STOCKS

News


గృహరుణాలకు ఎన్‌బీఎఫ్‌సీ దెబ్బ

Saturday 20th October 2018
news_main1540009991.png-21304

ముంబై: నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండటం.. వాటిపై ఆధారపడిన పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, ద్విచక్ర వాహనాలు మొదలైన విభాగాలపై ఇది మరింతగా కనిపించనుంది. వివిధ కన్సల్టెన్సీలు విడుదల చేసిన నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిధుల కొరత కారణంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల.. గృహ రుణాల మంజూరీ కార్యకలాపాలు మందగించే అవకాశాలున్నాయని జపనీస్ బ్రోకరేజి సంస్థ నొమురా పేర్కొంది. ఇప్పటికే గృహాల ధరల్లో వృద్ధి మందగించిందని, తాజా పరిణామాలతో ఆ ఒత్తిడి ఇకపైనా కొనసాగవచ్చని తెలిపింది. దీన్ని బ్యాంకులు అందిపుచ్చుకుని, ఆ మేరకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చని నొమురా వివరించింది. కానీ, అంతిమంగా రుణగ్రహీతలు అధిక వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కూడా సమస్యలు ఎదురుకావచ్చని వివరించింది. అమ్ముడు కాని గృహాల సంఖ్య పెరిగిపోతూ ఒత్తిడిలో ఉన్న రియల్టర్లకు ఇది మరింత సమస్యాత్మకంగా మారవచ్చని పేర్కొంది. మరోవైపు, నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నిధుల కొరత కష్టాలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌యేతర ఫైనాన్సింగ్ కార్యకలాపాల్లోని ఎన్‌బీఎఫ్‌సీలకి బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. 
ద్విచక్ర వాహనాల అమ్మకాలకూ ప్రతికూలం..
ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమస్యలు అటు ద్విచక్రవాహనాల అమ్మకాలకు కూడా ప్రతికూలం కానున్నాయి. కమర్షియల్ పేపర్స్ ద్వారా సమీకరించిన రుణాలను చాలా మటుకు ఎన్‌బీఎఫ్‌సీలు త్వరలో తిరిగి చెల్లించాల్సి రానుందని, దీంతో వాటి వద్ద నిధుల కొరత ఏర్పడి రుణాల మంజూరీ సామర్ధ్యం తగ్గొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీంతో ఈ మధ్యకాలంలో ఎన్‌బీఎఫ్‌సీల ఫైనాన్సింగ్‌తో గణనీయంగా పెరిగిన టూ-వీలర్ల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని వివరించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 30 శాతంగా ఉన్న టూవీలర్ ఫైనాన్సింగ్‌.. ఎన్‌బీఎఫ్‌సీల ఊతంతో 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరింది. ప్రస్తుతం టూవీలర్ ఫైనాన్సింగ్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా దాదాపు 60 శాతంగా ఉన్నట్లు క్రెడిట్ సూసీ తెలిపింది.     కార్లు, వాణిజ్య వాహనాలు మొదలైన వాటికి కూడా ఫైనాన్సింగ్‌ జరుగుతున్నప్పటికీ ఇటు బ్యాంకులు, అటు ఎన్‌బీఎఫ్‌సీల రుణాల వాటా దాదాపు సమస్థాయిలోనే ఉంటోందని, కానీ టూవీలర్ రుణాల సెగ్మెంట్‌లో నాన్‌-బ్యాంకింగ్ సంస్థల వాటా అధికంగా ఉందని వివరించింది. టూవీలర్ల అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఉండే పండగ సీజన్‌లోనే ఉంటాయని, అయితే సరిగ్గా ఇదే సమయంలో నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో వాటి అమ్మకాలకు ప్రతికూలం కాగలదని తెలిపింది. టూ వీలర్లలో ఐషర్ వాహనాలు ఎక్కువగా ఫైనాన్స్‌పై అమ్ముడవుతుంటాయని.. బజాజ్ తదితర సంస్థల తరహాలో ఆ కంపెనీకి సొంత ఫైనాన్స్ సంస్థ లేకపోవడంతో అమ్మకాలపై అత్యధికంగా ప్రభావం ఉండొచ్చని క్రెడిట్ సూసీ వివరించింది. 



You may be interested

ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో ఉన్నాం

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో వేదాంత కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. బిడ్‌ మొత్తాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘స్టీల్‌ ఉత్పత్తికి అవసరమైన ముడి ఇనుము, సహజవాయువు ఉత్పత్తి చేసే వేదాంత కంపెనీ, ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు అనువైనది. ఇది ఎస్సార్‌ స్టీల్‌కు కూడా అనుకూలమే’’ అన్నారాయన. బ్యాంకులకు రూ.50,800 కోట్ల రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ కేసు...

పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయాలు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్‌ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. 2018-19లో తొలి ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం మూడు పీఎస్‌యూల ఐపీవోలు, భారత్‌-22 ఈటీఎఫ్

Most from this category