News


ముంబై-పుణె మధ్య హెలికాప్టర్‌ సేవలు

Thursday 6th December 2018
news_main1544075936.png-22693

ముంబై: యాప్‌తో నిమిషంలో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టే... త్వరలో హెలికాప్టర్‌ సర్వీస్‌ను ఇంతే సులభంగా ఆర్డర్‌ చేసే అవకాశం రానుంది. దేశంలో తొలిసారిగా రెండు నగరాల మధ్య హెలికాప్టర్‌ సేవలు ఆరంభం కానున్నాయి. అమెరికాలో అతిపెద్ద హెలికాప్టర్‌ సేవల సంస్థ అయిన ‘ఫ్లై బ్లేడ్‌’ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన హంచ్‌ వెంచర్స్‌ భాగస్వామ్యంతో కలసి ఈ సంస్థ ముంబై-పుణె నగరాల మధ్య హెలికాప్టర్‌ సర్వీసులను వచ్చే మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది మే వరకు ఎయిర్‌ఏషియాకు చీఫ్‌గా వ్యవహరించిన అమర్‌ అబ్రాల్‌ బ్లేడ్‌ ఇండియా సీఈవోగా పనిచేయనున్నారు. ఈక్విటీ పెట్టుబడుల సేవల్లో హంచ్‌ వెంచర్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు వెలుపల ఫ్లై బ్లేడ్‌ సం‍స్థ కార్యకలాపాలను విస్తరిస్తున్న తొలి దేశం భారత్‌ కావడం గమనార్హం. 
భారత మార్కెట్‌పై భారీ అంచనాలు
ముంబైలోని జుహు, మహాలక్ష్మి ప్రాంతాల నుంచి హెలికాప్టర్‌ సర్వీసులు టేకాఫ్‌ తీసుకుంటాయి. తొలుత పుణె నగరంతో ఆరంభించి తర్వాత షిర్డీకి కూడా సేవలను విస్తరించాలనుకుంటోంది ఫ్లైబ్లేడ్‌. తదుపరి ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఈ సేవలను విస్తరించే ఆలోచనతో ఉంది. వారంత పర్యాటక సర్వీసులు కూడా సంస్థ ప్రణాళికల్లో ఉన్నాయి. బ్లేడ్‌ సీఈవో రాబ్‌ వీసెంతల్‌ మాట్లాడుతూ... ‘‘వాణిజ్య విమానాశ్రయాల్లో రద్దీ నుంచి హెలికాప్టర్‌ సేవలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పిస్తాయి. 35 నిమిషాల ప్రయాణానికి నాలుగు నుంచి ఎనిమిది గంటల పాటు సమయం వెచ్చించాల్సిన అవస్థ తప్పుతుంది. అయితే, ఈ సేవలు ఓలా, ఊబర్‌ మాదిరిగా చౌకగా ఉండవు. డబ్బులు కంటే తమ సమయం విలువైన వారికి మా సేవలు తగినవి’’ అని వీసెంతల్‌ వివరించారు. అంటే ఈ సంస్థ అందించబోయే సంస్థలు ప్రియంగానే ఉంటాయని స్పష్టం చేసినట్టయింది. అంతేకాదు ఈ సంస్థ భారత విపణిపై భారీ అంచనాలతో ఉంది. భారత్‌లో ఒక విజయవంతమైన మార్గం తమకు అమెరికాలో మొత్తం సేవలకు మించి ఆదాయాన్ని ఇవ్వగలదన్న అంచనాను వీసెంతల్‌ వ్యక్తం చేయడమే దీన్ని తెలియజేస్తోంది. ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీలను తాము అమలు చేయనున్నట్టు చెప్పారు. అస్సెట్‌ లైట్‌ మోడల్‌ను తాము అనుసరిస్తామని, సొంతంగా హెలికాప్టర్లను కలిగి ఉండమని చెప్పారు. మన దేశంలో రవాణా సదుపాయాల కల్పన పరంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో... ప్రస్తుతమున్న హెలికాప్టర్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని తక్షణమే నగరాల్లో వాయు రవాణా సేవలను ప్రారంభిస్తున్నామని హంచ్‌ వెంచర్స్‌ వ్యవస్థాపకుడు కరణ్‌పాల్‌సింగ్‌ తెలిపారు. ఫ్లై బ్లేడ్‌ సంస్థను అమెరికాలో హెలికాప్టర్‌ సేవలకు ఊబర్‌గా పేర్కొంటారు. అంటే క్యాబ్‌ సేవల్లో ఊబర్‌ ఎలా అయితే సక్సెస్‌ అయిందో, హెలికాప్టర్‌ సేవల్లో ఫ్లై బ్లేడ్‌ అదే విధంగా గుర్తింపు పొందింది. 


 You may be interested

ఈ నెల 13 నుంచి భెల్‌ షేర్ల బైబ్యాక్‌

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: భెల్‌ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభమై 27న ముగియనున్నది. . ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా భెల్‌ కంపెనీ 5.16 శాతం వాటాకు సమానమైన 18.93 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ కోసం ఈ కంపెనీ రూ.1,628 కోట్లు కేటాయించింది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను బైబ్యాక్‌

మారుతీ కార్ల ధరలకు రెక్కలు

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్న  కారణంగా ధరలను పెంచక  తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నామని పేర్కొన్న  ఈ కంపెనీ ఎంత మేరకు ధరలను పెంచేది వెల్లడించలేదు. కమోడిటీ దరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా ఉత్పత్తి

Most from this category