STOCKS

News


రీచార్జ్‌ చేయకుంటే కనెక్షన్‌ కట్‌!!

Thursday 29th November 2018
news_main1543469409.png-22470

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రీ–పెయిడ్‌ యూజర్ల నెత్తిన తప్పనిసరి కనీస రీచార్జ్‌ పిడుగు పడేశాయి. ఇప్పటిదాకా ఇస్తున్న  లైఫ్‌టైమ్‌ వేలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్‌ చేసుకోవాల్సిందేనని లేకపోతే సర్వీసులు డిస్‌కనెక్ట్‌ చేస్తామని ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. రీచార్జ్‌ల కోసం టెల్కో దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 28 రోజుల వేలిడిటీతో రూ. 100 లోపు కనీస ప్రీపెయిడ్‌ ప్యాక్స్‌ను ప్రవేశపెట్టాయి. వీటిలో రూ. 35, రూ. 65, రూ. 95 మొదలైన ప్యాక్స్‌ ఉన్నాయి. ఈ కనీస ప్లాన్స్‌తో  రీచార్జ్‌ చేసుకోకపోతే 30 రోజుల్లోగా అవుట్‌గోయింగ్‌ కాల్స్, 45 రోజుల్లోగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ నిల్చిపోతాయి. అంటే ఈ కనీస ప్లాన్స్‌తో రీచార్జ్‌ చేసుకుంటేనే మొబైల్‌ సర్వీసులను .. ముఖ్యంగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందుకోవచ్చు. ఈ కొత్త నిబంధన కారణంగా అకౌంట్లో బ్యాలెన్స్‌ ఉన్నా రీచార్జ్‌ గడువు ముగియడంతో ఇప్పటికే పలువురు ప్రీపెయిడ్‌ యూజర్లకు అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను నిలిపివేస్తున్నాయి. టెల్కోల నుంచి  మెసేజిలు వస్తుండటం సాధారణమేనని వాటిని పెద్దగా పట్టించుకోని యూజర్లు.. కనీస రీచార్జ్‌పరమైన కొత్త మార్పుల వల్ల అకస్మాత్తుగా కాల్స్‌ ఆగిపోతుండటంతో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కోసం మాత్రమే ఎక్కువగా మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించే గ్రామీణ ప్రాంతాల్లో వారిపై ఈ విధానం ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

పెరగనున్న టెల్కోల ఆదాయాలు..
దీర్ఘకాలంగా రీచార్జ్‌ చేసుకోని కస్టమర్లు ఎయిర్‌టెల్‌లో 10 కోట్ల మంది, వొడాఫోన్‌ ఐడియాలో 15 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. కనీస రీచార్జ్‌ తప్పనిసరి కారణంగా వీరిలో ఎయిర్‌టెల్‌ నుంచి కనీసం సగం మంది బైటికి వెళ్లిపోయినా .. మిగిలిన వారి నుంచి ప్రతి నెలా ఆదాయం రానుంది. ఉజ్జాయింపుగా ఈ సంస్థలకు ఇప్పటిదాకా పాతిక కోట్ల మంది యూజర్లపై అడపాదడపా రూ. 250 కోట్లు వస్తుండగా (రూ. 10 రీచార్జితో)  .. ఇకపై యూజర్ల సంఖ్య సగం తగ్గినా కనీస రీచార్జీ రూ. 35 లెక్కన చూస్తే ప్రతి నెలా రూ. 437 కోట్లయినా రావొచ్చని అంచనా.

మళ్లీ సింగిల్‌ సిమ్‌ బాటేనా..
వివిధ ఆపరేటర్లు అందిస్తున్న ప్రయోజనాలను పొందేందుకు చాలా మంది సబ్‌స్క్రయిబర్స్‌ రెండు మూడు సిమ్‌లు ఉపయోగిస్తున్నారు. ఆగస్టు 2018 నాటికి 120 కోట్ల టెలికం కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 45 కోట్ల కనెక్షన్లు మల్టిపుల్‌ సిమ్‌ కార్డులవేనని అంచనా. తాజా పరిణామంతో తక్షణం యూజర్ల సంఖ్య కనీసం 3 కోట్ల మేర తగ్గొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ తెలిపారు. టెలికం కంపెనీల తాజా చర్యలతో యూజర్లు మళ్లీ సింగిల్‌ సిమ్‌ వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఆరు నెలల వ్యవధిలో కనీసం 6 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ తమ రెండో సిమ్‌ను వదిలించుకోవచ్చని అంచనా. 

కనెక్షన్లు ఫుల్‌..ఆదాయం నిల్‌.. 
దేశీయంగా మొబైల్‌ ఫోన్‌ యూజర్లలో దాదాపు 95 శాతం మంది ప్రీపెయిడ్‌ యూజర్లే ఉంటారు. ఇప్పటిదాకా చాలా మటుకు కనెక్షన్స్‌ విషయంలో ఆర్నెల్లకోసారి అత్యంత తక్కువగా రూ. 10 రీచార్జ్‌ చేసుకున్నా సర్వీసులు, ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కొనసాగేలా లైఫ్‌టైమ్‌ వేలిడిటీ వర్తింపచేస్తూ వస్తున్నాయి టెల్కోలు. కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఎప్పటికప్పుడు మరింత మెరుగైన ప్రయోజనాలతో కొంగొత్త టారిఫ్‌ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నాయి. దీంతో అనేక యూజర్లు అవసరం ఉన్నా లేకపోయినా.. రెండేసి..మూడేసి.. నాలుగేసి.. అంతకు పైగా సిమ్‌ కనెక్షన్లు తీసేసుకున్నారు. దీంతో ఫోన్లలో కూడా మార్పులు వచ్చాయి. డ్యుయల్‌ సిమ్‌ ఫోన్లు.. అంతకు మించి నాలుగైదు సిమ్‌లు వేసుకునే ఫోన్లు కూడా మార్కెట్లోకి హడావిడి చేశాయి. ఇవన్నీ పేరుకే కనెక్షన్లు గానీ వీటిల్లో టాక్‌టైమో.. లేదా డేటానో అయిపోయిందంటే పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా టెల్కోల ఖాతాలో కనెక్షన్లు కనిపిస్తున్నా.. వాటి ద్వారా వచ్చే సగటు ఆదాయాలు పెద్దగా ఉండటం లేదు. ఇక 2016లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌ జియో సంచలనాత్మక ప్లాన్స్‌తో టెలికం రంగాన్ని కుదిపేయడంతో పలు టెల్కోలు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. జియోతో పోటీపడేందుకు భారీ స్థాయిలో చార్జీలను తగ్గించాల్సి రావడంతో వాటి ఆదాయాలు దెబ్బతింటున్నాయి. మొత్తం మీద టెలికం రంగంలో కన్సాలిడేషన్‌కు దారి తీసింది ఇది. వొడాఫోన్‌–ఐడియాలు విలీనం కాగా.. టాటా డొకొమో మెదలైన వాటిని ఎయిర్‌టెల్‌ విలీనం చేసుకుంది. 
    ఈ నేపథ్యంలోనే ఆదాయం ఇవ్వని నామమాత్రపు కనెక్షన్లను వదిలించుకుని సిసలైన కస్టమర్లను మాత్రమే అట్టే పెట్టుకోవాలని, సగటు ఆదాయాలను పెంచుకోవాలని టెల్కోలు భావిస్తున్నాయి. అందుకే తప్పనిసరి రీచార్జ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ నిర్ణయంతో కొందరు యూజర్లు తమ నెట్‌వర్క్‌ నుంచి వెళ్లిపోయినా.. ఉండే వారి దగ్గర్నుంచి పెరిగే ఆదాయాలతో ఆ నష్టం భర్తీ కాగలదని అవి భావిస్తున్నాయి. అంతేగాకుండా నిఖార్సయిన కస్టమర్ల సంఖ్యపై కూడా స్పష్టత వస్తుందని, దాని ప్రకారంగా ప్రణాళికలు చేసుకోవచ్చని యోచిస్తున్నాయి. 

రీచార్జ్‌ చేయకుంటే ఏమవుతుంది ..
తక్షణం రీచార్జి చేసుకోకపోయినా.. పూర్తిగా సేవలు నిలిపివేయకుండా కొంత కాలం పాటు సమయమిస్తున్నాయి టెల్కోలు. పరిశ్రమ వర్గాల ప్రకారం ఉదాహరణకు.. డిసెంబర్‌ 1 2018న రూ. 35 కనీస రీచార్జి చేయించారనుకుందాం. 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మళ్లీ రీచార్జ్‌ చేయించుకోకుంటే 29వ తారీఖు నుంచి ముందుగా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ నిల్చిపోతాయి. కానీ మరో 15 రోజుల దాకా .. అంటే వచ్చే ఏడాది జనవరి 12 దాకా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ మాత్రం అందుకోవచ్చు. ఈ 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ముగిసిపోయిన తర్వాత కూడా బ్యాలెన్స్‌ వేయించుకోకపోతే.. తదుపరి రీచార్జ్‌ చేసుకునే దాకా ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కూడా నిల్చిపోతాయి. అయినప్పటికీ రీచార్జ్‌ చేసుకోకపోతే మరో 90 రోజుల పాటు దాకా లెక్కల్లో మీ కనెక్షన్‌ను టెలికం సంస్థ కొనసాగిస్తుంది. అంటే ఇన్‌కమింగ్‌ కాల్స్‌కి ఇచ్చే 15 రోజులతో పాటు మొత్తం 105 రోజుల మేర గ్రేస్‌ పీరియడ్‌ లభించినట్లవుతుంది. అది కూడా తీరిపోతే ఇక ఆ నంబరును వదులుకోవాల్సిందే. 

‘నో వాల్యూ’ కస్టమర్లకు చెక్‌
ఎటువంటి రిచార్జ్‌ చేయకుండా మొబైల్‌లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారా? ఇక నుంచి మీకు ఆ అవకాశం లేదు. మీరు ఖచ్చితంగా రిచార్జ్‌ చేయించాల్సిందే. లేదంటే మీ నంబర్‌ డిస్‌కనెక్ట్‌ అవుతుంది. ఇది ఏ ఒక్క టెలికం కంపెనీ కస్టమర్‌కో కాదు. భారత్‌లో ఉన్న అన్ని టెలికం కంపెనీల వినియోగదారులకు వర్తిస్తుంది. ఇప్పటికే అన్ని టెల్కోలు ఏకతాటిపై వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు అనుగుణంగా నవంబరు 26 నుంచి కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించడం మొదలుపెట్టాయి. ఈ సందేశంలో ఎంత రిచార్జ్‌ చేయాలి, ఏ తేదీలోపు అనేది స్పష్టం చేస్తున్నాయి. డెడ్‌లైన్‌ దాటితే డిస్‌కనెక్ట్‌ చేయాలని నిర్ణయించామని ఓ ప్రముఖ టెలికం కంపెనీ ప్రతినిధి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. తదుపరి ట్రాయ్‌ ఆదేశాలు వచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 
‘నో వాల్యూ కస్టమర్లు’..
ఆరేడేళ్ల క్రితం దాదాపు అన్ని టెలికం కంపెనీలు లైఫ్‌ టైం వాలిడిటీ ఆఫర్‌ చేశాయి. ఈ కస్టమర్లలో అత్యధికులు ఎటువంటి రిచార్జ్‌ చేయకుండా ఇప్పటికే సేవలను పొందుతున్నారు. టెల్కోల పరంగా వీరంతా నో వాల్యూ కస్టమర్ల జాబితాలోకి వెళ్లిపోయారు. వీరిలో అత్యధికులు విద్యార్థులు, గృహిణులు ఉన్నారు. అంటే నాన్‌ వర్కింగ్‌ క్లాస్‌ అన్నమాట. వీరి వల్ల నెట్‌వర్క్‌పై భారం తప్ప, ఆదాయం లేదన్నది కంపెనీల భావన. నష్టాల నుంచి గట్టెక్కడానికి, కంపెనీలను బలోపేతం చేయడానికి తాజా నిర్ణయం తీసుకున్నామని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. కస్టమర్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ప్రతి నెల చేయించాల్సిన రిచార్జ్‌ మొత్తం రూ.10 నుంచి మొదలుకుని రూ.250 వరకు ఉందన్నారు.

 బ్యాలెన్స్ ఉన్నా సేవలు ఎ౾లా ఆపేస్తారు..
టెలికం సర్వీసులను యథాప్రకారం పొందాలంటే ప్రతి నెలా తప్పనిసరిగా కనీస రీచార్జ్‌ చేసుకోవాలంటూ యూజర్లకు టెల్కోలు మెసేజీలు పంపిస్తుండటంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. తమ ప్రీ-పెయిడ్ అకౌంట్స్‌లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా టెల్కోలు ఈ తరహా మెసేజీలు పంపిస్తున్నాయంటూ సబ్‌స్క్రయిబర్స్‌ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆపరేటర్లకు ట్రాయ్ అక్షింతలు వేసింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా సర్వీసులు డిస్కనెక్ట్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. తగినంత ప్రీ-పెయిడ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు సర్వీసులను తక్షణమే డిస్కనెక్ట్ చేయొద్దంటూ టెల్కోలను ఆదేశించింది. "టారిఫ్‌లు, ప్లాన్ల విషయంలో సాధారణంగా మేం జోక్యం చేసుకోము. కానీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా కూడా సర్వీసులు నిలిపివేస్తామంటూ యూజర్లను టెల్కోలు హెచ్చరిస్తుండటం.. మాత్రం సరికాదు" అని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలకు మంగళవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేటర్లతో గతవారమే భేటీ అయిన ట్రాయ్‌.. ఈ వివాదాన్ని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈలోగా "ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ ఏ రోజుతో ముగిసిపోతుందన్నది, మినిమం రీచార్జ్ ప్లాన్ సహా అందుబాటులో ఉన్న ప్లాన్స్ అన్నింటి గురించీ సబ్‌స్క్రయిబర్స్‌కు స్పష్టంగా, పారదర్శకంగా తెలియజేయాలి. ప్రీ-పెయిడ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే దానితో సదరు ప్లాన్స్‌ ఎలా కొనుగోలు చేయొచ్చన్నదీ వివరంగా తెలపాలి" అని టెల్కోలను ట్రాయ్ ఆదేశించింది. 72 గంటల్లోగా ఈ విషయాలను ఎస్‌ఎంఎస్ ద్వారా యూజర్లకు తెలియజేయాలంటూ సూచించింది. అప్పటిదాకా కనీస రీచార్జ్ మొత్తానికి సరిసమానంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్న పక్షంలో సర్వీసులు డిస్కనెక్ట్ చేయరాదంటూ ఆదేశించింది. You may be interested

ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ‘డాక్టర్‌ టర్మరిక్‌’

Thursday 29th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ కాపర్‌ పేరుతో రాగి బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ త్వరలో హెల్త్‌కేర్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. డాక్టర్‌ టర్మరిక్‌  పేరుతో తొలి ఉత్పాదనను డిసెంబరు చివరికల్లా విడుదల చేయనుంది. ఆర్గానిక్‌ పసుపు, సహజ రసాయనాలతో తయారు చేసిన ఈ పౌడర్‌ యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. మౌత్‌వాష్‌గా వాడొచ్చు. అలాగే మంచినీటిలో కలుపుకుని తాగవచ్చు. వంటల్లోనూ వినియోగించొచ్చు. పేటెంటుకు దరఖాస్తు చేశామని ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ఎండీ కె.వి.రాజశేఖర్‌ రెడ్డి

న్యూజ్‌లో వాటా కొన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: మీడియా స్టార్టప్‌ న్యూ ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌లో (న్యూజ్‌) మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లమిటెడ్‌(అర్‌ఐఐహెచ్‌ఎల్‌) ఈ వాటాను రూ. 1.03 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా 30 వేల ఈక్విటీ షేర్లను, 125 కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. దీంతో ఇక నుంచి న్యూజ్‌

Most from this category