STOCKS

News


ద్రవ్యలోటు ఆందోళన!

Wednesday 27th February 2019
news_main1551241908.png-24354


- లక్ష్యం 6.34 లక్షల కోట్లు
 - జనవరి నాటికే 7.70 లక్షల కోట్లు
- ఆర్థిక సంవత్సరంలో మరో 2 నెలలు
- లక్ష్యాన్ని దాటనివ్వమంటున్న కేం‍ద్రం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లెక్కలు ప్రస్తుతానికి ఆందోళన సృష్టిస్తున్నాయి. కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ - 2019 మార్చి) మధ్య  ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్‌ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం.
- అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పియూష్‌ గోయెల్‌ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4 శాతం) పెంచారు. చిన్న సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్‌ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని తన బడ్జెట్‌ ప్రసంగంలో గోయెల్‌ తెలిపారు. 
- అయితే జనవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే) ఈ లోటు రూ. 7.70 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100 శాతం దాటిపోయి మరో 21.5 శాతం (121.5 శాతం) పెరిగిందన్నమాట. 
- అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
- 2018-19కు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం ఆదాయ లక్ష్యం రూ.17.29 లక్షల కోట్లు. అయితే జనవరి నాటికి ఈ వసూళ్లు రూ.11.81 లక్షల కోట్లు. అంటే లక్ష్యంలో 68.3 శాతమన్నమాట. 
- అలాగే వ్యయాల మొత్తం రూ.24.57 లక్షల కోట్లయితే జనవరి ముగిసే నాటికి రూ.20.01 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పరిమాణం వ్యయాలు బడ్జెట్‌తో పోల్చితే 81.5 శాతంగా ఉన్నాయన్నమాట. 

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?
ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది.  ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో- డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.  ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  ఇందుకు అనుగుణంగా జలాన్‌ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్‌ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం.



You may be interested

జియోకు రూ.15,000 కోట్ల నష్టం..!

Wednesday 27th February 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్‌ జియో రూ15,000 కోట్ల నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోక‌రేజ్ కంపెనీ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. పోటీ సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు ప్రకటించనున్న నష్టాల కంటే.. ఈ సంస్థ నష్టమే భారీ స్థాయిలో ఉండనుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.830 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తరుగుదల, సబ్సిడీ వ్యయం వంటి అంశాలను

తాన్లా సొల్యూషన్స్‌ ‘ట్రూబ్లాక్‌’

Wednesday 27th February 2019

క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ ప్రొవైడర్‌ తాన్లా సొల్యూషన్స్‌ టెలికం రంగంలో సంచలనానికి తెరలేపుతూ బ్లాక్‌చైన్‌ ఆధారిత టెక్నాలజీ ‘ట్రూబ్లాక్‌’ను ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏమంటే అవాంచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను మొబైల్‌ కస్టమర్లు స్వయంగా నియంత్రించవచ్చు. స్పామ్‌, మోసాల నుంచి కట్టడి చేసేందుకు టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకు వీలవుతుంది. అలాగే డేటా ప్రైవసీ ఉంటుంది. వాణిజ్యపర కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల విషయంలో వినియోగదారు సమ్మతి, ప్రాధాన్యతను నమోదు చేస్తారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌

Most from this category