STOCKS

News


టీసీఎస్‌... ప్రపంచంలో టాప్‌-3 ఐటీ సేవల్లో మూడో అత్యంత విలువైన బ్రాండ్‌

Thursday 24th January 2019
news_main1548304766.png-23771

టాప్‌-10లో ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌
బ్రాండ్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో భారత కంపెనీలు ప్రతిభ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ రంగంలో టీసీఎస్‌ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను యాక్సెంచర్‌, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలవగా, టీసీఎస్‌ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌’ రిపోర్ట్‌ తెలియజేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో సైతం టాప్‌-10లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. 26.3 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువతో యాక్సెంచర్‌ మొదటి స్థానంలో నిలిచింది. క్రితం ఆర్థిక సంవత్సరం నివేదికలో ఐబీఎం మొదటి స్థానంలో ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి యాక్సెంచర్‌ మొదటి స్థానానికి చేరుకుంది. 20.4 బిలియన్‌ డాలర్లతో ఐబీఎం రెండో స్థానానికి పరిమితమైంది. 12.8 బిలియన్‌ డాలర్లతో టీసీఎస్‌ మూడో స్థానం దక్కించుకుంది. సంస్థ మార్కెట్‌ విలువ క్రితం నివేదికతో పోలిస్తే 23 శాతం పెరిగినట్టు బ్రాండ్‌ ఫైనాన్స్‌ నివేదిక తెలిపింది. డిజిటల్‌ సేవల మార్కెట్‌ను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారించినట్టు పేర్కొంది. జపాన్‌ మార్కెట్లో విజయం సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ టీసీఎస్‌ అని ప్రస్తావించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్‌ ఆటోమేషన్‌ సహా అన్ని రకాల కస్టమర్‌ సేవలను అందించడంలో లీడర్‌గా నిలిచినట్టు వివరించింది.
టాప్‌-10లో తొలిసారిగా విప్రో
విప్రో తొలిసారిగా ఈ జాబితాలో టాప్‌-10లో చోటు దక్కించుకున్నట్టు బ్రాండ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. డిజిటల్‌ సామర్థ్యాల పెంపు, కీలకమైన కొనుగోళ్లపై కంపెనీ చేసిన గణనీయమైన పెట్టుబడులతో ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూడో కంపెనీగా విప్రో నిలిచినట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్‌ (8.7 బిలియన్‌ డాలర్లు) నాలుగు, ఇన్ఫోసిస్‌ (6.5 బిలియన్‌ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచాయి. క్యాప్‌జెమిని, డీఎక్స్‌సీ టెక్నాలజీ, ఎన్‌టీటీ డేటా టాప్‌-10లో నిలిచిన ఇతర సంస్థలు. నైపుణ్య ఉద్యోగులు, ప్రపంచ స్థాయి సదుపాయాలు, వసతులు వంటివి భారత్‌ను ఆకర్షణీయమైన ప్రదేశంగా, ప్రపంచానికి చోదకంగా నిలుపుతున్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌ సీఈవో డేవిడ్‌హేగ్‌ పేర్కొన్నారు.



You may be interested

అంతకు మించి... అర్థిక వృద్ధి !

Thursday 24th January 2019

- ఐఎమ్‌ఎఫ్‌ అంచనాలు మించుతాం - నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అమితాబ్‌ కాంత్‌ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో వెల్లడి... దావోస్‌: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్‌ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేసినట్లు నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. ఇది భారత్‌ సత్తాకు నిదర్శనమంటూ... తాము అంతకు మించిన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని ఆయన ధీమా

జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌

Thursday 24th January 2019

జీఎస్టీపై అప్పీళ్లకు ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ సార్క్‌ దేశాలతో కరెన్సీ స్వాప్‌ ఆహార రంగంలో జపాన్‌తో సహకారం కేంద్ర కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏదైనా అంశంలో వివాదం ఏర్పడితే రెండో అప్పీలు చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందన్నది కేంద్రం ఉద్దేశం. రాష్ట్రాల స్థాయిలో భిన్న తీర్పులు వచ్చిన కేసులను సైతం జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నేషనల్‌ బెంచ్‌ విచారిస్తుంది.

Most from this category