STOCKS

News


ఎన్ని చేసినా ఫలితం లేదు!

Friday 12th April 2019
news_main1555049848.png-25089

- చిన్న పరిశ్రమలకు రుణాల్లో
తగ్గిన ప్రభుత్వ బ్యాంకుల వాటా
- 2018 డిసెంబర్‌లో 39 శాతం
- 2013 ఇదే నెల్లో  మార్కెట్‌ వాటా 58 శాతం
- పెరిగిన ప్రైవేటు, 
- నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్సర్ల వాటా

ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ)  ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తగిన రుణ సౌలభ్యం సకాలంలో అందాలని, రుణ పరిమాణం భారీగా పెరగాలని ప్రభుత్వ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలు, చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నా, ఫలితం కనిపించడం లేదు. 2018 డిసెంబర్‌లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (మార్కెట్‌) వాటా 39 శాతం అయితే, 2013 ఇదే నెల్లో ఈ రేటు 58 శాతంగా ఉంది.  ఈ రంగం అభివృద్దికి కృషిచేస్తున్న ప్రభుత్వ రంగ భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బీ), క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ట్రాన్సూనియన్‌ సిబిల్‌ల తాజా నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- ముద్ర, 59 సెకండ్‌ లోన్‌ స్కీమ్స్‌ వంటి పలు పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, చిన్న పరిశ్రమలకు తమ మార్కెట్‌ వాటాను ప్రభుత్వ బ్యాంకులు కోల్పోతున్నాయి.
- దీనికి కారణాల్లో మొండిబకాయిల సమస్య ఒకటి.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి చిన్న పరిశ్రమలకు మార్కెట్‌ షేర్‌ తగ్గినా, ప్రైవేటు రంగ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి మాత్రం పెరిగింది. ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే...  2013 డిసెంబర్‌లో చిన్న పరిశ్రమలకు ఇచ్చిన రుణాల్లో వీటి వాటా 22 శాతం అయితే, 2018 డిసెంబర్‌లో ఈ రేటు 33 శాతానికి చేరింది. నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల విషయంలో ఈ రేటు 13 శాతం నుంచి 21 శాతానికి ఎగసింది. 
- అయితే రుణ పంపిణీలను విలువల రూపంలో మాత్రం నివేదిక వెల్లడించలేదు. 
- కాగా ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి తమ మార్కెట్‌ షేర్‌ను పెంచుకోగలుగుతాయన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. 
- చిన్న పరిశ్రమల మొండిబకాయిలు 2018 డిసెంబర్‌ త్రైమాసికంలో కొంత తగ్గాయి.
- ఇక చిన్న పరిశ్రమలకు మొత్తం రుణాలను చూస్తే, 2018 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో వృద్ధిరేటు 19.3 శాతంగా ఉంది. 

ఎన్‌పీఏలపై జాగరూకత అవసరం
మొత్తంగా చూస్తే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రత్యేకించి ఈ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రమవకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ దిశలో తమ పోర్టిఫోలియోలను లెండర్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. వ్యవస్థాపరమైన ఇబ్బందులు లేకుండా విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలి. 
- సతీష్‌ పిళ్లై, ఎండీ అండ్‌ సీఈఓ
ట్రాన్సూనియన్‌ సిబిల్‌

 



You may be interested

రూ.1.1 లక్ష కోట్ల డివిడెండ్‌లు

Friday 12th April 2019

చెల్లించనున్న 75 కంపెనీలు  ముంబై: బీఎస్‌ఈ 500 సూచీలోని నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న దాదాపు 75 కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీగా నజరానాలివ్వనున్నాయి. డివిడెండ్‌ చెల్లింపులు, షేర్ల బైబ్యాక్‌ రూపంలో ఈ కంపెనీలు ఇన్వెస్టర్లకు రూ.1.1 లక్షల కోట్లు చెల్లించనున్నాయి. ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ ఇండియా(ఐఐఏఎస్‌) రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. వివిధ కంపెనీల వార్షిక ఆర్థిక నివేదికల ఆధారంగా ఐఐఏఎస్‌ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక

ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి

Friday 12th April 2019

-ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ విలీనం  -బ్యాంక్‌ గ్యారంటీ అడిగిన డాట్‌  న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) విలీనానికి టెలికం డిపార్ట్‌మెంట్‌(డాట్‌) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల కింద రూ.6,000 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌ నుంచి పొందిన​స్పెక్ట్రమ్‌ కోసం మరో రూ.1,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని ఆ

Most from this category