News


వాస్తవ ఆర్థిక స్థితిని తెలిపేందుకే..!

Friday 30th November 2018
news_main1543554135.png-22503

న్యూఢిల్లీ: మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వృద్ధి రేటును సవరించడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించారు. ఎంతో విశ్వసనీయత కలిగిన కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) ఈ పని చేసిందంటూ... ఆర్థిక శాఖకు ఈ విభాగానికి ఉండాల్సినంత దూరం ఉందని గుర్తు చేశారు. గత కాలపు జీడీపీ వృద్ధి రేటు సవరణలపై వస్తున్న విమర్శలకు జైట్లీ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2011-12 సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా మార్చారు. కొత్త ఫార్ములా ప్రకారం గణాంకాలను సవరించారు. నా ఉద్దేశం ప్రకారం ఇలా చేయటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిని అంతర్జాతీయంగా మరింత మంది పరిగణనలోకి తీసుకుంటారు’’ అని జైట్లీ వివరించారు.  సీఎస్‌వోకు గతంలో నాయకత్వం వహరించిన ప్రముఖులు సైతం ఈ గణాంకాలు మరింత సమగ్రంగా, భారత ఆర్థిక పరిస్థితిని తెలియజేసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డట్టు చెప్పారాయన. ‘‘వాస్తవాలు, సవరించిన సూత్రాల ఆధారంగా గణాంకాలను సవరించటమనేది నిరంతర ప్రక్రియ.  సీఎస్‌ఓ సవరణ వల్ల యూపీఏ పాలనలోని చివరి రెండేళ్లూ వృద్ధి పెరిగింది. అప్పుడు స్వాగతించిన కాంగ్రెస్‌ ఇప్పుడు మాత్రం విమర్శిస్తోంది. నిజానికి 2015 ఫిబ్రవరిలో సీఎస్‌వో 2011-12 సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా పరిగణిస్తూ కొత్త జీడీపీ సిరీస్‌ను ప్రకటించింది. దాంతో 2012-13 నుంచి నూతన జీడీపీ సిరీస్‌ను సవరించాం. అప్పటి నుంచి ప్రతీ జీడీపీ డేటా (త్రైమాసికం లేదా వార్షికం) కొత్త సిరీస్‌ ఆధారంగానే వస్తోంది. వారి హయాంలో వృద్ధి రేటు మా కంటే ఎక్కువేనన్న కాంగ్రెస్‌ వాదనను సవరించిన గణాంకాలు చెరిపేశాయి’’ అని జైట్లీ వివరించారు. 
సవరించిన గణాంకాల ప్రకారం...
అనూహ్యమైన రీతిలో బుధవారం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌తో కలిసి కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ  సవరించిన జీడీపీ అంచనాలను ప్రకటించారు. వీటి ప్రకారం యూపీఏ హయాంలో జీడీపీ సగటు వృద్ధి 6.7 శాతమే. మోదీ సర్కారు నాలుగున్నరేళ్ల పాలనలో సగటు వృద్ధి రేటు 7.3 శాతం. సవరించక ముందునాటి గణాంకాల ప్రకారమైతే యూపీఏ పదేళ్ల పాలనలో సగటు వృద్ధి రేటు 7.75 శాతంగా ఉంది. 2004- 2005కు బదులు 2011-12ను బేస్‌ సంవత్సరంగా పరిగణిస్తూ సీఎస్‌వో జీడీపీ గత గణాంకాలను సవరించింది. 2010-11లో జీడీపీ 10.3 శాతమని అప్పట్లో ప్రకటించగా... తాజాగా దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. 2005-06లో 9.3 శాతం రేటును 7.9 శాతానికి, 2006-07 సంవత్సరం జీడీపీ రేటును 9.3 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. అలాగే, 2007-8 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 9.8 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. దీంతో దేశంలో సంస్కరణల పథం మొదలైన తర్వాత యూపీఏ హయాంలో నమోదైన రెండంకెల వృద్ధి రేటు కనుమరుగైంది. 
నీతి ఆయోగ్‌కు సంబంధమేంటి?
యూపీఏ హయాంనాటి జీడీపీ గణాంకాల సవరణలో నీతి ఆయోగ్‌కు సంబంధమేంటన్నదే ఇపుడు విమర్శకులు సంధిస్తున్న ప్రశ్న.  ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు సైతం... జీడీపీ సవరణ గణాంకాల ప్రకటనకు నీతి ఆయోగ్‌ను దూరంగా ఉంచినట్లయితే ఈ వివాదం రాకుండా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. జీడీపీ గణాంకాల్లో నీతి ఆయోగ్‌కు ఎలాంటి పాత్రా లేదన్న విషయాన్ని గుర్తు చేశాయి. బుధవారం నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో సవరించిన గత గణాంకాలను (బ్యాక్‌ సిరీస్‌) ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ ప్రకటించారు. దీంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సహా పలువురు విమర్శలకు దిగారు. సవరణ అన్నది నీతి ఆయోగ్‌ ద్వారా జరిగిన కత్తిరింపు చర్యగా చిదంబరం అభివర్ణించగా, మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రణబ్‌ సేన్‌ సైతం నీతి ఆయోగ్‌ పాత్రను ప్రశ్నించారు. ‘‘సీఎస్‌వో తీసుకొచ్చే గణాంకాల విషయంలో మనకుంటూ ఓ వ్యవస్థ ఉంది. అది రాజకీయ జోక్యంతో పూర్తిగా తొలగిపోయింది. గణాంకాల విడుదలకు ముందే ప్రధాని సైతం వాటిని తెలుసుకునే అవకాశం ఉంటోంది. రాజకీయ సంస్థ అయిన నీతిఆయోగ్‌తో కలసి ఇప్పుడు సీఎస్‌వో గణాంకాలను విడుదల చేయడం ఆ సంస్థ సమగ్రతను నిర్వీర్యం చేయడమే’’ అని ప్రణబ్‌సేన్‌ పేర్కొన్నారు. రాజకీయ సంస్థ జాతీయ గణాంకాల సమాచారాన్ని విడుదల చేసినప్పుడు విశ్వసనీయతపై సహజంగానే ప్రశ్నలు వస్తాయన్నారు. గణాంకాలను కాకుండా అవి విడుదల చేసిన విధానాన్నే సేన్‌ తప్పుబట్టారు. 

‘జీఎస్టీ’లానే మరో సమాఖ్య వ్యవస్థ కావాలి
జీఎస్టీ కౌన్సిల్‌ మాదిరిగా దేశంలో ఆరోగ్య, సాగు రంగాలకు సమాఖ్య వ్యవస్థ అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాల ద్వారానే అమలు చేస్తున్నందున ఆరోగ్య రంగంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత అంతగా ఉండదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘జీఎస్టీ కౌన్సిల్‌ అనే సమాఖ్య సంస్థ ఏర్పాటు విజయవంతమయింది. ఈ తరహా సమాఖ్య వ్యవస్థ ప్రధానంగా మరో రెండు రంగాల్లోనూ కావాలి. అవి ఆరోగ్యం, వ్యవసాయం. జీఎస్టీ అన్నది రాజ్యాంగ బద్ధంగా అందించినది. కానీ, ఈ రంగాలు అలా కాదు. అయినప్పటికీ రాజకీయ చైతన్యం ప్రభుత్వాలను ఈ తరహా ప్రయోగాలను అనుసరించేలా ఒత్తిడి చేయవచ్చు’’ అని సీఐఐ నిర్వహించిన ఆరోగ్య సదస్సులో జైట్లీ చెప్పారు. ఆరోగ్య రంగంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను ఖర్చు చేస్తున్న విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రాలకు సొంతంగా ఆస్పత్రులున్నాయి. కేంద్రం కూడా ప్రతిష్టాత్మక వైద్య సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేయాలి. దీనివల్ల వనరుల ఏకీకరణతో దేశంలోని రోగులకు మేలు కలుగుతుంది. అంతిమంగా ఇది రాష్ట్రాల ద్వారానే అమలవుతుంది’’ అని జైట్లీ వివరించారు.  సమాఖ్య సంస్థ ఉంటే ‘మా పథకం మీ కంటే మెరుగైనది’ అన్న సమస్య ఉండబోదన్నారు. ప్రతీ రాష్ట్రం ప్రయోజనం పొందుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల పన్నులను విలీనం చేసిన జీఎస్టీ దేశంలో సమాఖ్య సంస్థ పరంగా తొలి ప్రయోగంగా పేర్కొన్నారు.  You may be interested

పెద్ద నోట్ల రద్దు దారుణం..

Friday 30th November 2018

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న "ఆఫ్‌ కౌన్సిల్ - ది చాలెంజెస్ ఆఫ్ మోదీ- జైట్లీ ఎకానమీ" పేరిట

ఫ్లాట్‌గా పసిడి ధర

Friday 30th November 2018

డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా శుక్రవారం పసిడి ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.30డాలర్ల స్వల్ప నష్టంతో  1,230.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ కదులుతోంది. అర్జెంటీనాలో నేడు, రేపు జరగనున్న జీ-20 సదస్సులో వాణిజ్య యుద్ధంపై అగ్రరాజ్యాధిపతులైన ట్రంప్‌- జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చల ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. దీంతో పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ 96.79 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది.

Most from this category