STOCKS

News


భారత్‌ రేటింగ్‌ మార్చడం లేదు!

Friday 16th November 2018
news_main1542348145.png-22085

న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్‌... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ సావరిన్‌ రేటింగ్‌ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్‌ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పరిస్థితి లేదని ఫిచ్‌ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌లోటు (క్యాడ్‌) వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్‌కు ఇబ్బందులు ఉన్నాయని ఫిచ్‌ స్పష్టం చేసింది. భారత్‌ దీర్ఘకాల ఫారిన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌ (ఐడీఆర్‌)ను ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ-’గానే కొనసాగిస్తున్నాం అని ఫిచ్‌ ఈ ప్రకటనలో పేర్కొంది. ఫిచ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో​కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ మధ్య కాలికంగా వృద్ధి పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య పరిస్థితులకు కూడా మధ్య కాలికంగా సానుకూలంగా ఉన్నాయి. అయితే ద్రవ్య పరిస్థితులు పేలవంగా ఉండడం, బలహీన ఫైనాన్షియల్‌అంశాలు, వ్యవస్థాగత అంశాలు బాగుండకపోవడం వంటి అంశాలు రేటింగ్‌ పెంపునకు ప్రతికూలంగా ఉన్నాయి. 
⇔ ముఖ్యంగా స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌కు ప్రతికూలతలు స్పష్టంగా ఉన్నాయి. రుణ వృద్ధి పడిపోయింది. మొండిబకాయిలుసహా బ్యాంకింగ్‌ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంక్షోభం అనంతరం తలెత్తిన లిక్విడిటీ పరమైన అంశాలు కూడా ఇక్కడ గమనార్హం. 
⇔ ఇక ప్రభుత్వ రుణ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 70 శాతానికి చేరింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను 3.3 శాతానికి ( 6.24 లక్షల కోట్లు) కట్టడి చేయడం కష్టంగానే కనబడుతోంది. ఆదాయాలు తక్కువగా ఉండడం ఇక్కడ గమనార్హం. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి నెలనెలా లక్ష రూపాయల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నా... ఇప్పటి వరకూ అది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. కేవలం​రెండు నెలలు  (ఏప్రిల్‌, అక్టోబర్‌) మినహా లక్ష కోట్లు వసూళ్లు జరగలేదు.  ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో జూలై 27వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఫ్రిజ్‌లు, స్మాల్‌ స్క్రీన్స్‌సహా 88 వస్తువులపై జీఎస్‌టీ కౌన్సిల్‌ కోత విధించింది. దీనితో 35 వస్తువులు మాత్రమే 28 శాతం అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్నాయి. 
⇔ ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో వ్యయాల అదుపు కష్టమే. ఒకపక్క రాబడులు తగ్గడం, మరోపక్క​ అధిక వ్యయాల తప్పని పరిస్థితులు ద్రవ్యలోటు పరిస్థితులను కఠినం చేసే అవకాశం ఉంది. 
⇔ ఇతర వర్థమాన దేశాలతో పోల్చిచూస్తే, ప్రపంచబ్యాంక్‌ గవర్నెర్స్‌ ఇండికేటర్‌ తక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచీ కూడా బలహీనంగా ఉంది. 
⇔ ధరల పెరుగుదల, కరెంట్‌ అకౌంట్‌ లోటు కట్టడిపై భయాలు రేటింగ్‌ పెంపు అవకాశాలకు గండికొడుతున్నాయి. 
⇔ ఇక 2019 మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందన్న అంచనాల్లో మార్పులేదు. 2017-18లో ఈ రేటు 6.7 శాతం. అయితే కఠిన ద్రవ్య పరిస్థితులు, బలహీన ఫైనాన్షియల్‌ రంగ బ్యాలెన్స్‌షీట్‌ అంశాలు, అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. అయితే 2019-21 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 7.3 శాతానికే పరిమితం కావచ్చు. 
⇔ 2017-18లో కరెంట్‌ అకౌంట్‌లోటు (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట ఏడాదిలో దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)1.9 శాతం. 2018-2019లో 3 శాతానికి, 2019-2020లో 3.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 
⇔ సానుకూల వ్యాపార అంశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్‌ 190 దేశాల రేటింగ్‌లో భారత్‌ స్థానం 53 స్థానాలు పెరిగి 77కు చేరడం ‘‘గణనీయమైనదే’. అయితే అయితే సంబంధిత సంస్కరణల అంశాలన్నీ ఉత్పాదక వృద్ధి పటిష్టతవైపునకు ఇంకా మారాల్సి ఉంది. 
ప్రభుత్వ వర్గాల నిరాశ?
ఫిచ్‌ రేటింగ్‌ పెంపునకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. 2004 తరువాత మొట్టమొదటి సారి మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ (ఫిచ్‌ ప్రత్యర్థి) 2017 నవంబర్‌లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కి అప్‌గ్రేడ్‌ చేసింది. తర్వాత భారత్‌ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ నేపథ్యంలో రేటింగ్‌ పెంపు సమంజసమని ఫిచ్‌ను ఒప్పించడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. 2006 ఆగస్టు 1న ఫిచ్‌ భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను ‘బీబీ+’ నుంచి ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ-’కు అప్‌గ్రేడ్‌ చేసింది. అప్పటి నుంచీ అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే 2012లో అవుట్‌లుక్‌ను ‘నెగిటివ్‌’కు మార్చింది. కానీ తదుపరి ఏడాదే ‘స్థిరానికి’ పెంచింది. కాగా మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- ఎస్‌అండ్‌పీ కూడా తన భారత్‌ ప్రస్తుత రేటింగ్‌ ‘బీబీబీ-’ నుంచి అప్‌గ్రేడ్‌చేయడానికి ససేమిరా అంటోంది. ప్రభుత్వ అధిక రుణ భారం, అల్పాదాయ స్థాయి దీనికి కారణాలుగా చూపుతోంది. ఇదే రేటింగ్‌ను 2007 నుంచీ ఎస్‌అండ్‌పీ కొనసాగిస్తోంది. You may be interested

ఆల్‌టైమ్ గరిష్టానికి స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు

Friday 16th November 2018

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9.1 శాతం వృద్ధితో 4.26 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్లో ఫీచర్ ఫోన్స్‌కి సరిసమానంగా స్మార్ట్‌ఫోన్స్‌ 50 శాతం మేర వాటా సాధించడం ఇదే తొలిసారని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమి అత్యధికంగా 1.17 కోట్ల యూనిట్లు,

ఐటీలో కొత్తగా 14 లక్షల ఉద్యోగాలు: సిస్కో

Friday 16th November 2018

ఢిల్లీ: సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బిగ్‌ డేటా వంటి అత్యాధునిక టెక్నాలజీల కారణంగా భారత్‌లో 2027 నాటికి కొత్తగా 14 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తాయని సిస్కో-ఐడీసీ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. ఇదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని పేర్కొంది. 2017 నాటికి భారత్‌లో ఉన్న 91 లక్షల ఐటీ ఉద్యోగాల్లో 59 లక్షల మందిని నూతన తరం టెక్నాలజీ

Most from this category