STOCKS

News


ఈ - కామ​ర్స్‌ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం

Friday 25th January 2019
news_main1548396065.png-23797

- పిలుపునిచ్చిన డబ్ల్యూటీఓ చీఫ్‌
- మరింత క్లిష్టంగా వాణిజ్య సవాళ్లు: ఐరాస
- కృత్రిమ మేధపై నియంత్రణ: సత్య నాదెళ్ల

దావోస్‌: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్‌ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్‌) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుంటెరస్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) చీఫ్‌ క్రిస్టిన లగార్డె సూచించారు. అందుకే అంతర్జాతీయ ఆర్థిక వృద్ది అంచనాలను తగ్గించామన్నారు. చైనా మందగమనం ఒక మోస్తరుగా ఉంటే పర్వాలేదని, కానీ మందగమనం జోరుగా ఉంటే అది ఒక సమస్య అవుతుందని వివరించారు. కాగా కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు.
డిజిటల్‌ డిక్లరేషన్‌
డిజిటల్‌ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్‌ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. డిజిటల్‌ సిటిజన్‌ల గోప్యతను గౌరవించడం, వ్యక్తిగత డేటాను పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించడం, సైబర్‌ దాడులు తగ్గే ప్రయత్నాలకు తోడ్పాటునందించడం, డిజిటల్‌ ఎకానమీలో ప్రతీ ఒక్కరినీ భాగస్వామిగా చేయడం డిజిటల్‌ డిక్లరేషన్‌లో భాగాలు. ఈ డిజిటల్‌ డిక్లరేషన్‌పై  మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్‌, ఐబీఎమ్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, నోకియా, శామ్‌సంగ్‌, షార్ప్‌, వెరిజాన్‌, వొడాఫోన్‌, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్‌ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి.
భారత్‌లో ఈ కామర్స్‌
భారత్‌లో ఈ కామర్స్‌ రంగంలోని నిబంధనల పట్ల అంతర్జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ-కామర్స్‌ రంగంలోకి భారీగా పెట్టుబడులు వచ్చేలా, ఈ రంగం మంచి వృద్ధి సాధించేలా నిలకడైన విధానం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ప్రభుత్వం రూపొందించిన తాజా నిబంధనలు విదేశీ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, దేశీయ సంస్థలకు భారమని వారంటున్నారు. అయితే ఈ విషయాలను భారత ప్రభుత్వ అధికారులు కొట్టిపడేశారు. విస్తృతమైన సంప్రతింపుల అనంతరమే ఈ నిబంధనలు రూపొందించామని, పోటీని పెంపొందిస్తూనే, దేశీయ సంస్థల ప్రయోజనాలను కాపాడేలా ఈ నిబంధనలను రూపొందించామని వారు  పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌
ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ-వేస్ట్‌) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా ప్రపంచ నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ-వేస్ట్‌ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ప్రతీ ఏడాదీ  పేరుకుపోతున్న ఈ-వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా మొత్తం ఎలక్ట్రానిక్స్‌, ప్లాస్టిక్స్‌ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్‌ అవుతున్నట్లు తెలియజేసింది.You may be interested

ఈ 15 షేర్లూ...బడ్జెట్‌ బెట్స్‌!

Friday 25th January 2019

అనలిస్టుల సూచన మధ్యంతర బడ్జెట్‌తో ప్రయోజనం పొందే 15 స్టాకులను వివిధ బ్రోకరేజ్‌ సంస్థలకు చెందిన అనలిస్టులు సూచిస్తున్నారు. 5నాన్స్‌ డాట్‌కామ్‌ సూచనలు 1. టీవీఎస్‌మోటర్స్‌: వ్యవసాయదారులకు యూబీఐ అమలుతో కంపెనీకి లాంగ్‌టర్మ్‌లో లబ్ది కలుగుతుంది. క్యు3లో కంపెనీ మంచి లాభాలను ప్రకటించింది. నెలవారీ విక్రయాలు కూడా బాగున్నాయి. 2. డాబర్‌ ఇండియా: కంపెనీ ఆదాయాల్లో దాదాపు సగం వాటా గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌దే ఉంది. ఈ బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టనున్నందున కంపెనీకి

మెర్సెడెస్‌ బెంజ్‌ నుంచి ‘వీ క్లాస్‌’

Friday 25th January 2019

ముంబై: దేశ లగ్జరీ కార్ల మార్కెట్‌లో 40 శాతం వాటాతో అగ్రగామి సంస్థగా ఉన్న జర్మనీ కార్ల కంపెనీ మెర్సెడెస్‌ బెంజ్‌ బహుళ వినియోగ వాహన విభాగంలోకి (ఎంపీవీ) తిరిగి అడుగుపెట్టింది. కొత్తగా వీ-క్లాస్‌ శ్రేణిలో 6 సీట్ల ఎక్స్‌క్లూజివ్‌, 7 సీట్ల ఎక్స్‌ప్రెషన్‌ పేరుతో రెండు కార్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో ఈ సంస్థ వీ క్లాస్‌ శ్రేణి కార్లను విక్రయిస్తోంది. స్పానిష్‌ ప్లాంట్‌ నుంచి

Most from this category