిల్‌ క్షేత్రాల్లో విదేశీ, ప్రైవేట్‌ కంపెనీలకు వాటాలు ఇవ్వాలంటూ సూచనలు వచ్చినప్పటికీ ఓఎన్‌జీసీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రణాళిక అమలు కాలేదు.



You may be interested

టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ మొత్తం ఆదాయం రూ.1,202 కోట్లు

Tuesday 16th October 2018

 న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.40 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.7.3 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 తెలిపింది. గత క్యూ2లో రూ.235 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,202 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వయాకామ్‌ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఈ ఏడాది మార్చి

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై చర్యలకు నో

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ:     ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, దాని గ్రూప్ సంస్థలపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్ని చర్యలపై స్టే విధిస్తూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాలిచ్చింది. గ్రూప్ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపులకు సంబంధించి 90 రోజుల మారటోరియం విధించాలన్న అభ్యర్ధనను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చడంతో.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. 90 రోజుల మారటోరియంపై తమ తమ అభిప్రాయాలను

Most from this category