STOCKS

News


వ్యాపారానికి బెస్ట్‌... భారత్‌!

Thursday 1st November 2018
Markets_main1541051568.png-21627

- 100వ స్థానం నుంచి 77వ స్థానానికి
- ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో మెరుగుదల
- ఆరు అంశాల్లో పుంజుకున్న పనితీరు
- అనుమతులు, రుణాలు పొందడం సులభం
- విద్యుత్‌ కనెక్షన్‌, పన్నుల చెల్లింపూ ఈజీనే
- ఇది అరుదైన ఘనత: కేంద్రం

న్యూఢిల్లీ: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల్లో భారత్‌ మరింత పైకి చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో గతేడాది 100కి చేరిన మన దేశం... తాజాగా విడుదలైన ర్యాంకుల్లో ఏకంగా 77కు వచ్చేసింది. గతేడాదితో పోలిస్తే 23 మెట్లు పైకెక్కింది. కేంద్రం చేపట్టిన ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ (ఐబీసీ/దివాలా చట్టం), జీఎస్టీ తదితర సంస్కరణలు భారత ర్యాంకును మరింత పైకి తీసుకెళ్లాయి. మోదీ సర్కారు 2014లో కేంద్రంలో కొలువు తీరేనాటికి ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో భారత్‌ 190 దేశాలకు 142వ స్థానంలో ఉంది. గతేడాది అంతకుముందున్న 131 ర్యాంకు నుంచి 100కు, ఈ ఏడాది 77కు మెరుగుపడింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వెలువడిన ఈ ర్యాంకులు కేంద్రానికి మోదం కలిగించేవే. ఎక్కువగా అభివృద్ధి చెందగల పది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌కు ప్రపంచ బ్యాంకు చోటు కల్పించింది. అధిక జనాభా కలిగిన చైనా, భారత్‌ మెచ్చుకోతగ్గ సంస్కరణల అజెండాను చేపట్టినట్టు అభినందించింది.
వీటిలో ముందడుగు...
వ్యాపారం ప్రారంభించడం, నిర్వహణకు సంబంధించి పది అంశాల్లో భారత్‌ ఆరింటిలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుందని ప్రపంచబ్యాంకు 2019 వార్షిక నివేదిక తెలియజేసింది. వ్యాపారం సులభంగా ఆరంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్‌ సదుపాయం పొందడం, రుణాలు పొందడం, పన్నుల చెల్లింపు, భిన్న సరిహద్దుల గుండా వ్యాపారం నిర్వహణ అన్నవి భారత్‌ మెరుగుపరుచుకున్న అంశాలు.
భారత సంస్కరణలకు ప్రశంసలు
వ్యాపార ప్రక్రియలను భారత్‌ గాడిలో పెట్టిందని ప్రశంసించింది. ఎన్నో దరఖాస్తులు చేసుకోవాల్సిన చోట ఒకే సమగ్ర దరఖాస్తును తీసుకొచ్చి వ్యాపార ప్రారంభాన్ని భారత్‌ సులభం చేసిందని పేర్కొంది. ‘‘వ్యాట్‌ స్థానంలో జీఎస్టీని తీసుకొచ్చింది. ఇందులో నమోదు ప్రక్రియ చాలా వేగంగా ఉంది’’ అని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. కార్పొరేట్‌ ఆదాయపన్ను తగ్గించడం, ఈపీఎఫ్‌లో ఉద్యోగ సంస్థ వాటాను తగ్గించడం ద్వారా... తక్కువ పన్ను భారం కలిగిన, సులభంగా పన్ను చెల్లించే దేశంగానూ బారత్‌ నిలిచిందని తెలిపింది. ‘‘రుణాల రికవరీకి దివాలా పరిష్కార కార్యాచరణ అన్నది గొప్ప చర్య. డెట్‌ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ద్వారా ఎన్‌పీఏలను 28 శాతం తగ్గించుకోవడంతోపాటు పెద్ద రుణాలపై వడ్డీ రేట్లు తగ్గేలా చేసింది’’ అని ప్రపంచబ్యాంకు తన నివేదికలో వివరించింది. రుణ రికవరీ కేసులను వేగంగా పరిష్కరించడం వల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని సూచించింది. ఎగుమతి వ్యయం, సమయాన్ని కూడా తగ్గించినట్టు పేర్కొంది. కంటెయినర్లకు ఎలక్ట్రానిక్‌ విధానంలో సీల్స్‌ వేయడం ద్వారా తప్పనిసరి భౌతిక అనుమతులను 5 శాతానికి తగ్గించినట్టు వెల్లడించింది. భవన అనుమతులను వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణ అనుమతి భారాన్ని కూడా తగ్గించినట్టు తెలియజేసింది.
న్యూజిలాండ్‌కు అగ్రస్థానం
190 దేశాల జాబితాలో వ్యాపార సులభతర విషయంలో న్యూజిలాండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌, డెన్మార్క్‌, హాంగ్‌కాంగ్‌ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. అమెరికా 8, చైనా 46, పాకిస్థాన్‌ 136 ర్యాంకు దక్కించుకున్నాయి. బ్రిక్స్‌ దేశాలు బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా మొత్తం మీద సగటున వ్యాపార సులభతర నిర్వహణలో 19 పాయింట్ల మేర స్కోరు పెంచుకున్నాయి.
అరుదైన ఘనత  
‘‘గతేడాది భారత్‌ ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో 30 స్థానాలు మెరుగుపరుచుకోగా, ఈఏడాది 23 స్థానాలు ఎగబాకింది. భారత్‌ వంటి ఏ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అయినా ఇది అరుదైన ఘనతే. గత రెండేళ్లలో 53 స్థానాలు నాలుగేళ్లలో మొత్తం 65 స్థానాలు మెరుగుపడింది. 10 అంశాల్లో ఆరింటిలో పురోగతి సాధించి అంతర్జాతీయ ఉత్తమ విధానాలకు సమీపంలోకి చేరుకుంది’’ అని కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.You may be interested

మౌలికరంగం నెమ్మది

Thursday 1st November 2018

- సెప్టెంబర్‌లో 4.3 శాతం వృద్ధి - నాలుగు నెలల కనిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్‌పై ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ

‘‘రాజీ’’నామా

Thursday 1st November 2018

 ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే యోచనలో కేంద్రం - ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆర్థిక శాఖ - ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తామని వెల్లడి - సెక్షన్‌ 7 కింద పంపిన లేఖల ప్రస్తావన మాత్రం లేదు - తాను అంతకు మించి చెప్పేదేమీ లేదన్న జైట్లీ - ఉదయమంతా ఉరి‍్జత్‌ పటేల్‌ రాజీనామా వదంతులు - సాయంత్రం ఆర్థిక శాఖ ప్రకటనతో సర్దుకున్న పరిస్థితి - కానీ విమర్శలు కొనసాగిస్తున్న ఆర్థిక అధికారులు కేంద్ర ప్రభుత్వానికి -

Most from this category