STOCKS

News


రైతుకు రొక్కం

Saturday 2nd February 2019
news_main1549106022.png-23976

  • అన్నదాతకు ఏటా రూ. 6వేల ఆర్థిక సాయం
  • ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరుతో కొత్త పథకం
  • ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ
  • ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
  • ఈ మార్చిలోగా రూ. 2వేలు బదిలీ..
  • రూ. 75,000 కోట్లు కేటాయింపు..
  • రైతులకు 2శాతం వడ్డీ రాయితీ
  • చేపలు, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా..
  • వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు 3శాతం రాయితీ అదనం..
  • గో సంరక్షణ, చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి
  • కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’ ఏర్పాటు

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌  రైతులపై వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కోసం ఏటా 75 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా రూ.2వేల ఆర్థిక సాయం ఈ ఏడాది మార్చి లోగా రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు ఉత్తరాది కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అసంతృప్తే కారణమని విశ్లేషణలు వినిపించాయి. అదువల్లే రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించిందని విశ్లేషకులంటున్నారు.

పెరిగిన కేటాయింపులు..
రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో పాడి రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఉపశమన చర్యలను ప్రతిపాదించారు. పశుసంవర్థక, మత్స్యకార రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు.  2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,49,981 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ. 86,602 కోట్లతో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ రూ. 70,075 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరం రూ.74,986 కోట్లు. పేద రైతాంగానికి నిర్దిష్ట ఆదాయ సహాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి.. వ్యవసాయంలో ఆదాయం తగ్గిపోవడానికి చిన్న కమతాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం వంటి పలు కారణాలున్నాయని పేర్కొన్నారు.

12 కోట్లమందికి లబ్ధి..
విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, కూలీలు ఇంకా ఇతర అవసరాలు తీర్చడం కోసం రైతులకు పీఎం కిసాన్‌ పథకం ఉపకరిస్తుందని గోయల్‌ తెలిపారు. రైతు అప్పుల ఊబిలో చిక్కకుండా  ఈపథకం కాపాడుతుందని, ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రక్షిస్తుందని మంత్రి వివరించారు. ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని గోయల్‌ పేర్కొన్నారు. రైతులు సంపాదించడానికి, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం దారి చూపుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అత్యంత నిరుపేద రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాక, సాగు సీజన్‌కు ముందు అవసరమయ్యే అత్యవసర ఖర్చులకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ
ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితులతో నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందిస్తామని ఆర్థిక మంత్రి  తెలిపారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా 2 శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతుల కోసం రూ.750 కోట్లను కేటాయించారు.  గత బడ్జెట్‌ సందర్భంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను  చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా అందించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైతులకు జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి అందించే సహాయంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహాన్ని వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కూడా వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహాన్ని రుణాలు రీషెడ్యూల్‌ చేసిన కాలం మొత్తానికి అందించనున్నట్లు గోయల్‌ వివరించారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినపుడు రైతులు సహజంగానే తమ రుణాలను తిరిగి చెల్లించలేరు. అలాంటి రైతులకు రుణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నారు. వారికి రీషెడ్యూల్‌ చేసిన తొలి సంవత్సరం మాత్రమే 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తున్నారు.’’ అని గోయల్‌ పేర్కొన్నారు. రాయితీతో కూడిన రుణాలను సులభంగా అందజేయడానికి, రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించడానికి గాను ఒక పరిపూర్ణమైన ప్రక్రియను ప్రారంభించనున్నామని, ఇందుకోసం సులభంగా పూర్తిచేసే దరఖాస్తు ఫారాలను అందించనున్నామని తెలిపారు. పేద, భూమిలేని రైతులు ఉత్పాదక వ్యయాలను ఎదుర్కోవడానికి వారికి నిర్మాణాత్మక ఆదాయం అవసరమని తెలిపారు. సంచార తెగలను పైకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు.

గోకుల్‌ మిషన్‌కు నిధుల పెంపు..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణ లక్ష్యం ఎంత అనేది ఆర్థిక మంత్రి వివరించలేదు. 2018-19లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.11 లక్షల కోట్లను దాటి రూ. 11.68 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి గోయల్‌ తెలిపారు. రైతులకు రుణాలను అందుబాటులో ఉంచడం కోసం గత ఐదేళ్లలో వడ్డీ రాయితీని రెట్టింపు చేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు. అందువల్లే 2018-19లో పంట రుణాలు రూ.11.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ర్టీయ గోకుల్‌ మిషన్‌’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్‌ తెలిపారు.  

కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’
కొత్తగా ‘రాష్ర్టీయ కామధేను ఆయోగ్‌’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్‌కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్‌ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్‌ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో సగటున 7శాతం వృద్ధి రేటు కూడా నమోదు చేశామని ఆయన తెలిపారు. 1.45 కోట్ల మందికి ఇది ప్రధాన జీవనాధారంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 50 శాతం ఎక్కువ ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని గోయల్‌ వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రభుత్వం 22 పంటల కనీస మద్దతు ధరలు 50 శాతం పెంచిందని ఆయన తెలిపారు. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరకు, పత్తి, ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి భారీగా జరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని, దాంతో సరైన ఆదాయం రాక దేశంలోని అనేక ప్రాంతాల రైతులు పూర్తి నిసృ‍్పహలో ఉన్నారని ఆర్ధికమంత్రి వివరించారు.



You may be interested

శరవేగంగా ‘మౌలికం’

Saturday 2nd February 2019

రహదారుల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి ఈ రంగానికి రూ.83,000 కోట్ల కేటాయింపు రవాణాలో తరువాతి తరం సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి ‘ఉడాన్‌’తో సామాన్యుడికి చేరువైన విమాన సేవలు బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే..ఈశాన్యానికీ సరకు రవాణా సాధ్యమే రైల్వేలకు మూలధన మద్దతుగా రూ.64,587 కోట్లు ఐదేళ్లలో లక్ష డిజిటల్‌ గ్రామాలకు రూపకల్పన మధ్యంతర బడ్జెట్‌లో వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్‌ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదుచేసిందని

వ్యవ‘‘సాయం’’ గట్టెక్కించేనా..?

Saturday 2nd February 2019

-పెను సంక్షోభంలో రైతాంగం -ఆదాయం అంతంత మాత్రమే -సమగ్ర ప్రణాళికతోనే శాశ్వత పరిష్కారం: నిపుణులు అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ

Most from this category