STOCKS

News


రుణ మాఫీ హామీలు సరికాదు

Saturday 15th December 2018
news_main1544849046.png-22951

న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాజకీయ పార్టీలిస్తున్న రుణాల మాఫీ హామీలను రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ తప్పుబట్టారు. రుణాల మాఫీ అనేది ఎన్నికల హామీల్లో భాగం కాకూడదన్నారు. ‘‘దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్రాల ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడికి దారి తీస్తుంది’’ అన్నారాయన. పార్టీలు ఇలాంటి హామీలివ్వకుండా చూడాలంటూ తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసినట్లు చెప్పారాయన. ‘‘నిజం చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని నైరాశ్య పరిస్థితుల్ని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే అది రుణాల మాఫీ ద్వారానేనా? అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రుణాలు తీసుకునేది కొందరు మాత్రమే’’ అని రాజన్‌ చెప్పారు. గురువారమిక్కడ ‘భారతదేశానికి కావాల్సిన ఆర్థిక వ్యూహం’ అనే అంశంపై ఒక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణాలు కాస్తంత పలుకుబడి కలిగిన వారికే వస్తుంటాయని, వారికే ఈ మాఫీతో లబ్ధి కలుగుతుందని చెప్పారాయన. ఈ మాఫీలు రుణ సంసృ‍్కతిని విషతుల్యం చేస్తాయని, కేంద్ర- రాష్ట్రాల బడ్జెట్లపై ఒత్తిడి పెంచుతాయని వ్యాఖ్యానించారు. 
రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా...
ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వాలు మోపే రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా ప్రమాదకరమైనవేనని రాజన్‌ వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం నిధులివ్వకుండా పీఎస్‌బీలపై ఇలాంటి లక్ష్యాలు రుద్దటం సరికాదు. ఇవి భవిష్యత్తు ఎన్‌పీఏల వాతావరణానికి దారితీస్తాయి. పీఎస్‌బీలను తగినంత నిధులతో పటిష్టం చేయాలి’’ అని చెప్పారు. ఏదైనా అవసరం ఉండి చేస్తే దానికి వెంటనే బడ్జెట్‌ నిధుల నుంచి సర్దుబాటు చేయాలని సూచించారు.
ప్రయివేటీకరణే పరిష్కారం కాదు...
ప్రభుత్వరంగ బ్యాంకుల సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదని రఘురామ్‌ రాజన్‌ స్పష్టంచేశారు. రుణాల పంపిణీ లక్ష్యాలు, ప్రభుత్వ పథకాల పంపిణీ బాధ్యతలు ప్రభుత్వ బ్యాంకులపై రుద్దడం వంటి జోక్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లిక్విడిటీ కవరేజీ రేషియో, నెట్‌ స్టెబుల్‌ ఫండింగ్‌ రేషియోలను దీనికి ప్రత్యా‍మ్నాయంగా పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి అమల్లోకి వచ్చే విధంగా లిక్విడిటీ రేషియోను పావు శాతం తగ్గిస్తూ ఆర్‌బీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 19 శాతం ఉండగా, ప్రతీ త్రైమాసికానికి పావు శాతం చొప్పున 18 శాతానికి వచ్చే వరకు తగ్గించాలన్నది ఆర్‌బీఐ నిర్ణయం. బ్యాంకింగ్‌ రంగంలో భారీ ఎన్‌పీఏల సమస్య నేపథ్యంలో... ప్రభుత్వరంగ బ్యాంకుల బోర్డులను నిపుణులతో భర్తీ చేయాల్సిన అవసరాన్ని రాజన్‌ గుర్తు చేశారు. పీఎస్‌బీ బోర్డుల్లో నియామకాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచించారు. ‘‘ఎక్కువ సమస్య పీఎస్‌బీల్లో ఉంది. అలాగని, ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఇతర పాత తరం ప్రైవేటు బ్యాంకులు కూడా దీనికి అతీతం కాదు. పాలనను, పారదర్శకతను ప్రోత్సాహకాలను మెరుగుపరచాలి. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ సమస్యలున్న నేపథ్యంలో... ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం కాబోదు’’ అని రాజన్‌ వివరించారు.You may be interested

గవర్నెన్స్ విధానంపై లోతుగా అధ్యయనం

Saturday 15th December 2018

ముంబై: కొత్త గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్‌ సారథ్యంలో శుక్రవారం తొలిసారిగా భేటి అయిన ఆర్‌బీఐ బోర్డు.. గవర్నెన్స్‌ విధానాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయంగాను.. అంతర్జాతీయంగాను ఎదురవుతన్న సవాళ్లు, లిక్విడిటీ, రుణ వితరణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై చర్చించింది. ’ఆర్‌బీఐ గవర్నెన్స్‌ అంశంపై బోర్డు చర్చించింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది’

బైబ్యాక్‌ బాటలో ఓఎన్‌జీసీ కూడా !

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ దిగ్గజం, ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ చేయనున్నది. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన  పరిశీలన కోసం ఈ నెల 20న (వచ్చే గురువారం) డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానున్నదని ఓఎన్‌జీసీ శుక్రవారం తెలిపింది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 67.48 శాతం చొప్పున వాటా ఉంది.  షేర్ల బైబ్యాక్‌ బాటలో చమురు కంపెనీలు... మరో ఆయిల్‌ దిగ్గజం ఐఓసీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు డైరెక్టర్ల ఆమోదం పొందిన  మరుసటి రోజే ఓఎన్‌జీసీ

Most from this category