STOCKS

News


టాప్‌-50లో నిలవడమే లక్ష్యం

Saturday 19th January 2019
news_main1547877856.png-23675

  •  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఇంకా ముందుకు
  •  సంస్కరణల జోరు కొనసాగిస్తాం
  • నియంత్రణలు తొలగిస్తాం
  • మన ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసం
  • వైబ్రాంట్‌ గుజరాత్‌ సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
  • భారీ పెట్టుబడులు ప్రకటించిన కార్పొరేట్‌ సంస్థలు

గాంధీనగర్‌: సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్‌ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే భారత్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ప్రపంచ బ్యాంక్‌ రూపొందించిన సులభతర వాణిజ్య దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్‌ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన జట్టును కోరానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన నిబంధనలు భారత్‌లో ఉండాలని, వ్యాపారం చేయడం చౌకగా ఉండే ప్రయత్నాలు కూడా చేయనున్నామని తెలిపారు. శుక్రవారం ఇక్కడ 9వ వైబ్రాంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అడ్డంకులు తొలగిస్తాం...
అభివృద్ధిని కుంటుపరిచే అడ్డంకులను తొలగించటంపై దృష్టి పెడుతున్నామని, సంస్కరణలు కొనసాగిస్తామని, అనవసరమైన నియంత్రణలు ఎత్తివేస్తామని మోదీ ఉద్ఘాటించారు. జీఎస్‌టీ అమలు, పన్నుల హేతుబద్ధీకరణ కారణంగా లావాదేవీల వ్యయాలు తగ్గాయని, వివిధ కార్యకలాపాలు మెరుగుపడ్డాయని వివరించారు. డిజిటల్‌ ప్రక్రియలు, ఆన్‌లైన్‌ లావాదేవీలు, సింగిల్‌ పాయింట్‌ ఇంటర్‌ఫేస్‌ వంటి అంశాల కారణంగా వ్యాపారం చేయడం వేగవంతమవుతోందని తెలిపారు. ఐటీ ఆధారిత లావాదేవీల ద్వారానే ప్రభుత్వ కొనుగోళ్లు, సమీకరణలు, డిజిటల్‌ చెల్లింపులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. పాలన మెరుగపడేలా చూస్తున్నామని, ‘సంస్కరణలు, పనితీరు సాధించడం, మార్పు తీసుకురావడం, మరింత మెరుగైన పనితీరు సాధించడం  తమ తారక మంత్రమని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, వివిధ అంశాల్లో చాలా మార్పు కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని, లోతైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామని వివరించారు. వీటన్నింటి ఫలితంగానే ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మన ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సంస్కరణలు తేవడంలో, నియంత్రణలు తొలగించడంలో ఇదే జోరు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు
ప్రభుత్వ విధానాల కారణంగా భారత్‌లోకి గత నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయని నరేంద్ర మోదీ తెలిపారు. అంతకు ముందటి 18 ఏళ్లలో ఈ పెట్టుబడుల్లో సగం కూడా రాలేదని వివరించారు. అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నామని, 90 శాతానికి పైగా ఆమోదాలు ఆటోమేటిక్‌ రూట్‌లోనే లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి బాటన పయనిస్తోందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో సగటున ఏడాదికి 7.3 శాతం వృద్ధిని సాధించామని, 1991 తర్వాత జీడీపీ జోరు పెరిగిందని తెలిపారు. మన దేశంలో యువ జనాభా బాగా పెరుగుతోందని, వీరి కోసం ఉద్యోగకల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరిగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అందుకే తయారీ, మౌలిక రంగాలపై ఎన్నడూ లేనంతగా దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఆధునికమైన, సత్తాగల నవ భారత్‌ను నిర్మించే దిశగా మౌలిక రంగంలో పెట్టుబడులు సమీకరించే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని  వివరించారు.
యురేనియమ్‌ సరఫరాపై ఒప్పందం
సదస్సు సందర్భంగా అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగపడే యురేనియమ్‌ సరఫరా కోసం భారత్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ, ఉజ్బెకిస్తాన్‌ అధ్యక్షుడు షౌకత్‌ మిర్జియోయెవ్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

ఈ సదస్సులో వివిధ కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించాయి. వివరాలు....
పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ గుజరాత్‌లో పదేళ్లలో రూ.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇంధన, పెట్రో కెమికల్‌, డిజిటల్‌ వ్యాపారం, తదితర రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్‌కు జన్మభూమి, కర్మభూమి(కార్యస్థలం) కూడా ఇదేనని, తమ తొలి ఎంపిక ఎప్పుడూ గుజరాతే అవుతుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టామని, పది లక్షలమందికి పైగా జీవనోపాధి కల్పించామని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, 20 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రిలయన్స్‌ జియో త్వరలో వినూత్నమైన కొత్త కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ను అందుబాటులోకి తేనున్నదని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. గుజరాత్‌లో 12 లక్షలకు పైగా ఉన్న చిన్న దుకాణ దారులు, రిటైలర్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
ఐదేళ్లలో రూ.55,000 కోట్లు:  అదానీ
గత ఐదేళ్లలో గుజరాత్‌లో రూ.50,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని అదానీ గ్రూప్‌ పేర్కొంది. పెట్టుబడుల జోరును మరింతగా పెంచుతామని, రానున్న ఐదేళ్లలో రూ.55,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని గౌతమ్‌ అదానీ వెల్లడించారు. ముంద్రాలో బీఏఎస్‌ఎఫ్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న పెట్రో కెమికల్‌ ప్లాంట్‌ కాకుండా ఈ పెట్టుబడులు పెడతామన్నారు. రూ.55,000 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ప్రపంచంలోనే పెద్దదైన సోలార్‌ హైబ్రిడ్‌ పార్క్‌ను ఖవ్డాలో నిర్మిస్తామని, ముంద్రలో 1 గిగావాట్‌​ డేటా సెంటర్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని, పది లక్షల టన్నుల కాపర్‌ స్మెల్టింగ్‌, రిఫైనింగ్‌ ప్రాజెక్ట్‌ను, సమగ్రమైన లిధియమ్‌ ఐయాన్‌ బ్యాటరీల ప్లాంట్‌ను  ఏర్పాటు చేస్తామని వివరించారు.
బిర్లా గ్రూప్‌.. మూడేళ్లలో రూ.15,000 కోట్లు
మూడేళ్లలో రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్‌ వెల్లడించింది. ఇప్పటికే గుజరాత్‌లో రూ.30,000 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని ఈ గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తెలిపారు. టెక్స్‌టైల్స్‌, రసాయనాలు, గనులు ఇలా విభిన్న రంగాల్లో మూడేళ్లలో రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.
టాటాల లిథియమ్‌ అయాన్‌ ప్లాంట్‌
టాటా గ్రూప్‌ గుజరాత్‌లో లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. గ్రూప్‌ కంపెనీల్లో ఒకటైన టాటా కెమికల్స్‌ సోడాయాష్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ చెప్పారు. టాటా మోటార్స్‌, టాటా కెమికల్స్‌ వంటి తమ గ్రూప్‌ కంపెనీలు గుజరాత్‌లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, తమ పెట్టుబడులను మరింతగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
సుజుకీ మూడో ప్లాంట్‌
జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ (మారుతీ సుజుకీ మాతృ కంపెనీ) తన మూడవ ప్లాంట్‌నూ గుజరాత్‌లోనే ఏర్పాటు చేయనుంది. తొలి ప్లాంట్‌ను 2017లో ప్రారంభించామని,  త్వరలో రెండో ప్లాంట్‌ అందుబాటులోకి రానున్నదని, 2020లో మూడో ప్లాంట్‌ను కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేస్తామని సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. టయోటా కంపెనీ సాంకేతిక సహకారంతో కొత్త హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌  వాహనాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
టొరెంట్‌ గ్రూప్‌ పెట్టుబడులు రూ.10,000  కోట్లు
గుజరాత్‌లో ఇప్పటికే రూ.30,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని, మరో రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని టొరెంట్ గ్రూప్‌ చైర్మన్‌ సుధీర్‌ మెహతా చెప్పారు. పునరుత్పాదన ఇంధన, విద్యుత్‌, గ్యాస్‌ పంపిణీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వివరించారు.
- నయార ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌..ఈ కంపెనీని రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ కంపెనీ కొనుగోలు చేసి. నయార ఎనర్జీగా పేరు మార్చింది) వాదినార్‌లోని రిఫైనరీ విస్తరణ నిమిత్తం 85 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నది.
-మాంగనీస్‌ తయారు చేసే ఎమ్‌ఓఐఎల్‌ గుజరాత్‌కు చెందిన జీఎమ్‌డీసీ కంపెనీతో కలిసి రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
డేటా దురాక్రమణ నుంచి దేశా‍న్ని కాపాడండి
ప్రపంచ కంపెనీలు డేటా దురాక్రమణకు (డేటా కాలనైజేషన్‌) పాల్పడుతున్నాయని, దీనిని నివారించే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎమ్‌డీ ముకేశ్‌ అంబానీ కోరారు. రాజకీయ దురాక్రమణకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఉద్యమించినట్లుగానే డేటా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరముందని వివరించారు. ప్రస్తుతమున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి కొత్త ప్రపంచంలో డేటా అనేది కొత్త సంపద అని, భారతీయుల  డేటా భారతీయులకే సొంతమని చెప్పారు. భారత డేటాపై అంతర్జాతీయ కంపెనీల, కార్పొరేట్ల నియంత్రణ  ఉండకూడదని భారతీయుల నియంత్రణే ఉండాలని పేర్కొన్నారు.You may be interested

కెమికల్స్‌ కేంద్రం కార్బానియో!

Saturday 19th January 2019

ఆన్‌లైన్‌లో 4.5 లక్షల రసాయనాలు 8 నెలల్లో విదేశాల్లోకి ఎంట్రీ 2 నెలల్లో రూ.20 కోట్ల నిధుల సమీకరణ ‘స్టార్టప్‌ డైరీ’తో కార్బానియో ఫౌండర్‌ డాక్టర్‌ రఫీ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ రోజుల్లో ఆన్‌లైలో దొరకనిదంటూ ఏదీ లేదు. కెమికల్స్‌తో సహా! అలాగని, ఆన్‌లైన్‌లో రసాయనాలను విక్రయించడం తేలికేమీ కాదు. ఎవరు విక్రయిస్తున్నారు? ఎవరు కొంటున్నారు? ఇవన్నీ కీలకమే. లేకుంటే చాలా అనర్థాలొస్తాయి. దీన్నో సవాలుగా తీసుకుని... కెమికల్స్‌ పరిశ్రమను సంఘటిత పరిచి.. ఆన్‌లైన్‌లో

భారీ లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th January 2019

విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి భారీ లాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన గతముగింపు(10920)తో పోలిస్తే 63 పాయింట్ల లాభంతో 10,983 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10,927 పాయింట్లతో పోలిస్తే 56 పాయింట్ల లాభంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ లాభంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most from this category