STOCKS

News


వ్యవ‘‘సాయం’’ గట్టెక్కించేనా..?

Saturday 2nd February 2019
news_main1549104497.png-23975

-పెను సంక్షోభంలో రైతాంగం
-ఆదాయం అంతంత మాత్రమే
-సమగ్ర ప్రణాళికతోనే శాశ్వత పరిష్కారం: నిపుణులు

అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే.
 
ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా..
ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి(సీపిఐ)లో 40 శాతం వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల కంటే వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం ఎల్లవేళలా మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది.

వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే..
-మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్‌ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై  రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది.
-దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీసు (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) వెల్లడించింది.
-రైతు అప్పుల్లో ఆంద్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా,  తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%)  ఉన్నాయి.
-ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్‌డీఎస్‌ అధ్యయనంలో తేలింది.
- సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతోతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు.
-పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్‌ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు.
-గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది.
-డీజిల్‌ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది.
-ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు.

సాయం కంటితుడుపేనా?
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిళాలు ప్రకటించింది. భారత్‌లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. అందుకే దేశానికి వెన్నెముకలాంటి రైతన్నలు నిరాశతో కుప్పకూలుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కేవలం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంటని నిల్వ చేసుకునే వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలి. అప్పుడే రైతు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.You may be interested

రైతుకు రొక్కం

Saturday 2nd February 2019

అన్నదాతకు ఏటా రూ. 6వేల ఆర్థిక సాయం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరుతో కొత్త పథకం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు ఈ మార్చిలోగా రూ. 2వేలు బదిలీ.. రూ. 75,000 కోట్లు కేటాయింపు.. రైతులకు 2శాతం వడ్డీ రాయితీ చేపలు, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా.. వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు 3శాతం రాయితీ అదనం.. గో సంరక్షణ, చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి కొత్తగా

డిప్రెషన్‌ లో మోదీ ప్రభుత్వం: మమతా బెనర్జీ

Saturday 2nd February 2019

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించడాన్ని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధినేత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. కేంద్రం చేసిన ప్రకటనలకు ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. కోల్‌కతాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం కూడా మధ్యంతర బడ్జెట్‌లో పూర్తిస్థాయి పథకాలను ప్రకటించేందుకు వీల్లేదు. ఎందుకంటే ఈ పథకాలను ఎవరు

Most from this category