News


అన్ని ఫండ్లకూ పన్ను లాభాలుండాలి

Friday 25th January 2019
news_main1548395601.png-23795

- డెట్‌ ఫండ్స్‌కూ సెక్షన్‌ 80సీ అర్హత కల్పించాలి
- ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌కు ఈక్విటీ హోదా ఇవ్వాలి
- ఫండ్‌ పథకాలకూ క్యాపిటల్‌ గెయిన్స్‌ ప్లాన్లు
- దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై పునరాలోచన
- ‘బడ్జెట్‌’పై ప్రభుత్వానికి యాంఫీ వినతులు

(న్యూఢిల్లీ)
మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత పెద్ద మొత్తంలో వచ్చే దిశగా చేపట్టాల్సిన చర్యలను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ ‘యాంఫి’ కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. ఇవన్నీ దాదాపుగా గతేడాది పంపిన ప్రతిపాదనలేనని, ఈ సారి బడ్జెట్లోనైనా వీటి అమలుకు చర్యలు తీసుకోవాలని కోరామని కోరామని యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. యాంఫి ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి...
డెట్‌లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌
సెక్షన్‌ 80సీ కింద ప్రస్తుతం ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. డెట్‌ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సైతం సెక్షన్‌ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి. డెట్‌ పథకాలకు కూడా పన్ను మినహాయింపు కల్పించడం వల్ల సంప్రదాయ ఇన్వెస్టర్లు (రిస్క్‌ తీసుకోని వారు) సైతం పన్ను ప్రయోజనాలు పొందగలరు. దీనివల్ల బాండ్‌ మార్కెట్‌ విస్తృతి కూడా పెరుగుతుంది.
ఫండ్ ఆఫ్‌ ఫండ్స్‌
ఈక్విటీల్లో 65 శాతం పెట్టుబడులు పెట్టే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణించాలి. ప్రస్తుతం దీన్ని డెట్‌ స్కీమ్‌గానే పరిగణిస్తున్నారు. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్‌లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే పథకాలను ఈక్విటీగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు. కానీ, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ను మాత్రం అవి ఎందులో ఇన్వెస్ట్‌ చేశాయన్న అంశంతో సంబంధం లేకుండా డెట్‌ ఫండ్స్‌గానే చూస్తు‍న్నారు. అందుకే యాంఫి ఈ ప్రతిపాదన చేసింది.
పథకాల మధ్య సమానత్వం
పన్ను పరంగా మ్యూచువల్‌ ఫండ్స్‌, యులిప్‌లను ఒకే విధంగా చూడాలి. ఒకే పథకం పరిధిలో పెట్టుబడులను మార్చుకోవడం, ఒకే ఫండ్‌ హౌస్‌ పరిధిలో పథకాల మధ్య పెట్టుబడులను మార్చుకోవడాలను మూలధన లాభాల పన్ను నుంచి మినహాయించాలి. ప్రస్తుతం యులిప్‌ పాలసీల్లో ఇన్వెస్టర్లు వివిధ ఫండ్స్‌ మధ్య పెట్టుబడులను స్విచ్‌ చేసుకుంటున్నప్పటికీ పన్ను భారం ఉండడం లేదు. ఇదే విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల మార్పిడికీ పన్ను మినహాయింపు కల్పించాలన్నది యాంఫి డిమాండ్‌.
ఫండ్‌ ఆధారిత రిటైర్మెంట్‌ ప్లాన్‌
అమెరికాలో ఉన్న 401 (కె) ప్లాన్‌ మాదిరే... మ్యూచువల్‌ ఫండ్‌ లాంగ్‌ టర్మ్‌ రిటైర్మెంట్‌ ప్లాన్‌ను (ఎంఎఫ్‌ఎల్‌ఆర్‌పీ) యాంఫి ప్రతిపాదించింది. ఉద్యోగ సంస్థ ఉద్యోగి తరఫున చేసే రిటైర్మెంట్‌ పొదుపులను వారి వేతనం నుంచి మినహాయించి చూపే అవకాశం ఈ ప్లాన్‌ కింద ఉంటుంది. దీనివల్ల మరింత పొదుపు నిధులు క్యాపిటల్‌ మార్కెట్లోకి తరలివస్తాయన్నది యాంఫి అభిప్రాయం.
క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ ప్లాన్లు
‘సెక్షన్‌ 54ఈసీ’ని మూడు నుంచి ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌తో మ్యూచువల్‌ పండ్‌ పథకాలకు కూడా వర్తింపచేయాలి. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ బాండ్‌, ఆర్‌ఈసీ బాండ్లలో చేసే పెట్టుబడులకు లాకిన్‌ పీరియడ్‌తో ఈ సెక్షన్‌ కింద మూలధన లాభాల పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలం పాటు ఉంచుకున్న ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినా ఇదే ప్రయోజనాన్ని 3-5 ఏళ్ల లాకిన్‌ పీరియడ్‌తో అనుమతించాలని యాంఫి కోరింది.
క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ పునఃపరిశీలన
స్టాక్స్‌లో పెట్టుబడులను ఏడాది కాలం తర్వాత విక్రయించిన సందర్భాల్లో వచ్చే లాభాలపై పన్నును (ఎల్‌టీసీజీ) కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని పునరాలోచించాలన్న డిమాండ్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు, బ్రోకరేజీ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్ల నుంచి వినిపిస్తోంది. ఎల్‌టీసీజీని రద్దు చేస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పుంజుకుంటుందని బ్రోకర్లు భావిస్తున్నారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు పన్ను మినహాయింపులు కల్పిస్తే బాండ్‌ మార్కెట్‌లోకి వచ్చే పెట్టుబడులు భారీగా పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత విక్రయించిన స్టాక్స్‌పై లాభం రూ.లక్ష దాటితే 10 శాతం పన్నును కేంద్రం గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన విషయం గమనార్హం.You may be interested

మెర్సెడెస్‌ బెంజ్‌ నుంచి ‘వీ క్లాస్‌’

Friday 25th January 2019

ముంబై: దేశ లగ్జరీ కార్ల మార్కెట్‌లో 40 శాతం వాటాతో అగ్రగామి సంస్థగా ఉన్న జర్మనీ కార్ల కంపెనీ మెర్సెడెస్‌ బెంజ్‌ బహుళ వినియోగ వాహన విభాగంలోకి (ఎంపీవీ) తిరిగి అడుగుపెట్టింది. కొత్తగా వీ-క్లాస్‌ శ్రేణిలో 6 సీట్ల ఎక్స్‌క్లూజివ్‌, 7 సీట్ల ఎక్స్‌ప్రెషన్‌ పేరుతో రెండు కార్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో ఈ సంస్థ వీ క్లాస్‌ శ్రేణి కార్లను విక్రయిస్తోంది. స్పానిష్‌ ప్లాంట్‌ నుంచి

చందా కొచ్చార్‌పై సీఐబీ కేసు

Friday 25th January 2019

- వీడియోకాన్‌తో క్విడ్‌ ప్రో కో వ్యవహారం... - రుణాలిచ్చి ముడుపులు తీసుకున్నారని ఆరోపణ - ఎఫ్‌ఐఆర్‌లో భర్త దీపక్‌, వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్‌ పేర్లు - వీడియోకాన్‌, న్యూపవర్ కార్యాలయాల్లో సోదాలు - కామత్ సహా పలువురు బ్యాంకర్ల పాత్రపై విచారణకు అవకాశం న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర,

Most from this category