STOCKS

News


రద్దు చేస్తే... హక్కులు వదులుకున్నట్టు కాదు

Tuesday 2nd October 2018
news_main1538451331.png-20777

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) మాఫీ చేస్తుండడాన్ని (రైటాఫ్‌) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించుకున్నారు. ఇలా చేయడం ఎన్‌పీఏలపై హక్కులు వదులుకోవడానికి దారితీయదన్నారు. బ్యాంకులు తమ బ్యాలన్స్‌ షీట్లను ప్రక్షాళించుకోవడానికి, పన్ను ప్రయోజనం పొందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.36,551 కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేసినట్టు చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం ఎన్‌పీఏలు రూ.74,562 కోట్లుగా ఉన్నాయని తెలియజేశారు. బీజేపీ పాలనలోని నాలుగు సంవత్సరాల్లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3.16 లక్షల కోట్ల ఎన్‌పీఏలను మాఫీచేశాయని, అదే సమయంలో రూ.44,900 కోట్ల మేర రద్దు చేసిన రుణాలను రికవరీ చేశాయని వచ్చిన వార్తలపై జైట్లీ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘‘ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే సాంకేతికపరమైన రైటాఫ్‌లను బ్యాంకులు చేస్తుంటాయి. ఎన్‌పీఏల మాఫీ అన్నది బ్యాంకులు తమ బ్యాలన్స్‌ షీట్లను ప్రక్షాళించేందుకు తరచుగా చేసే పనే. ఇది పన్ను పరంగా ప్రయోజనం కలిగిస్తుంది. అయినప్పటికీ ఇది ఏ రుణంపైనా హక్కులు వదిలేసుకోవటానికి దారితీయదు. రుణాల రికవరీని బ్యాంకులు కఠినంగా కొనసాగిస్తూనే ఉంటాయి’’ అని జైట్లీ వివరించారు. డీమోనిటైజేషన్‌, రూ.3.16 లక్షల కోట్ల ఎన్‌పీఏల మాఫీని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించడంతో జైట్లీ ఇలా స్పందించారు. మాఫీ చేసినప్పటికీ, రుణాలు తీసుకున్న వారిపై తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు.
రూ.1,81,034 కోట్ల రికవరీ లక్ష్యం 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీలకు రూ.1,81,034 కోట్ల రికవరీ లక్ష్యాన్ని విధించినట్టు జైట్లీ తెలిపారు. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఎన్‌పీఏలు జూన్‌ త్రైమాసికంలో రూ.21,000 కోట్లకు తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకింగ్‌ రంగంలో భారీ ఎత్తున ఎన్‌పీఏల సమస్య వారసత్వంగా వచ్చిందన్నారు. 2008-14 కాలంలో మరీ దూకుడుగా రుణాలు ఇవ్వటమే పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు వేగంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమని చెప్పారు. 2008 నాటికి పీఎస్‌బీలకు సంబంధించి వసూలు కావాల్సిన బకాయిలు రూ.18 లక్షల కోట్లుగా ఉంటే, 2014 మార్చి నాటికి రూ.52 లక్షల కోట్లకు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు.You may be interested

ఆగస్టులో ‘మౌలికం’ వృద్ధి నెమ్మది!

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక విభాగం ఆగస్టు నెలలో మందగించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం 4.2 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్‌, ఎరువులు పేలవ పనితీరు దీనికి కారణం.  2018 జూలైలో ఈ రేటు 7.3 శాతం. 2017 ఆగస్టులో 4.4 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో  ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం.  వీటిలో బొగ్గు , క్రూడ్‌ ఆయిల్‌ ,

ఇక రోజుకు రూ.20వేలే!!

Tuesday 2nd October 2018

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని ఈ నెలాఖరు నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండడంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు

Most from this category