STOCKS

News


టీసీఎస్‌ లాభం రూ.8,126 కోట్లు

Saturday 13th April 2019
news_main1555132846.png-25101

-అంచనాలను మించిన ఫలితాలు
- లాభం 18 శాతం; ఆదాయం 19 శాతం వృద్ధి
- రూ.38,010 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం 
- ఒక్కో షేర్‌కు రూ.18 డివిడెండ్‌

ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018-19 జనవరి-మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్‌) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు గిందని టీసీఎస్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో రూ.6,904 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ గోపీనాధన్‌ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.32,075 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతం వృద్ధితో రూ.38,010 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదాయం పరంగా నాలుగేళ్లలో  ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి అని పేర్కొన్నారు. ‘‘డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 2,000 కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. వార్షికంగా 13 శాతం, సీక్వెన్షియల్‌గా 2 శాతం వృద్ధి సాధించాం. రానున్న క్వార్టర్లలో ఇదే జోరు కొనసాగుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కో షేర్‌కు రూ.18 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నాం. దీన్ని వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన నాలుగు రోజులకు చెల్లిస్తాం’’ అని వివరించారు. రూపాయి బలపడినప్పటికీ, కంపెనీ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు అధిగమించగలిగామన్నారు. 
ఎబిట్‌ మార్జిన్‌ 25.1 శాతం...
ఎబిట్‌ మార్జిన్‌ 15 బేసిస్‌ పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరిందని రాజేశ్‌ తెలియజేశారు. ఎబిట్‌ మార్జిన్‌ రూ.9,537 కోట్లుగా నమోదైందని తెలిపారు. నికర లాభం, ఆదాయం పరంగా విశ్లేషకుల అంచనాలను టీసీఎస్‌ ఫలితాలు అధిగమించాయి. అయితే ఎబిట్‌, మార్జిన్ల పరంగా అంచనాలను ఈ ఫలితాలు అందుకోలేకపోయాయి. 
అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి...! 
బ్యాంకింగ్‌, ఆర్థిక సేలు, బీమా విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.13,650 కోట్లకు పెరిగిందని రాజేశ్‌ చెప్పారు. డిజిటల్‌ విభాగం ఆదాయం 46 శాతం ఎగసిందని. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ విభాగం ఆదాయం వాటా 31 శాతంగా ఉందని పేర్కొన్నారు.  రిటైల్‌, సీపీజీ, తయారీ రంగ విభాగలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. గత మూడు క్వార్టర్ల పరంగా చూస్తే, ఆర్డర్‌ బుక్‌ అధికంగా ఉందని రాజేశ్‌ తెలిపారు. వివిధ క్లయింట్లతో డీల్స్‌ కుదుర్చుకునే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపారు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభమే ఉండగలదని పేర్కొన్నారు. 
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.31,472 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.1,46,463 కోట్లకు పెరిగాయని రాజేశ్‌ గోపీనాధన్‌ వెల్లడించారు. నిర్వహణ మార్జిన్‌ 25.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. నికరంగా 29,287 ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24,285కు చేరిందని వివరించారు. దీంట్లో మహిళ ఉద్యోగుల శాతం 36 శాతంగా ఉందని తెలిపారు.



You may be interested

అంచనాలు మించిన ఇన్ఫీ

Saturday 13th April 2019

- క్యూ4లో లాభం రూ.4,078 కోట్లు; 10.5 శాతం అప్‌ - ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు - షేరుకు రూ.10.5 తుది డివిడెండ్‌... - 2019-20 ఆదాయ వృద్ధి అంచనా 7.5-9.5 శాతం బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018-19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే

ఐహెచ్‌ఎఫ్‌, ఎల్‌వీబీకి అమ్మకాల ఒత్తిళ్లు

Friday 12th April 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌), లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ) ప్రతిపాదిత విలీనంపై బ్రోకరేజీ సంస్థలు సానుకూలంగానే ఉన్నప్పటికీ... ఈ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. విలీన నిర్ణయం తర్వాత ఈ రెండు స్టాక్స్‌ సుమారు 10 శాతం నష్టపోయాయి. విలీన ప్రతిపాదన ప్రకారం చూస్తే ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు 14 ఇండియాబుల్స్‌ షేర్లు లభిస్తాయి. ఈ ప్రకారం చూస్తే ఎల్‌వీబీ 30 శాతం తక్కువకే అందుబాటులో ఉంది.

Most from this category