STOCKS

News


జీఎస్‌టీని సరళతరం చేయండి

Thursday 9th August 2018
news_main1533793211.png-19091

వాషింగ్టన్: సంక్లిష్టమైన జీఎస్‌టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది. భారతపై రూపొందించిన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అంశాలు ప్రస్తావించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ పన్ను సంస్కరణల్లో జీఎస్‌టీ ఒక 'మైలురాయి' లాంటిదని ఐఎంఎఫ్ అభివర్ణించింది. "అయితే, పలు శ్లాబులు, మినహాయింపులు మొదలైన వాటితో దీని స్వరూపం సంక్లిష్టంగా ఉంది. రెండు రేట్ల విధానంతో.. పురోగామి స్వభావాన్ని త్యాగం చేయకుండానే అధిక ప్రయోజనాలు పొందేలా దీన్ని సరళతరం చేయొచ్చు" అని తెలిపింది. ప్రామాణికమైన ఒక తక్కువ స్థాయి రేటు, ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులపై అధిక రేటు విధించడం ద్వారా సరళత్వాన్ని సాధించవచ్చని పేర్కొంది. అలాగే మినహాయింపులను కూడా క్రమబద్ధీకరించవచ్చని, నిబంధనలను పాటించడంలోనూ.. పాలనాపరంగా అమలు చేయడంలోనూ అయ్యే వ్యయాలను తగ్గించుకోవచ్చని తెలిపింది. 
ఈసారి వృద్ధి 7.3 శాతం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.50 శాతంగాను ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారీ పెట్టుబడులు, గణనీయంగా పెరిగే వినియోగం ఇందుకు తోడ్పడగలవని పేర్కొంది. "2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్‌, ఆ తర్వాత జీఎస్‌టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్‌ ప్రయోజనం పొందుతోంది" అని నివేదికలో వివరించింది. జీఎస్‌టీ అమల్లో స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. 
వృద్ధి చోదకంగా భారత్‌..
పటిష్టమైన భారత్‌ .. రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ ఎకానమీ వృద్ధి చోదకంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ప్రస్తుతం కొనుగోలు శక్తి విషయంలో చైనా, అమెరికా తర్వాత స్థానంలో భారత్ ఉందని భారత్‌లో ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ రణిల్ సల్గాడో తెలిపారు. భారత్‌లో పని చేయగలిగే సామర్ధ్యం గల వయస్సున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు మరో మూడు దశాబ్దాలు పడుతుందని ఆయన చెప్పారు. "ఇది చాలా సుదీర్ఘ సమయం. ఆ విధంగా వచ్చే మూడు దశాబ్దాలే కాకుండా మరింత కాలం పాటు ప్రపంచ ఎకానమీకి భారత్ వృద్ధి చోదకంగా నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత కాలంగా కీలకపాత్రను పోషించిన చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించగలదు" అని రణిల్ తెలిపారు. 
పరపతి విధానం క్రమంగా కఠినతరం..
ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ క్రమంగా పరపతి విధానాన్ని కఠినతరం చేయాల్సి ఉంటుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ముడిచమురు రేట్ల పెరుగుదల, ఖరీఫ్ పంటల మద్దతు ధర పెరగడం తదితర అంశాలు ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవలి రేట్ల పెంపు సరైనదేనని, రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ తెలిపింది. ద్రవ్యోల్బణ కారణాలతో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం పెంచిన వారం రోజుల వ్యవధిలోనే ఐఎంఎఫ్ తాజా సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. You may be interested

అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ

Thursday 9th August 2018

ముంబై: ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే‍్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ విక్రమ్‌ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్‌ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన

ఎన్‌పీఏ బ్యాంకుల భారీ ర్యాలీ..!

Thursday 9th August 2018

6నెలల గరిష్టానికి ఐసీఐసీఐ బ్యాంకు ముంబై:- కార్పొరేట్‌ రుణాల కారణంగా నిరర్థక ఆస్తులు కలిగిన బ్యాంకు షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ ర్యాలీ చేశాయి. ఎన్‌పీఏ సమస్యలతో  ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్‌లో 7శాతం నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 ఇండెక్స్‌లోని టాప్‌ - 5 షేర్లలో వరుసగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు

Most from this category