News


బ్యాంకింగ్ సంక్షోభంలో ఆర్‌బీఐ పాత్రేంటి?

Wednesday 24th October 2018
news_main1540360359.png-21425

న్యూఢిల్లీ: పేరుకుపోయిన మొండిబాకీలతో బ్యాంకింగ్ రంగం పెను సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ బాధ్యతలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) రాజీవ్ మహర్షి పలు ప్రశ్నలు లేవనెత్తారు. బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంతిమంగా ఈ రుణాలే మొండిబాకీలుగా మారి బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారి తీశాయని పేర్కొన్నారు. "బ్యాంకింగ్ రంగం ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు సంబంధించి దీన్నుంచి ఎలా బైటపడాలన్న దానిపైనే అంతా చర్చిస్తున్నారు. సబ్సిడీల తరహాలో రీక్యాపిటలైజేషన్ దీనికి ఒక మార్గం. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ మాట్లాడనటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే.. ఇంత జరుగుతుంటే నియంత్రణ సంస్థ (రిజర్వ్ బ్యాంక్) ఏం చేస్తున్నట్లు? దాని పాత్రేంటి, బాధ్యతలేంటి? వీటి గురించి చర్చించాల్సిన అవసరం ఉంది" అని ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఐఎస్‌ఎస్‌పీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహర్షి చెప్పారు. 2018 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ రంగంలో రూ. 9.61 లక్షల కోట్ల మేర మొండిబాకీలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం రూ. 7.03 లక్షల కోట్లు పారిశ్రామిక రంగం నుంచి రావాల్సినవి కాగా, రూ. 85,344 కోట్లు వ్యవసాయ, వ్యవసాయ సంబంధ సంస్థల నుంచి రావాల్సినవి. 
ప్రధాన కారణాలపై చర్చ జరగడం లేదు..
ఆస్తులు, అప్పులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోవడమే ప్రస్తుత బ్యాంకింగ్ సంక్షోభానికి కారణమని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన పేర్కొన్నారు. దేశీ బాండ్ మార్కెట్ అంతగా అభివృద్ధి చెందకపోవడంతో దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు బ్యాంకులే రుణాలివ్వాల్సి వస్తోందని మహర్షి చెప్పారు. ఈ ప్రాజెక్టులకు ఆటంకాలు ఎదురైతే ఆ సమస్యలన్నీ బ్యాంకులకు కూడా సంక్రమిస్తున్నాయన్నారు. ఇలాంటి మూలకారణాలపై చర్చ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎవ్వరూ కూడా నియంత్రణ సంస్థ పాత్ర, బాధ్యతల గురించి రాయడం గానీ మాట్లాడటం గానీ చేయడం లేదన్నారు. బ్యాంకుల నిర్వహణ లోపాలు బ్యాంకింగ్ రంగంలో సంక్షోభానికి కారణమని, దీని వల్ల ప్రజాధనం చోరీ కాగా .. సంక్లిష్టమైన మరెన్నో విషయాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని మహర్షి పేర్కొన్నారు. "బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే.. నియంత్రణ సంస్థ ఏం చేస్తున్నట్లు? ఈ సంక్షోభానికి అది (ఆర్‌బీఐ) కూడా కారణమా కాదా.. అన్నదీ చర్చనీయాంశమే" అని ఆయన చెప్పారు. 
సంస్కరణల్లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి: ఎన్‌కే సింగ్‌
ఆర్థిక సంస్కరణలను కేంద్రం ఒక్కటే అమలు చేయజాలదని, రాష్ట్రాలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌, మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్‌కే సింగ్ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి పైపై మెరుగులతో ఉపయోగం లేదని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అవసరమని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో చేయగలవని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్వహణ మొదలైన అంశాల్లో ఏడాది ఫుల్‌ టైమ్ కోర్స్‌ను ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అందిస్తుంది. 2-3 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌ కోసం ఇది ఉద్దేశించినది. You may be interested

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 36 శాతం అప్‌

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.205 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం బాగా  పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల లాభం తగ్గిందని వివరించింది.

1 శాతం తగ్గిన టీవీఎస్‌ మోటార్‌ లాభం

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ:  టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 1 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.211 కోట్లకు తగ్గిందని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తెలిపింది.మొత్తం ఆదాయం రూ.4,098 కోట్ల నుంచి రూ.4,994 కోట్లకు పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ చెప్పారు. ఈ క్యూ2లో ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 14 శాతం

Most from this category