STOCKS

News


క్రూడ్‌ ధరలు పరిగెడతాయ్‌

Tuesday 11th September 2018
news_main1536660986.png-20168

 

      ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వస్తే.. 150 డాలర్లకు క్రూడ్‌

  • ప్రభుత్వానికి అంచనా వేయడం చేతకాలేదు
  • ధరలు తగ్గుతాయని చెబుతోంది.. కానీ కచ్చితంగా పెరుగుతాయి
  • చమురు ధరలు పెరిగితే ఏం చేయాలో కేంద్రం వద్ద సరైన ప్రణాళికలు లేవు
  • అంతర్జాతీయ మార్కెట్లను నిందిస్తూ, ఏం పర్వాలేదని చెబితే సరిపోదు.. 
  • భరోసానిచ్చే ప్రకటనతో కన్సూమర్ల ముందుకు రావాలి
  • కేంద్రం ఓఎన్‌జీసీని నిర్వీర్యం చేస్తోంది..
  • కంపెనీ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు
  • ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌.ఎస్‌.శర్మ

క్రూడ్‌ ధరలు పెరగడం తప్ప తగ్గడమంటూ ఉండదని కుందబద్ధలు కొట్టారు ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌.ఎస్‌.శర్మ. ధరల పెరుగుదల వల్ల ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందుతున్నారని, కేవలం వినియోగదారులు మాత్రమే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెరిగే అవకాశముంటే.. ఆ విషయాన్ని కేంద్రం ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయ ‍పరిస్థితులను గమనిస్తే క్రూడ్‌ ధరలు పెరుగుతాయనే అంశం అర్ధమౌతుందన్నారు. రెండు నెలల క్రితం క్రూడ్‌ ధరల్లో పెరుగుదల ప్రారంభమైందని తెలిపారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు పైకి వెళ్లదని పేర్కొందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే కేం‍ద్ర ప్రభుత్వం ప్రస్తుత స్థాయి (78 డాలర్లు)కన్నా పైకి ధరలు వెళ్లవని చెబుతోందని పేర్కొన్నారు. అయితే తన అంచనా ప్రకారం క్రూడ్‌ ధరలు పెరుగుతాయని తెలిపారు. ఇరాన్‌పై ఆంక్షలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ దేశం ప్రస్తుతం రోజుకు 2 మిలియన్‌ బ్యారెల్‌ క్రూడ్‌ను ఎగుమతి చేస్తోందన్నారు. ఏప్రిల్‌ నాటి ఎగుమతులతో పోలిస్తే ప్రస్తుత ఎగుమతులు 28 శాతం తక్కువని గుర్తుచేశారు.  అమెరికా ఆంక్షలు విధిస్తూ ఇరాన్‌పై కఠినంగా వ్యవహరించడం వల్ల ఒపెక్‌ దేశాల్లోనూ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరలు ఏ స్థాయికి వెళ్తాయో ఊహించడం కష్టమని తెలిపారు. బ్లూమ్‌బర్గ్‌ డేటా ప్రకారం చూస్తే.. ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వస్తే.. క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు వెళ్లొచ్చని అంచనా. క్రూడ్‌ ధరలు ప్రస్తుత స్థాయి నుంచి తగ్గుతాయని కేంద్రం భావిస్తోందని, అయితే తాను మాత్రం పెరుగుతాయని విశ్వసిస్తున్నట్లు శర్మ తెలిపారు. 

అందరికీ లాభమే.. కన్సూమర్లకు తప్ప..
క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల ప్రతి ఒక్కరు లబ్ది పొందుతున్నారని, కేవలం వినియోగదారులు మాత్రమే నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్రోల్‌ ధరలు పెరుగుతాయని భావించడం లేదన్నారు. పెట్రోల్‌ వినియోగం తగ్గొచ్చని అంచనా వేశారు. అయితే డీజిల్‌ ధరలు మాత్రం పెరుగుతాయని తెలిపారు. డీజిల్‌ ఉపయోగించే కస్టమర్లు ధరల పెంపు భారాన్ని ఇతరులకు బదిలీ చేస్తారని పేర్కొన్నారు. ఉదాహరణకు ట్యాక్సీ డ్రైవర్లు డీజిల్‌ ధరల పెరుగుదల భారాన్ని ప్రయాణికులకు బదిలీ చేస్తారని తెలిపారు. అయితే పెట్రోల్‌ విషయానికి వస్తే ఇది సాధ్యపడదని, ఆ భారాన్ని కస్టమరే మోయాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల టూవీలర్లు కలిగిన వారు, మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. వీరికే క్రూడ్‌ సెగ ఎక్కువగా తగులుతుందని పేర్కొన్నారు. దురదృష్టకరమైన అంశం ఏంటంటే.. క్రూడ్‌ ధరలు పెరిగితే ఏం చేయాలో, వాటిని ఎలా ఎదుర్కోవాలో కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవని తెలిపారు. కేవలం అంతర్జాతీయ మార్కెట్లను నిందించడం.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడం.. చేస్తే సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలు పెరిగితే కేంద్రం.. ప్రజల ముందుకు రావాలని, కన్సూమర్లకు ఓదార్పునిచ్చే ప్రకటన చేయాలని తెలిపారు. 

ఓఎన్‌జీసీపై కేంద్ర వైఖరి సరైంది కాదు..
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదని శర్మ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా కంపెనీలపై క్రూడ్‌ను 70 డాలర్లకు (బ్యారెల్‌కు) విక్రయించాలని ఒత్తిడి వచ్చిందని, ఇప్పుడు కూడా అలాంటే ఘటనలే జరగొచ్చని తెలిపారు. అయితే ఓఎన్‌జీసీ మేనేజ్‌మెంట్‌ ఈ అంశాన్ని తీవ్రంగా ‍వ్యతిరేకించిందని పేర్కొన్నారు. కంపెనీ తన వృద్ధి ప్రణాళికలను నిధులను ఎలా సమకూర్చుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వపు ఒత్తిడి వల్ల ఓఎన్‌జీసీ రూ.38,000 కోట్లు పోసి హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసిందని, దీని వల్ల కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదని పేర్కొన్నారు. అలాగే జీఎస్‌పీసీని కూడా కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. కొనుగోలు తర్వాత హెచ్‌పీసీఎల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇప్పుడు ఓవీఎల్‌ లిస్టింగ్‌పై కూడా పనులు సీరియస్‌గా జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఓఎన్‌జీసీని ఓవీఎల్‌ను మార్కెట్‌లో లిస్ట్‌ చేయమని కోరిందని గుర్తుచేశారు. అయితే లిస్టింగ్‌కు ఇది సరైన సమయం కాదని ఓఎన్‌జీసీ బదులిచ్చిందన్నారు. లిస్టింగ్‌ ద్వారా ఓఎన్‌జీసీ వాటాను పాక్షికంగా విక్రయించి, ఆ డబ్బుల్ని ప్రత్యేక డివిడెండ్‌గా తమకు చెల్లించమంటూ కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీని కోరొచ్చని పేర్కొన్నారు. కేంద్రం చర్యలు బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ఓఎన్‌జీసీని చంపేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీ విషయంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కంపెనీ మంచి పనితీరు కనబరుస్తున్నా కూడా స్టాక్‌ ధర పడిపోయిందని పేర్కొన్నారు. కేంద్రం ఓఎన్‌జీసీ పట్ల వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ఆందోళనలు నెలకొని, దానివల్ల స్టాక్‌ ధర పడిపోయిందని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి చర్యలే కొనసాగితే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని హెచ్చరించారు. 



You may be interested

సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌

Tuesday 11th September 2018

  11300 దిగువకు నిఫ్టీ నెలరోజుల కనిష్టానికి సూచీలు ముంబై:- రూపాయి పతనం... మార్కెట్‌ను రెండో రోజూ ముంచింది. మార్కెట్‌ మరో అరగంటలో ముగుస్తుందనగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 29 పైసలు నష్టపోయి 72.74 వద్ద కొత్త కనిష్టానికి పతనమైంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ట్రేడింగ్‌ చివరి గంటలో మార్కెట్‌లో హఠాత్తుగా అమ్మకాల సునామి వెల్లువెత్తింది. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ,

ఏడాది కనిష్టానికి జేపీ అసోసియేట్స్‌..!

Tuesday 11th September 2018

ముంబై:- జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి పతనయ్యాయి. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.10.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేపీ అసోసియేట్స్‌ కంపెనీ తమకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల రుణ చెల్లింపులో విఫలమైనందున కంపెనీపై దివాళా ప్రక్రియ భాగంగా చర్యలు తీసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీకు పిటిషన్‌ దాఖలు తీసింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీసీ సెప్టెంబర్‌ 17లోగా ఈ అంశంపై స్పందిచాలని జేపీ

Most from this category