STOCKS

News


వాహన కంపెనీల ఫ్రెండ్లీ షికారు

Saturday 9th March 2019
news_main1552115173.png-24502

- బీఎస్‌-6 నిబంధనల అమలుకు కొత్త దోస్తీలు
- టాటా హారియర్‌కు.. ఫియట్‌ ఇంజిన్‌
- టాటాతో పాటు ఎంజీకి కూడా ఫియట్‌దే
- ఫోర్డ్‌కు మాత్రం మహీంద్రా నుంచి సరఫరా
- టెక్నాలజీ విషయంలోనూ కొత్త ఒప్పందాలు
- కొత్త రూపంలో దర్శనమివ్వనున్న స్కోడా

(సాక్షి, బిజినెస్‌ విభాగం)
కానోడికి కానోడు మనోడనేది నానుడి. కానీ ఇపుడు వాహన పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కంపెనీలు పోటీ కంపెనీల్ని ప్రత్యర్థులుగా భావించడం మానేస్తున్నాయి. ప్రతి కంపెనీ... తోటి కంపెనీని ఫ్రెండ్లీగానే చూస్తోంది. దీనికి ప్రధాన కారణం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 నిబంధనలే, ఇవి మరో ఏడాదిలో అమల్లోకి రానుండటంతో... వీటికి అనుగుణంగా ఉండే ఇంజిన్ల తయారీ కోసం కార్ల కంపెనీలు గట్టి కసరత్తు చేస్తున్నాయి. సొంతగా ఇంజిన్లు​తయారు చేయాలంటే పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఇతర చర, స్థిర వ్యయాలు అదనం. మరోవైపు బీఎస్‌-6 నిబంధనల గడువు దగ్గరకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో వాహన పరిశ్రమలో కంపెనీలు మిత్ర గీతం ఆలాపిస్తున్నాయి. పోటీ అని చూడకుండా ఒక కంపెనీ, మరో రెండు, మూడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ బిజినెస్‌ ప్రత్యేక కథనమిది...
భారత్‌ స్టేజ్‌ అంటే... 
మోటార్‌ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో  భారత ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మోటార్‌ వాహనాల నుంచి వాతావరణంలోకి వెలువడే నైట్రోజన్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రో కార్బన్‌, పర్టిక్యులేట్‌ మ్యాటర్‌(పీఎమ్‌), సల్ఫర్‌ ఆక్సైడ్‌ల మోతాదులను తగ్గించడం లక్ష్యంగా  ఈ నిబంధనల్ని రూపొందించారు. 2017 నుంచి భారత్‌ స్టేజ్‌-4 నిబంధనలు అమల్లోకి రాగా... 2020 ఏప్రిల్‌ 1 నుంచి భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ల తయారీ, కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవటం కంపెనీలకు వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఇంజిన్ల తయారీ ఖరీదు కావడం, ఇతర వ్యయాల కారణంగా కొనుగోలు దారులకు కూడా అదనపు భారం తప్పదు.
తప్పనిసరై ఒప్పందాలు...
భారం తగ్గించుకునే క్రమంలో భాగంగా కార్ల కంపెనీలు పోటీ కంపెనీలతో తప్పనిసరై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తర్వాతి తరం ఇంజిన్ల తయారీ కోసం టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు ఆరుకు పైగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం దీంట్లో భాగమే. ఈ రెండు కంపెనీలే కాక ఫియట్‌, ఫోర్డ్‌, తదితర పెద్ద కంపెనీలు కూడా ఇంజిన్లకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఇంజిన్లను ఇతర కంపెనీల నుంచి సమీకరించడం వల్ల కార్ల కంపెనీలకు చాలా అంశాలు కలసివస్తాయి. స్థిర, చర వ్యయాలు తక్కువగా ఉండటమే కాకుండా కంపెనీలు ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది. దీంతో వాహనం ధరను ఆకర్షణీయ స్థాయిలో నిర్ణయించవచ్చు. బీఎస్‌-4 డీజిల్‌ ఇంజిన్ల కన్నా బీఎస్‌-6 డీజిల్‌ ఇంజిన్ల ఖరీదు ఎక్కువ. ఈ ఇంజిన్లను సరుకులు రవాణా చేసే త్రీ వీలర్ల నుంచి ఆధునిక స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌కు (ఎస్‌యూవీ) వినియోగించనున్నారు. 
టాటా మోటార్స్‌కు ఫియట్‌ ఇంజిన్లు...
టాటా మోటార్స్‌ ఇటీవలే హారియర్‌ పేరిట కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తెచ్చింది. దీనిని 2.0 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందించారు. ఈ ఇంజిన్లను ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమోబైల్స్‌ (గతంలో ఫియట్‌ ఇండియా) నుంచి టాటా మోటార్స్‌ కొనుగోలు చేసింది. ఈ ఏడాదే మార్కెట్లోకి  రానున్న ఏడు సీట్ల హారియర్‌ మోడల్‌కు కూడా ఇంజిన్లను ఈ కంపెనీ నుంచే టాటా మోటార్స్‌ తీసుకుంటోంది. హారియర్‌లో ఆటోమేటిక్‌ వేరియంట్‌కు కావలసిన ఇంజిన్ల కోసం కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్‌తో టాటా చర్చలు జరిపిందని, సాంకేతిక కారణాలతో డీల్‌ కుదరలేదని సమాచారం. హారియర్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌కు కావలసిన బీఎస్‌-6 డీజిల్‌ ఇంజిన్లను సరఫరా చేస్తామని ఫియట్‌ క్రిస్లర్‌ కంపెనీ ముందుకు వచ్చింది. టాటా మోటార్స్‌కే  కాకుండా బ్రిటిష్‌ బ్రాండ్‌ ఎమ్‌జీ మోటార్స్‌కు కూడా ఇంజిన్లను సరఫరా చేయడానికి ఫియట్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎమ్‌జీ మోటార్స్‌ భారత మార్కెట్లో హెక్టర్‌ మోడల్‌తో అరంగేట్రం చేయనుంది. ఐదు సీట్ల ప్రీమియం ఎస్‌యూవీ... హెక్టర్‌లో ఫియట్‌ సరఫరా చేసే ఇంజిన్లనే ఉపయోగిస్తారు. ఇదే ఇంజిన్‌ను ఫియట్‌ కంపెనీ తన జీప్‌ కంపాస్‌ ఎస్‌యూవీలో ఉపయోగిస్తోంది. 
ఫోర్డ్‌కు మహీంద్రా...
ఇంజిన్ల సరఫరా ఒక్క ఫియట్‌ కంపెనీకే పరిమితం కాలేదు. దేశీ దిగ్గజ వాహన కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా కూడా ఇంజిన్లను సరఫరా చేయనుంది. ఈ కంపెనీ 1.2 లీటర్ల టర్బో-చార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్లను ఫోర్డ్‌ కంపెనీకి సరఫరా చేస్తోంది. తన ఈకో స్పోర్ట్‌ ఎస్‌యూవీలో ఈ ఇంజిన్లను ఫోర్డ్‌ వాడుకోనుంది. ఇటీవలే మహీంద్రా మార్కెట్లోకి తెచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఎస్‌యూవీలో ఈ ఇంజిన్‌నే వాడారు. మహీంద్రా ఇంజిన్లను సరఫరా చేయటంతో పాటు, వేరే కంపెనీ నుంచి ఇంజిన్లను కొనుగోలు కూడా చేస్తోంది. తన త్రీ వీలర్ల కోసం చిన్నదైన రెండు సిలిండర్ల డీజిల్‌ ఇంజిన్లను గ్రీవ్స్‌ కాటన్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక గ్రీవ్స్‌ కాటన్‌ బీఎస్‌-సిక్స్‌ ఇంజిన్లను పియాజియో కంపెనీకి సరఫరా చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పియాజియో కంపెనీ తన త్రీ వీలర్లలో ఈ ఇంజిన్లను ఉపయోగించనున్నది. 
టెక్నాలజీ కోసం కూడా...
బీఎస్‌-6 ఇంజిన్‌ టెక్నాలజీ కోసం టాటా మోటార్స్‌ సంస్థ వెస్ట్‌పోర్ట్‌ ఫ్యూయల్‌ సిస్టమ్స్‌తోను, అశోక్‌ లేలాండ్‌ జపాన్‌కు చెందిన హినోతోనూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కెనడాకు చెందిన వెస్ట్‌పోర్ట్‌ 4, 6 సిలిండర్ల సీఎన్‌జీ ఇంజిన్లను టాటా మోటార్స్‌కు సరఫరా చేయనుంది. తన ట్రక్కులు, బస్సుల కోసం ఈ ఇంజిన్లను టాటా మోటార్స్‌ ఉపయోగిస్తుంది. కమ్మిన్స్‌ కంపెనీతో ఇంజిన్ల సరఫరా ఒప్పందాలు గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్‌ కొనసాగిస్తోంది.  బీఎస్‌-సిక్స్‌ డీజిల్‌ ఇంజిన్ల కోసం తాజాగా మరో ఒప్పందాన్ని టాటా మోటార్స్‌ కుదుర్చుకుంది. 
ఫోక్స్‌వ్యాగన్‌ ప్రాజెక్ట్‌ 2.0 
ఫోక్స్‌వ్యాగన్‌- స్కోడా భారత్‌లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వచ్చే ఏడాది కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం బీఎస్‌-6 ఇంజిన్ల కొనుగోలుదారుల కోసం చూస్తోంది. జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే  బీఎస్‌- 6(యూరో-సిక్స్‌) ఇంజిన్లు తయారు చేస్తోంది. భారత్‌లో ప్రాజెక్ట్‌ 2.0 పేరుతో కొత్త తరం ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టనుంది. ఇంజిన్ల తయారీకి స్థానిక విడిభాగాలను 95 శాతం వరకూ వినియోగించుకోనున్నది. You may be interested

వాల్యూ బయింగ్‌తో మిడ్‌క్యాప్స్‌ జోరు!

Saturday 9th March 2019

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌లో వాల్యూబయింగ్‌ కొనసాగుతుందని, దీంతో మిడ్‌క్యాప్స్‌లో ర్యాలీకి మరింత అవకాశం ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. గత రెండు వారాల్లో ప్రధాన సూచీ 2.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్‌క్యాప్‌ సూచీ 4.5 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 7.5 శాతం పరుగు తీశాయి. ఈ ఏడాది జరిగే సాధారణ ఎన్నికలతో మార్కెట్లో ఆటుపోట్లు ఉంటాయని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. గత మూడు దఫాలుగా ఎన్నికల

బంగారం.. ర్యాలీకి రెడీ!

Saturday 9th March 2019

అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధర పెద్దగా మార్పులేకుండా 1280 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ వృద్ధి అంచనాలు తిరోగమనం పడుతున్న సంకేతాలు వస్తున్నందున ఇకపై బంగారం ధర దూసుకుపోయే ఛాన్సులున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే పలు దేశాల కేంద్ర బ్యాంకులు మానిటరీ పాలసీ సడలింపులకు దిగుతున్నాయి. మరోవైపు చైనా, ఈసీబీ 2019 సంవత్సరానికి వృద్ధి అంచనాలను తగ్గించాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత స్థానంగా

Most from this category