STOCKS

News


టాప్‌ 10లో ముక్యాష్‌

Wednesday 27th February 2019
news_main1551240619.png-24348

ప్రపంచ సంపన్నుల్లో పదో స్థానం
రూ.3.83 లక్షల కోట్ల సంపద
అఘాతానికి అనిల్‌ నికర విలువ
ప్రపంచ నంబర్‌ 1 మళ్లీ జెఫ్‌ బెజోస్‌
హూరూన్‌ ప్రపంచ సంపన్నుల 2019 నివేదిక విడుదల

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సామ్రాజ్యాధిపతి ముకేశ్‌ అంబానీ సంపద పరంగా ప్రపంచంలో టాప్‌ -10కు చేరుకున్నారు. ఆయన సంపద విలువ 54 బిలియన్‌ డాలర్లు (రూ.3.83 లక్షల కోట్లు) అని హరూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితా 2019 వెల్లడించింది. ముకేశ్‌ తమ్ముడు అనిల్‌ అంబానీ మాత్రం తన నికర విలువలో 65 శాతాన్ని కోల్పోయినట్టు ఈ నివేదిక తెలిపింది. అమేజాన్‌ యజమాని జెఫ్‌ బెజోస్‌ ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 147 బిలియన్‌ డాలర్లు. ఇక హరూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి జారినట్టు నివేదిక పేర్కొంది. రిలయన్స్‌ షేరు ఇటీవలి కాలంలో ర్యాలీ చేయడంతో మార్కెట్‌ విలువ పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలో ముకేశ్‌ అంబానీకి 52 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7.73 లక్షల కోట్ల దగ్గర ఉంది. మరోవైపు అనిల్‌ అంబానీ నెట్‌వర్త్‌ ఏడు సంవత్సరాల క్రితం 7 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటే ఈ ఏడాది 1.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్‌ గ్రూపు వ్యాపారాలను సోదరులు ఇద్దరూ పంచుకున్న సమయంలో ఇరువురి కంపెనీల మార్కెట్‌ విలువ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ‘‘కుటుంబ సంపదను విభజించిన తర్వాత ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రయాణం ఆరంభించగా.. ముకేశ్‌ అంబానీ గడిచిన ఏడేళ్ల కాలంలో 30 బిలియన్‌ డాలర్ల మేర తన సంపదను పెంచుకున్నారు. కానీ, అనిల్‌ మాత్రం ఇదే కాలంలో 5 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు’’ అని హరూన్‌ నివేదిక వివరించింది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 96 బిలియన్‌ డాలర్లు, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ 88 బిలియన్‌ డాలర్లు, ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ 84 బిలియన్‌ డాలర్లు, ఫేస్‌బుక్‌ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ 80 బిలియన్‌ డాలర్లతో టాప్‌5లో ఉన్నారు. 


భారతీయు కుబేరులు
ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న భారత కుబేరుల్లో... తొలి స్థానంలో ముకేశుడు ఉండగా, హిందుజా గ్రూపు చైర్మన్‌ ఎస్‌పీ హిందుజా 21 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఉన్న విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద 17 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పూనవాలా గ్రూపు (సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌) చైర్మన్‌ సైరస్‌ ఎస్‌ పూనవాలా 13 బిలియన్‌ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రపంచంలోని టాప్‌-100 సంపన్నుల్లోకి చేరినట్టు హరూన్‌ జాబితా తెలిపింది. ఆర్సెలర్‌ మిట్టల్‌ అధిపతి లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ ఐదో స్థానంలో, కోటక్‌ మహింద్రా ఉదయ్‌ కోటక్‌ (11 బిలియన్‌ డాలర్లు), గౌతం అదానీ (9.9 బిలియన్‌ డాలర్లు), సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వి(9.5 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సైరస్‌ పల్లోంజి మిస్త్రీ, షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ ఉభయుల సంపద 9.5 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉండగా, ఇరువురు 9, 10వ స్థానాల్లో నిలిచారు. టాటాగ్రూపులో వీరికి 18.4 శాతం వాటా ఉండడం సంపద వృద్ధికి కలిసొచ్చింది. 


మహిళా‘మణు’లు
గోద్రేజ్‌ కుటుంబంలో మూడో తరానికి చెందిన స్మితా కృష్ణ మహిళా బిలియనీర్లలో అగ్ర స్థానంలో ఉన్నారు. ఆమె నికర విలువ 6.1 బిలియన్‌ డాలర్లు. బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా 3.5 బిలియన్‌ డాలర్లతో హరూన్‌ జాబితాలో 671వ స్థానంలో ఉన్నారు. సొంతంగా సంపద సృష్టించుకున్న మహిళామణిగా ఆమెను హరూన్‌ జాబితా పేర్కొంది. 


5వ స్థానానికి జారిన భారత్‌
‘‘2012 నుంచి చూస్తే భారత్‌ మొదటి సారిగా హరూన్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి దిగజారింది. రూపాయి బలహీనత, స్టాక్‌ మార్కెట్‌ కాంతిహీనంగా ఉండడం దీనికి కారణం’’ అని హరూన్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. జీ గ్రూపు సుభాష్‌చంద్ర, సన్‌టీవీ కళానిధి మారన్‌లకు ఈ ఏడాది ప్రతికూల సంవత్సరమని, వీరిద్దరూ గణనీయంగా సంపద కోల్పోయారని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో సంపన్నుల సంఖ్య 224 తగ్గి 2,470గా ఉన్నట్టు తెలిపింది. ఈ 2,470 మంది ఉమ్మడి సంపద విలువ 9.5 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ జీడీపీలో 12 శాతానికి సమానం. 



You may be interested

మాక్స్‌బుపాలో వాటా విక్రయించిన మ్యాక్స్‌ ఇండియా

Wednesday 27th February 2019

డీల్‌ విలువ రూ.510 కోట్లు  న్యూఢిల్లీ: మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను మ్యాక్స్‌ ఇండియా విక్రయించింది. ఈ వాటాను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, ​ ట్రూ నార్త్‌ ఫండ్‌ ఫోర్‌ ఎల్‌ఎల్‌పీకి విక్రయించామని మ్యాక్స్‌ ఇండియా తెలిపింది. ఈ డీల్‌  విలువ రూ.510 కోట్లని పేర్కొంది.  మొత్తం నగదులోనే ఈ లావాదేవీ జరిగింది. ఈ లావేదేవీ పరంగా చూస్తే, మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 27th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మాక్స్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ మాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 51 శాతం వాటాను ట్రూ నార్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ వాటా విక్రయంతో కంపెనీ మొత్తం రూ.510 కోట్లను సమీకరించనుంది.  బీఎస్‌ఈ లిమిటెడ్‌:- షేర్‌ హోల్డర్ డైరెక్టర్‌ పదవికి ఎస్‌పీ కఠారీ రాజీనామా చేశారు.  అలహాబాద్‌ బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, ధనలక్ష్మీ

Most from this category