STOCKS

News


విప్రో లాభం 38 శాతం జంప్‌...

Wednesday 17th April 2019
Markets_main1555474109.png-25169

- క్యూ4లో రూ.2,494 కోట్లు
- ఆదాయం రూ.15,006 కోట్లు; 8.9 శాతం అప్‌
న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కం‍పెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018-19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు చేరింది. కాగా, డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3)లో నికర లాభం రూ.2,544 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్యూ4లో లాభం 1.9 శాతం తగ్గింది.
పూర్తి ఏడాదికి చూస్తే...
2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో నికర లాభం రూ.9,018 కోట్లుగా నమోదైంది. 2017-18లో నికర లాభం రూ.8,003 కోట్లతో పోలిస్తే 12.6 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా 7.5 శాతం వృద్ధితో రూ.54,487 కోట్ల నుంచి రూ.58,585 కోట్లకు పెరిగింది.
ఐటీ సేవలు ఇలా...
విప్రో కీలక వ్యాపారమైన ఐటీ సేవల బిభాగం ఆదాయం డాలర్ల రూపంలో క్యూ4లో 2,075 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 1.4 శాతం తగ్గింది. మార్కెట్‌ విశ్లేషకులు 2,082 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(2019-20, క్యూ1)లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,046-2,087 మిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి మైనస్‌ 1 నుంచి 1 శాతంగా లెక్కతేలుతోంది. కాగా, మార్కెట్‌ విశ్లేషకుల వృద్ధి అంచనా 0-3 శాతంతో పోలిస్తే కంపెనీ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం.
ఉద్యోగుల అకౌంట్లు హ్యాకింగ్‌ గురైనట్లు విప్రో ప్రకటించడం, గైడెన్స్‌ బలహీనంగా ఉండటంతో మంగళవారం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 2.5 శాతం క్షీణించి రూ.281 వద్ద ముగిసింది.
‘పటిష్టమైన ఆర్డర్ల ఆసరాతో పాటు డిజిటల్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఇంజనీరింగ్‌ సేవలు, క్లౌడ్‌వంటి కీలక విభాగాల్లో మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఆదాయాలు, లాభాలు పుంజుకోవడమే దీనికి నిదర్శనం.’
- అబిదాలి నీముచ్‌వాలా, విప్రో సీఈఓ-ఎండీ
ఉద్యోగుల ఖాతాల హ్యాకింగ్‌పై విప్రో దర్యాప్తు
- ఫోరెన్సిక్‌ సంస్థ నియామకం
న్యూఢిల్లీ: తమ కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు హ్యాకింగ్‌కు (అడ్వాన్స్‌డ్‌ ఫిషింగ్‌ ద్వారా) గురైనట్లు గుర్తించామని.. దీనిపై దర్యాప్తును కూడా చేపట్టామని విప్రో మంగళవారం ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించింది. హ్యాకింగ్‌ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కూడా తెలిపింది. దర్యాప్తులో సహకారం కోసం స్వతంత్ర ఫోరెన్సిక్‌ సంస్థను నియమించుకున్నామని విప్రో పేర్కొంది. ‘అడ్వాన్స్‌డ్‌ ఫిషింగ్‌ క్యాంపెయిన్‌ ద్వారా కొంత మంది ఉద్యోగుల అకౌంట్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించాం. వెనువెంటనే దీనిపై దర్యాప్తును మొదలుపెట్టడంతో పాటు నష్ట నివారణకు తగిన చర్యలు కూడా తీసుకున్నాం’ అని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాకింగ్‌ చేయడం ద్వారా విప్రోకు చెందిన కొందరు క్లయింట్లపై సైబర్‌ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉందని సైబర్‌ సెక్యూరిటీ బ్లాగ్‌ క్రెబ్స్‌ ఆన్‌ సెక్యూరిటీ పేర్కొంది.

 

- షేరుకు రూ.325 ధర... రూ.10,500 కోట్ల విలువ
- 32.3 కోట్ల షేర్లు తిరిగి కొనుగోలు...
- నాలుగేళ్లలో ఇది మూడో బైబ్యాక్‌...

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో మరోసారి ఇన్వెస్టర్లకు తీపి కబురు చెప్పింది. భారీస్థాయిలో రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కంపెనీ మంగళవారం మార్చి క్వార్టర్‌(క్యూ4) ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా షేరుకు రూ.325 ధర చొప్పున 32.3 కోట్ల షేర్లను తమ వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కంపెనీ మొత్తం పెయిడ్‌-అప్‌ ఈక్విటీలో ఇది 5.35 శాతానికి సమానం. సెబీ నిబంధనల ప్రకారం టెండర్‌ ఆఫర్‌ రూపంలో ప్రస్తుత వాటాదారుల నుంచి ఈ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు విప్రో ఎక్సే‍్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీ కూడా బైబ్యాక్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు కూడా తెలిపింది. కాగా, తాజా బైబ్యాక్‌ ధర విప్రో షేరు మంగళవారం నాటి మార్కెట్‌ ముగింపు ధర రూ.281తో పోలిస్తే పోలిస్తే దాదాపు 16 శాతం అధికం కావడం గమనార్హం.
15 నెలలో రెండోది...
గడిచిన 15 నెలల్లో ఇది విప్రో ప్రకటించిన రెండో షేర్ల బైబ్యాక్‌. 2017 నవంబర్‌-డిసెంబర్‌లో విప్రో రూ.11,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఇక గడిచిన నాలుగేళ్ల కాలాన్ని తీసుకుంటే విప్రో చేపట్టిన మూడో బైబ్యాక్‌ ఇది. 2016లో తొలిసారి విప్రో రూ. 2,500 కోట్ల బైబ్యాక్‌ను విప్రో ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం వాటా ఉంది. 6.49 శాతం వాటా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ చేతిలో ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల వద్ద 11.74 శాతం వాటా, ప్రజలు, కార్పొరేట్లు, ఇతరత్రా ఇన్వెస్టర్ల వద్ద 7.92 శాతం వాటా ఉంది. తాజా బైబ్యాక్‌ ఆఫర్‌ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి చేపడతామని... పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదం తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. బైబ్యాక్‌ ప్రక్రియ, కాల వ్యవధి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
ఐటీ కంపెల బైబ్యాక్‌ రూటు...
భారీ మొత్తంలో ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచేందుకు ఇటీవల కాలంలో దేశీ ఐటీ కంపెనీలు వరుసపెట్టి బైబ్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్‌ ఏకంగా రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ రూపంలో కొనుగోలు చేసింది. రెండో అతిపెద్ద దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ కూడా 2017 డిసెంబర్‌లో రూ.13,000 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించగా.. మళ్లీ ఈ ఏడాది జనవరిలో రూ.8,260 కోట్ల బైబ్యాక్‌ ఆఫర్‌ను చేపట్టింది. ఇంకా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఫసిస్‌ ఇతరత్రా ఐటీ కంపెనీలు కూడా బైబ్యాక్‌లు, ప్రత్యేక డివిడెండ్‌ల రూపంలో ఇన్వెసర్లకు మంచి రాబడులనే అందించాయి. కాగా, ఎల్‌అండ్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న మైండ్‌ట్రీ కూడా ప్రత్యేక డివిడెండ్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) పరంగా టాప్‌-5 దేశీ ఐటీ కంపెనీలు 2017 జనవరి నుంచి 2019 జనవరి మధ్య కాలంలో ఏకంగా రూ.1.17 లక్షల కోట్లను షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ల రూపంలో ఇన్వెస్టర్లకు చెల్లించాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్‌ కారణంగా కంపెనీ షేరువారీ ఆర్జన (ఈపీఎస్‌) మెరుగుపడుతుంది.You may be interested

నేడు స్టాక్‌ మార్కెట్‌ సెలవు

Wednesday 17th April 2019

మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) మార్కెట్‌కు సెలవు. కావున ఈక్విటీ, బాండ్‌, ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (గురువారం) జరుగుతుంది. అయితే శుక్రవారం గుడ్‌ఫ్రైడ్‌ కారణంగా కూడా మార్కెట్‌ పనిచేయదు. క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 370 పాయింట్ల లాభంతో 39,276 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,364 పాయింట్లను, నిఫ్టీ 11,811

ట్రెండ్‌ మారింది....నిఫ్టీ ఏడాది టార్గెట్‌ 13,000

Tuesday 16th April 2019

ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిఫ్టీ స్థాయిని పరిశీలిస్తే మార్కెట్‌ దిశ మారినట్లు పరిగణిస్తున్నామని, ప్రస్తుత 2019-2020 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ టార్గెట్‌ను 13,000 పాయింట్లకు పెంచుతున్నట్లు ప్రముఖ సెక్యూరిటీస్‌ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. నిఫ్టీ ‘గోల్డెన్‌క్రాస్‌’ను నమోదుచేసినందున, మార్కెట్‌ దిశ అప్‌సైడ్‌కు మారినట్లు తెలిపింది. మీడియం టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ (50 రోజుల సగటు)...లాంగ్‌టెర్మ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌ను (200 రోజుల సగటు) క్రాస్‌ చేయడానికి

Most from this category