STOCKS

News


సగానికి తగ్గనున్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి

Thursday 6th December 2018
news_main1544075669.png-22690

ముంబై:  ద్రవ్య లభ్యత సమస్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) అసెట్స్‌ వృద్ధి సగానికి తగ్గిపోనుంది. 10 శాతానికి పరిమితం కానుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్‌ రుణాల నాణ్యత కాస్త మెరుగ్గానే ఉన్నా.. నాన్‌-రిటైల్ రుణాల విభాగం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నయని క్రిసిల్ పేర్కొంది. ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా మటుకు ఎన్‌బీఎఫ్‌సీలు స్వల్పకాలిక రుణాలు తీసుకుని దీర్ఘకాలిక రుణాలిచ్చాయి. సంక్షోభ పరిస్థితుల్లో ఆస్తులు-రుణాల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతుండటం ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని రుణాలివ్వడానికి అవి ఆచితూచి వ్యవహరిస్తుండటం, వడ్డీ  రేట్లు పెంచేయడం ఎన్‌బీఎఫ్‌ఎఫ్‌సీలకు ప్రతికూలంగా మారిన సంగతి తెలిసిందే. 

తగ్గనున్న రుణాల మంజూరీ..
లిక్విడిటీ సమస్యలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, నాన్‌-రిటైల్‌ విభాగంపై ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే రుణాల పరిమాణం 20-40 శాతం మేర తగ్గిపోయిందని నివేదిక వివరించింది. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 20 శాతంగా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ద్వితీయార్ధంలో 9-10 శాతానికి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ వివరించింది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు గట్టి పోటీ కొనసాగుతుందని పేర్కొంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు రుణాలివ్వడం తగ్గవచ్చని, ఫలితంగా రియల్టీకి నిధుల కొరత వల్ల ఎగవేతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ తెలిపింది. ముఖ్యంగా ఆస్తులను తనఖా పెట్టి (ఎల్‌ఏపీ) రుణాలు తీసుకున్న చిన్న వ్యాపార సంస్థలు సుదీర్ఘ కాలం పాటు నిధుల కొరత ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించింది. దీంతో ఎల్‌ఏపీ రుణాల విభాగంలో మొండిబకాయిలు 3 శాతం స్థాయిని దాటొచ్చని పేర్కొంది.

ఆర్‌బీఐ చేయూత అవసరం రాకపోవచ్చు: విరల్ ఆచార్య
సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆఖరి ప్రయత్నంగా రిజర్వ్ బ్యాంక్ చేయూతనివ్వాల్సిన అవసరం రాబోదని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య వ్యాఖ్యానించారు. గడిచిన రెండు నెలలుగా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలతో ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు చాలా వరకు తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ అయిదో ద్వైమాసిక పాలసీ సమీక్ష అనంతరం బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎకానమీ పటిష్టంగా ఉండటం, నామినల్‌ జీడీపీ వృద్ధిని మించి రుణ వితరణ వృద్ధి ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలకు తమ సాయం అవసరం రాకపోవచ్చని ఆర్‌బీఐ గట్టిగా భావిస్తోందని ఆచార్య చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల నిధుల అవసరాలు తీర్చేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక విండో ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. You may be interested

ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు: మనోజ్ సిన్హా

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: విమానప్రయాణంలో కూడా ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఇన్‌-ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. న్యాయ శాఖ అనుమతులు లభించిన పక్షంలో జనవరిలోనే నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. "ప్రస్తుతం న్యాయ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. వారం, పది రోజుల్లో లభించే అవకాశాలు ఉన్నాయి. అనుమతులు వచ్చాకా.. ప్రక్రియ

5జీపై టెలికం శాఖతో చర్చల్లో క్వాల్‌కామ్‌

Thursday 6th December 2018

హవాయ్:   భారత్‌లో 5జీ టెలికం సర్వీసుల విస్తృతికి అపార అవకాశాలు ఉన్నాయని మొబైల్ చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్ టెక్నాలజీస్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ దుర్గా మల్లాది తెలిపారు. 5జీతో అవకాశాలపై దేశీయంగా మరింత అవగాహన కల్పించేందుకు తీసుకోతగిన చర్యలపై టెలికం శాఖతో పాటు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. 5జీ సర్వీసులు వచ్చినంత మాత్రాన 4జీ ఎల్‌టీఈ సేవలు పూర్తిగా

Most from this category