STOCKS

News


మరి అమెజాన్‌ పరిస్థితేంటి?

Saturday 12th January 2019
news_main1547270493.png-23540

- బెజోస్‌ విడాకులతో కంపెనీ భవితపై నీలినీడలు
- కంపెనీ మీద నియంత్రణాధికారాలపై సందేహాలు
- అత్యంత సంపన్నురాలిగా మారనున్న మెకంజీ
- బిల్‌గేట్స్‌ తరవాత రెండోస్థానంలోకి జెఫ్‌ బెజోస్‌

న్యూయార్క్‌: అమెరికా ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విడాకుల వ్యవహారం కంపెనీ భవితవ్యంపై సందేహాలను రేకెత్తిస్తోంది. దాదాపు 136 బిలియన్‌ డాలర్ల బెజోస్‌ సంపదను భార్యభర్తలిద్దరూ ఎలా పంచుకుంటారు? కంపెనీలో బెజోస్‌ భార్య మెకెంజీకి కూడా ఆయనతో సమానంగా వాటా లభిస్తుందా? ఒకవేళ లభిస్తే... అమెజాన్‌ నిర్వహణపై ఆ ప్రభావాలు ఎలా ఉండొచ్చు? అన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయమయ్యాయి. అమెజాన్‌ వ్యవస్థాపకుడు బెజోస్‌కి ఇప్పుడు కంపెనీలో 16 శాతం వాటాలున్నాయి. దీని ప్రకారం ఆయన సంపద విలువ 136 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. విడాకుల సెటిల్మెంట్‌ కింద భార్యకు సగం సంపద ఇచ్చిన పక్షంలో బెజోస్‌కి అమెజాన్‌లో ఎనిమిది శాతం వాటా మాత్రమే మిగులుతుంది.
సామరస్యంగానే ఉంటే..
విడాకుల విషయంలో ఇద్దరూ సామరస్యంగానే ఉన్న నేపథ్యంలో.. జెఫ్, మెకెంజీలు తమ షేర్లను ఉమ్మడిగా ఏదైనా ట్రస్ట్‌లో ఉంచడం ద్వారా కంపెనీపై నియంత్రణాధికారాలు కోల్పోకుండా జాగ్రత్తపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రకంగా .. మెకెంజీ తన వోటింగ్‌ హక్కులను జెఫ్‌కి బదలాయించవచ్చని.. అయితే, ప్రస్తుతం ఆయన మైనారిటీ షేర్‌హోల్డరే కనక దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. వాటాలపరమైన ఓటింగ్‌ హక్కులతో కాకుండా కంపెనీ వ్యవస్థాపకుడి హోదా కారణంగానే జెఫ్‌.. అమెజాన్‌ను నడిపించగలుగుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ కంపెనీని కాపాడుకోవాలంటే.. సంస్థ నిర్వహణపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా.. మరేదైనా రూపంలో మెకెంజీకి వాటాలు ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
విభేదాలు తలెత్తితే..
ఒకవేళ విడాకుల వ్యవహారం వివాదాస్పదమైన పక్షంలో ఇటు స్టాక్‌ మార్కెట్‌ పరంగాను అటు పబ్లిక్‌ రిలేషన్స్‌ పరంగాను అమెజాన్‌ భవితపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే మరో వాదన కూడా వినవస్తోంది. దీనితో లాయర్లు అత్యధికంగా ప్రయోజనం పొందవచ్చని కెస్లర్‌ అండ్‌ సోలోమియాని లీగల్‌ సంస్థ పార్ట్‌నర్‌ రాండల్‌ కెస్లర్‌ పేర్కొన్నారు.
అత్యంత సంపన్నురాలిగా మెకెంజీ...
దాదాపు పాతికేళ్ల దాంపత్య బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ జెఫ్‌ బెజోస్ (54), మెకెంజీ (49) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. లారెన్‌ సాంచెజ్‌ అనే మాజీ న్యూస్‌ యాంకర్‌కి, బెజోస్‌కి మధ్య అఫైర్‌ నడుస్తుండటం ఇందుకు కారణం. విడాకులతో మెకెంజీకి.. జెఫ్‌ బెజోస్‌ ఆస్తిలో సగం వాటాలు దక్కే అవకాశం ఉంది. దీని విలువ భారత కరెన్సీలో రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ విడాకుల డీల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా ఉండనుంది. విడాకులతో మెకెంజీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలిగా మారతారు. అదే సమయంలో ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న జెఫ్‌ బెజోస్‌ సంపద సగానికి తగ్గిపోవడంతో బిల్‌ గేట్స్‌ తర్వాత రెండో స్థానానికి పరిమితం కావొచ్చు.You may be interested

ఇన్ఫీ అంచనాలు మిస్‌..!

Saturday 12th January 2019

- క్యూ3లో లాభం 30 శాతం డౌన్‌ - రూ.3,610 కోట్లకు పరిమితం - 20 శాతం పెరిగి రూ.21,400 కోట్లకు ఆదాయం - రూ.4 స్పెషల్‌ డివిడెండ్‌ న్యూఢిల్లీ: రికార్డు లాభాలతో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల (క్యూ3) సీజన్‌కు శుభారంభాన్నివ్వగా.. రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఆదాయం 20 శాతం ఎగిసినప్పటికీ ... నికర

ఈక్విటీల కంటే ఈ ఎన్‌సీడీలు మెరుగా...?!

Saturday 12th January 2019

ఈక్విటీల్లో రాబడుల అవకాశాలు దీర్ఘకాలంలో మెరుగ్గా ఉంటాయనే విషయంలో ఎక్కువ మందికి సందేహం లేదు. కానీ, స్వల్ప కాలం, మధ్య కాలానికి రాబడుల విషయంలో రిస్క్‌ చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఏడాది, మూడేళ్ల కాలం కోసం కాస్త అధిక రాబడులు ఆశించే వారు కూడా మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మరి వీరికి ప్రత్యామ్నాయంగా మెరుగైన రాబడి ఇచ్చే సాధనాలు ఏమున్నాయి? అని పరిశీలిస్తే... తాజాగా ఇష్యూ

Most from this category