News


అమెరికాలో భారత నారీ భేరి

Saturday 1st December 2018
news_main1543643947.png-22547

న్యూయార్క్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్‌ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పద్మశ్రీ వారియర్‌, ఉబెర్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కోమల్‌ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ‘డ్రాబ్రిడ్జ్‌’ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్‌ ఈ జాబితాలో నిలిచారు. ‘‘మహిళ భవిష్యత్తు కోసం వేచి చూడదు. 2018 టాప్‌ 50 టెక్నాలజీ మహిళల జాబితా... ముందుచూపుతో ఆలోచించే మూడు తరాల టెక్నాలజీ నిపుణులను గుర్తించడం జరిగింది’’ అని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టి, నెట్‌ఫ్లిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అన్నే ఆరన్‌ వంటి టెక్నాలజీ దిగ్గజాలూ ఈ జాబితాలో ఉన్నారు.
సిస్కో ఎదుగుదలలో వారియర్‌  
పద్మశ్రీ వారియర్‌ (58) మోటొరోలా, సిస్కో కంపెనీల్లో ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం చైనీస్‌ ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌ ఎన్‌ఐవోకు అమెరికా సీఈవోగా ఉన్నారు. 138 బిలియన్‌ డాలర్ల సిస్కో సిస్టమ్స్‌ కంపెనీ కొనుగోళ్ల ద్వారా మరింత ఎదగటంలో వారియర్‌ ముఖ్య పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్‌, స్పాటిఫై బోర్డుల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘‘టెక్నాలజీ రంగంలో ఇతర మహిళలకు మార్గదర్శిగా వ్యవహరించేందుకు వారియర్‌ ఇప్పటికీ వీలు చేసుకుంటున్నారు. ట్విట్టర్‌ ద్వారా 16 లక్షల మంది ఫాలోవర్లకు అందుబాటులో ఉంటున్నారు’’అని ఫోర్బ్స్‌ ప్రస్తుతించింది. గుజరాత్‌లోని ధర్మసిన్హ్‌ దేశాయ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన మంగ్తాని ప్రస్తుతం క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్‌లో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా ఉన్నారు. పలు స్వచ్చంద సంస్థలకూ సేవలందిస్తున్నారు. పుణె యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నార్ఖెడె లింక్డెన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సమయంలో అపాచేకఫ్‌కా అనే అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రియల్‌టైమ్‌లో భారీగా వచ్చే డేటాను ప్రాసెస్‌ చేస్తుంది. కన్‌ఫ్లూయెంట్‌ను కూడా ఆమె స్థాపించారు. దీనికి డేటానే ప్రధాన వ్యాపారంగా మారింది. ఈ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఉబెర్‌కు సేవలందిస్తోంది. ‘‘ప్రజలు రోజువారీగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అన్ని రకాల పరికరాల్లో ప్రకటనలను చూపించే మార్గం ప్రకటనదారులకు కావాలి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రకటనదారులకు ఇప్పటికే ఈ సేవలందిస్తున్నాయి. డ్రాబ్రిడ్జ్‌ వ్యవస్థాపకురాలు కామాక్షి శివరామకృష్ణన్‌(43) రూపంలో వాటికిపుడు పోటీ ఎదురైంది’’ అని ఫోర్బ్స్‌ తెలిపింది.You may be interested

రూపాయికి నాలుగు నెలలనాటి బలం

Saturday 1st December 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు 27పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది. దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు వెనక్కు

జేఎల్‌ఆర్‌లో ఉద్యోగాల కోత

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌లో భాగమైన జాగ్వార్ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) .. ఉత్పత్తి కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది. దీంతో సెంట్రల్ ఇంగ్లండ్‌లోని వోల్వర్‌హాంప్టన్‌ ప్లాంటులో సుమారు 250 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించనుంది. డిసెంబర్‌లో రెండు వారాల పాటు ఈ ప్లాంటులో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు కూడా జేఎల్‌ఆర్‌ తెలిపింది. దీంతో 500 మంది ఉద్యోగులు రోజువారీ విధులకు హాజరు కానక్కర్లేదని, అయితే ఈ వ్యవధిలో

Most from this category