News


నల్లధనంపై నోట్ల రద్దు ఫలితమివ్వదు

Tuesday 12th March 2019
news_main1552380655.png-24552

నల్లధనంపై నోట్ల రద్దు ఫలితమివ్వదు
స్వల్పకాలంలో ఆర్థిక వృద్ధికి విఘాతం కలుగుతుంది
ఆర్‌బీఐ బోర్డు అభిప్రాయాలు
ఆర్‌టీఐ దరఖాస్తుతో వెలుగులోకి నాటి వివరాలు

న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌)తో నల్లధనం నియంత్రణపై పెద్దగా సాధించేదేమీ ఉండదని ఆర్‌బీఐ బోర్డు అభిప్రాయపడింది. పైగా స్వల్ప కాలంలో ఆర్థిక వృద్ధికి దీనివల్ల విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. 2016 నవంబర్‌ 8న రాత్రి ప్రధాని మోదీ నోట్ల రద్దుకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా రెండున్నర గంటల ముందు ఆర్‌బీఐ బోర్డు సమావేశం జరిగింది. డీమోనిటైజేషన్‌ కోసం ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆమోదించడం జరిగింది. ఈ సమావేశానికి అప్పటి గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వం వహించగా, నాడు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హోదాలో, ప్రస్తుత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఓ డైరెక్టర్‌గా పాలుపంచుకున్నారు. నాటి సమావేశం వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద కార్యకర్త వెంకటేష్‌ నాయక్‌ సమీకరించి కామన్‌వెల్త్‌ హ్యూమన్‌రైట్స్‌ ఇనీషియేటివ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకోతగిన చర్యగా పేర్కొంటూనే, స్వల్పకాలంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ బోర్డు పేర్కొంది. ‘‘నల్లధనం అనేది ఎక్కువ శాతం నగదు రూపంలో లేదు. రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, బంగారం రూపంలో ఉంది. కనుక ఈ నిర్ణయం సంబంధిత ఆస్తులపై ప్రభావం చూపించదు’’ అని ఆర్‌బీఐ 561వ బోర్డు సమావేశం అభిప్రాయపడింది. నల్లధనం నియంత్రణ, నకిలీ కరెన్సీ ప్రవాహానికి చెక్‌ పెట్టే లక్ష్యాలతో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు నాడు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. నగదు కట్టడికి ఉపశమన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్‌బీఐ బోర్డు భరోసా వ్యక్తం చేసింది. 
రూ.10,720 కోట్లే తిరిగి రాలేదు...
నకిలీ కరెన్సీ గురించి ఆందోళన చెందుతున్నట్టయితే, దేశం మొత్తం మీద చలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే రూ.400 కోట్లు అనేది పెద్ద మొత్తం కాదని ఆర్‌బీఐ బోర్డు పేర్కొంది. నోట్ల రద్దు నాటికి వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉండగా, రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం రూ.15.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేవలం రూ.10,720 కోట్లే తిరిగి వ్యవస్థలోకి రాలేదు. దీంతో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా నోట్ల రద్దు వ్యవహారం ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. అయితే, నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరాయని, జీడీపీపై పెద్దగా ప్రభావం లేదని,  ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో ప్రకటించిన విషయం గమనార్హం. నోట్ల రద్దు తర్వాత పెట్రోల్‌ పంపుల వద్ద రూ.500, రూ.1,000 నోట్లతో ఇంధనం పోయించుకునేందుకు అనుమతించడం వల్ల చెప్పుకోతగ్గ నల్లధనం తిరిగి వ్యవస్థలోకి వచ్చిందన్న దానిపై ఎటువంటి డేటా లేదంటై మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ వెల్లడించింది.You may be interested

చందమామ ‘స్విస్‌ బ్యాంక్‌’ కథలు!!

Tuesday 12th March 2019

- మనీలాండరింగ్‌ కేసులో మ్యాగజీన్‌ కొత్త ఓనర్లు - జియోడెసిక్‌ సంస్థ డైరక్టర్లపై విచారణ ముమ్మరం... - నిధులను స్విస్‌ ఖాతాల్లోకి తరలించారని ఆరోపణ న్యూఢిల్లీ: నీతి కథలతో ఒకప్పుడు పిల్లలను ఉర్రూతలూగించిన ‘చందమామ’ మ్యాగజీన్‌ గతంలోనే చేతులు మారిన సంగతి తెలిసిందే. దీన్ని తీసుకున్న కొత్త యాజమాన్యం ఇపుడు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. కంపెనీ నిధులు మనీలాండరింగ్‌ ద్వారా అక్రమంగా స్విస్‌ బ్యాంకుల్లోకి తరలించినట్లు సంస్థ డైరెక్టర్లపై కేసు నడుస్తోంది. చందమామ మ్యాగజీన్‌ను

ఎన్నికల ముందుస్తు ర్యాలీకి ఛాన్స్‌..!

Tuesday 12th March 2019

- మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా - ఈవారంలోనే ఐఐపీ, సీపీఐ గణాంకాలు ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్‌ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, కాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ

Most from this category