STOCKS

News


ఇండియా వృద్దిపై మూడీస్‌ హెచ్చరిక!

Thursday 13th December 2018
news_main1544697573.png-22902

భారత ఆర్థిక వృద్ధికి ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు ప్రతిబంధకాలు కావచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ హెచ్చరించింది. ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ ఇక్కట్లు దేశ వృద్ధిరేటును కుంటుపరుస్తాయని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ కేవలం 7 శాతానికి కాస్త అటుఇటుగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది ఆశిస్తున్న 7.4 శాతం వృద్ధి రేటు అంచనా కన్నా వచ్చే ఏడాది అంచనాలు తక్కువని మూడీస్‌ చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ మైకెల్‌ టేలర్‌ చెప్పారు. కొన్ని నెలల క్రితం వృద్ధి రేటుపై తాము వేసిన అంచనాల కన్నా కూడా తాజా అంచనా తక్కువని తెలిపారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కావడంతో ఈ ఏడాది ఎన్‌బీఎఫ్‌సీలపై పెను ప్రభావం పడింది. ఈ కారణంగా నాన్‌బ్యాంకింగ్‌ఫైనాన్స్‌ రంగానికి చెందిన కంపెనీలకు క్రెడిట్ సరఫరా మందగించింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులు బాగా కుదేలయ్యాయి. ఈ కంపెనీల్లో మరింత ఒత్తిళ్లు పెరిగితే అది అంతిమంగా మొత్తం దేశ ఎకానమీపైనే ప్రభావం చూపుతాయని మైకేల్‌ చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్‌ సరఫరా మందగించడం మొత్తం క్రెడిట్‌ లభ్యతనే గడ్డుగా మారుస్తుందని తెలిపింది. దీంతో వడ్డీ వ్యయాలు బాగా పెరగవచ్చని అంచనా వేసింది. ఇవన్నీ కలిసి జీడీపీ వృద్దిని అర శాతం మేర క్షీణింపజేస్తాయని తెలిపింది. ఈ క్రెడిట్‌ సరఫరా లోటును తీర్చడం పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకుల వల్ల కాకపోవచ్చని, ప్రభుత్వమే ఇందుకు పూనుకోవాలని సూచించింది. 
స్పీడ్‌ గ్రోత్‌, స్పీడ్‌ ఫాల్‌
గ్రామీణంగా అధిక రిస్క్‌తో రుణాలిస్తున్న వేలాది ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మనుగడను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అంశం ప్రశార్థకం చేసింది. దేశవ్యాప్తంగా 11,400 ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల ఉమ్మడి బ్యాలన్స్‌ షీటు మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయిలుగా ఉంది. బ్యాంకుల కంటే వీటిపై నియంత్రణలు తక్కువే. ఇదే సమయంలో బ్యాంకులతో పోలిస్తే ఎన్‌బీఎఫ్‌సీల లోన్‌బుక్‌ రెండు రెట్ల మేర అధికంగా వృద్ది చెందింది. అందుకే ఈ విభాగం కొత్త పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో చాలా సంస్థల క్రెడిట్‌ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ ముప్పు ఏర్పడింది. ఒకవైపు నిధుల సమీకరణ వ్యయాలు పెరుగుతుండడం, మరోవైపు రుణాలకు కటకట ఏర్పడడంతో తగినన్ని నిధుల్లేని సంస్థలు నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుందన్న అంచనాలున్నాయి. 
చిన్న సంస్థలు కనుమరుగు?
కనీసం రూ.2 కోట్ల నిధుల్లేని ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను ఆర్‌బీఐ రద్దు చేసే ప్రక్రియలో ఉందంటున్నారు నిపుణులు. ‘‘ఆర్‌బీఐ ఇప్పటికే షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రక్రియలో ఉంది. 1,500 సంస్థలు కనుమరుగు కానున్నాయి’’ అని ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ( ఈ రంగానికి చెందిన సంఘం) చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్‌బీఐ వద్దకు వందలాది నూతన దరఖాస్తులు వరదగా వస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో సుమారు 11,000 వరకు ఎన్‌బీఎఫ్‌సీలు 500 కోట్ల రూపాయాల్లోపు ఆస్తులు కలిగిన చిన్న, మధ్య స్థాయి సంస్థలే. కానీ, అగ్ర స్థానంలో ఉన్న 400 ఎన్‌బీఎఫ్‌సీల్లో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలకు చెందినవి. 90 శాతానికి పైగా ఆస్తులు వీటి నియంత్రణలోనే ఉన్నాయి’’ అని రామన్‌ అగర్వాల్‌ వివరించారు. తాజా పరిణామాలను ఆర్థికంగా దిగ్గజ సంస్థలైన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి సంస్థలు తట్టుకుని నిలబడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు ఒక్కో మైక్రోఫైనాన్స్‌ సంస్థను కొనుగోలు చేశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు సైతం భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో కొంతమేర స్థిరీకరణ ఉంటుందని ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ రంగానికి ఇది మేలు చేస్తుందన్నారు. You may be interested

వీటిల్లోకి ఫండ్స్‌ పెట్టుబడుల వరద!

Thursday 13th December 2018

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నవంబర్‌లో 5 శాతం పెరిగాయి. ఇన్వెస్టర్లు రూ.1.4 లక్షల కోట్ల మేర వివిధ రకాల పథకాల్లో ఇన్వెస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఇంత వరకు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.2.23 లక్షల కోట్లుగా ఉన్నట్టు యాంఫి గణాంకాలు చెబుతున్నాయి. మరి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారో తెలుసుకునే ఆసక్తి ఇన్వెస్టర్లలో సహజంగానే ఉంటుంది. ఆ వివరాలను

మూడోరోజూ లాభాల ముగింపే...

Thursday 13th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లపై తగ్గింపు ఆశలతో మార్కెట్‌ మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 150.57 పాయింట్ల లాభంతో 35929.64 వద్ద, నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో 10791.50 వద్ద ముగిసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అన్ని రంగాల షేర్లలో షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అయితే మెటల్‌, ఫార్మా షేర్లలో అశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా ఫార్మా ఇండెక్స్‌ స్వల్పలాభంతో

Most from this category