STOCKS

News


8 శాతం వృద్ధి కోసం మరిన్ని సంస్కరణలు

Friday 30th November 2018
news_main1543554558.png-22507

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అలాగే, తక్కువ వడ్డీ రేట్లతోపాటు సమృద్ధిగా నిధుల అందుబాటులో ఉండటమన్నది అధిక వృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి 2016-17లో 7.1 శాతం, 2017-18లో 6.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. గురువారమిక్కడ ‘పెహలే ఇండియా ఫౌండేషన్‌’ నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘‘8 శాతం వృద్ధి రేటును దాటడమన్నది అంత సులభం కాదు. కష్టపడి పనిచేయాలి. అందుకు అవసరమైన సంస్కరణలను చేపట్టాలి’’ అన్నారు. రుణాల లభ్యత తక్కువగా ఉండడం, వడ్డీ రేట్లు అధికంగా ఉండడమనే రెండు ప్రధాన సమస్యలను ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ‘‘ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో ఉంటే బ్యాంకుల వడ్డీ రేటు 7 శాతానికి పైన ఉంది. నిధుల సమీకరణ వ్యయం రాబడుల రేటుకు సమానంగా ఉండకూడదు. రాబడుల రేటు దీర్ఘకాలంలో అధికంగా ఉండాలి. లేదంటే వృద్ధి రేటు నిలబడదు’’ అని కుమార్‌ వివరించారు. దేశ గణాంక వ్యవస్థకు నిధుల కేటాయింపును పెంచాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం, పరిశ్రమలు కలసి దేశంలోని తయారీ సంస్థల పోటీతత్వాన్ని పెంచే చర్యలు చేపట్టాలన్నారు. మన సాగు ఆధునికీకరణ విషయంలో అవసరమైనంత చేయలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
సీఎస్‌వోకు వేదిక కల్పించడం సరైనదే
సవరించిన జీడీపీ అంచనాలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విసిరిన సవాలుకు సిద్ధమని రాజీవ్‌కుమార్‌ ప్రకటించారు. ‘‘గౌరవనీయ పి చిదంబరంజీ సవాలును స్వీకరించాను. బ్యాక్‌ సిరీస్‌ డేటాను పరిశీలిద్దాం, చర్చిద్దాం. కొత్త గణాంకాల విషయంలో మీకున్న ఇబ్బందికి సహేతుక కారణాలు తెలియజేయండి’’ అని రాజీవ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘‘గణాంకాలపై చర్చకు రాజీవ్‌కుమార్‌ అంగీకరిస్తే సంతోషిస్తా’’ అని చిదంబరం చేసిన ట్వీట్‌కు రాజీవ్‌కుమార్‌ ఈ సమాధానమిచ్చారు. ‘‘శాస్త్రీయమైన విధానాలు, మదింపు ఆధారంగా గణాంకాలు ఉంటాయి. వీటిని ప్రముఖ గణాంక నిపుణులతో పరిశీలించడం కూడా జరుగుతుంది. కనుక ఈ గణాంకాలను సీఎస్‌వో విడుదల చేయడానికి నీతి ఆయోగ్‌ ఒక వేదిక ఏర్పాటు చేయడం సరైనదే’’ అని రాజీవ్‌కుమార్‌ బుధవారం నాటి సంఘటనను సమర్థించుకున్నారు. జీడీపీ డేటాను పరిశీలించేందుకు నిపుణులు, గణాంక శాస్త్రవేత్తలకు వేదిక కల్పించినట్టు చెప్పారు. 



You may be interested

ఎకానమీ వృద్ధికి మరిన్ని చర్యలు అవసరం

Friday 30th November 2018

బెంగళూరు: ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బయోఫార్మా సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు కొన్ని మంచి చర్యలు తీసుకున్నాయని, కానీ ఎకానమీని మెరుగు పరిచేందుకు అవసరమైన స్థాయిలో ప్రయత్నాలు జరగలేదని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు టెక్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వస్తు, సేవల

ఐపీఓకు కోల్డెక్స్‌ కంపెనీ

Friday 30th November 2018

న్యూఢిల్లీ: కోల్డెక్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. పుడ్‌ సప్లై చెయిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను ఇటీవలే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 10.10 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉన్న ఎస్‌ఏబీఆర్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 16.56 లక్షల

Most from this category