STOCKS

News


రెండేళ్లు... రూ.లక్ష కోట్లు..!

Wednesday 6th February 2019
news_main1549428982.png-24039

 షేర్‌హోల్డర్లకు తిరిగిచ్చిన టాప్‌ 5 ఐటీ దిగ్గజాలు
- షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల రూపంలో చెల్లింపు
- టాప్‌లో టీసీఎస్‌

న్యూఢిల్లీ: దేశీ టాప్‌ 5 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్‌హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్‌ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్‌ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్‌ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌దే ఉంది. అయిదు టాప్‌ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్‌హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్‌ రూపంలోనే జరిగింది. టీసీఎస్‌ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్‌ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కూడా అదే బాటలో నడవగా.. టెక్‌ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్‌ చేపట్టలేదు. మరోవైపు, టాప్‌ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్‌ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది.

బోనస్‌లు కూడా..
షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్‌ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్‌ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్‌ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి మూడు షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది.

బైబ్యాక్స్‌కే ఎందుకు ప్రాధాన్యం..
డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్‌ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్‌ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్‌లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్‌ అందుకునే హై నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్‌ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్‌ డిక్లేర్‌ చేస్తే.. దానిపై దాదాపు 20 శాతం దాకా (అసలు 15 శాతం, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్‌లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్‌ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్‌లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు.

ఈపీఎస్‌ ప్రయోజనాలు కూడా..
డివిడెండ్‌ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్‌ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, పలితంగా మార్కెట్‌ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్‌ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్‌) పెరిగి, వేల్యుయేషన్‌ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్‌ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను కూడా విక్రయించకుండా దూరంగా ఉన్న పక్షంలో.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్‌ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.

రూ. 1.17 లక్షల కోట్లలో కంపెనీలవారీగా వాటా

కంపెనీ        శాతం

టీసీఎస్‌        45
ఇన్ఫోసిస్‌       33
విప్రో         11
హెచ్‌సీఎల్‌ టెక్‌    9
టెక్‌ మహీంద్రా    2

చెల్లింపుల్లో బైబ్యాక్, డివిడెండ్స్‌ వాటా

కంపెనీ          బైబ్యాక్‌    డివిడెండ్‌
టీసీఎస్‌         61        39
ఇన్ఫోసిస్‌       54        46
విప్రో             89        11
హెచ్‌సీఎల్‌     69        31
టెక్‌మహీంద్రా  0        100

 



You may be interested

ఎల్‌పీజీ వినియోగంలో మనం ప్రపంచ నెంబర్‌2

Wednesday 6th February 2019

ఎల్‌పీజీ వినియోగంలో మనం ప్రపంచ నంబర్‌2 వినియోగం 22.5 మిలియన్‌ టన్నులు 8.4 శాతం చొప్పున వృద్ధి న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎల్‌పీజీని (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) అత్యధికంగా వినియోగించే రెండో దేశంగా భారత్‌ పైకి చేరింది. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్‌ 2025 నాటికి 34 శాతం పెరుగుతుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ తెలిపారు. ఆసియా ఎల్‌పీజీ సదస్సు మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుట్టీ మాట్లాడుతూ... ఎల్‌పీజీ

సుబాక్సోన్ కేసులో డాక్టర్‌ రె​డ్డీస్‌కు ఊరట

Wednesday 6th February 2019

హైదరాబాద్‌: జనరిక్‌ ఔషధం సబాక్సాన్‌ కేసులో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు అమెరికా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లో ఊరట లభించింది. వివరాల్లో వెళితే... మాదకద్రవ్య (ఒపియమ్‌) వ్యసనానికి బానిసలయ్యే వారి చికిత్సలో వినియోగించే తమ ఉత్పత్తి సబాక్సాన్‌ జనరిక్‌ వెర్షన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌సహా ఔషధ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో  విక్రయించకుండా నిరోధించాలని బ్రిటిష్‌ ఔషధ ఉత్పత్తి సంస్థ ఇన్డీవర్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయంలో గత ఏడాది జూన్‌లో ఈ ఔషధానికి

Most from this category