STOCKS

News


టీసీఎస్‌ లాభం రూ.8,131 కోట్లు

Wednesday 10th July 2019
news_main1562740317.png-26942

  • 11 శాతం వృద్ధి 
  • ఆదాయం కూడా 11 శాతం అప్‌
  • ఒక్కో షేర్‌కు రూ. 5 డివిడెండ్‌
  • ఈ క్యూ1లో 12,356 నికర ఉద్యోగాలు 
  • గత ఐదేళ్లలో ఇదే అత్యధికం 

ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం, మార్జిన్ల విషయంలో అంచనాలు మిస్‌ అయ్యాయి.  జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.8,131 కోట్లకు పెరిగిందని టీసీఎస్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.7,340 కోట్ల నికర లాభం సాధించామని కంపెనీ సీఈఓ ఎమ్‌డీ రాజేశ్‌ గోపీనాధ్‌ చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వచ్చిన నికర లాభం (రూ. 8,126 కోట్ల)తో పోల్చితే 0.06 శాతం వృద్ధి నమోదైంది. ఇక గత క్యూ1లో రూ.34,261 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ1లో 11 శాతం వృద్ధితో రూ.38,172 కోట్లకు పెరిగిందని గోపీనాధ్‌ పేర్కొన్నారు. మూడు నెలల కాలాన్ని పరగణనలోకి తీసుకుంటే, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం. అయితే గత నాలుగు క్వార్టర్లలో ఈ కంపెనీ 16-20 శాతం ఆదాయ వృద్ధి సాధిస్తోంది. దీంతో పోల్చితే ఈ క్యూ1లో ఆదాయ వృద్ధి అంతంమాత్రంగానే ఉంది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని గోపీనాధ్‌  తెలిపారు. ఈ డివిడెండ్‌ను ఈ నెల 23న చెల్లిస్తామని పేర్కొ‍న్నారు. 

నిలకడైన ఆరంభం...
కొత్త ఆర్థిక సంవత్సరం నిలకడైన ఆరంభంతో మొదలైందని రాజేశ్‌ గోపీనాధ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు వృద్ధి, డిజిటల్‌ మార్పుల కోసం గణనీయంగానే పెట్టుబడులు పెడుతున్నాయని ని వివరించారు. ఫలితంగా ఈ క్యూ1లో మంచి ఆర్డర్లు, డీల్స్‌ సాధించామని తెలిపారు. ఈ క్యూ1లో డీల్స్‌ 25 శాతం వృద్ధితో 570 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆదాయంంలో 32 శాతం వాటా ఉన్న డిజిటల్‌ ఆదాయం ఈ క్యూ1లో 42 శాతం ఎగసిందని గోపీనాధ్‌ పేర్కొన్నారు. 

13 శాతం వృద్ధితో రూ.21.67కు ఈపీఎస్‌...
మార్జిన్లు మంచి వృద్దినే సాధించాయని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి. రామకృష్ణన్‌ తెలిపారు. కార్యకలాపాల జోరు కారణంగా నగదు నిల్వలు పెరిగాయని, ఈపీఎస్‌(షేర్‌వారీఆర్జన) మరింతగా విస్తరించిందని వివరించారు. ఈపీఎస్‌ 13 శాతం వృద్ధితో రూ.21.67కు చేరిందని పేర్కొన్నారు. 

ఐదేళ్లలో అత్యధిక త్రైమాసిక ఉద్యోగాలు...
ఈ క్యూ1లో నికరంగా 12,356 ఉద్యోగాలిచ్చామని, గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని టీసీఎస్‌ తెలిపింది.  దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.36 లక్షలకు పెరిగిందని పేర్కొంది.  30 వేల మంది తాజా గ్రాడ్యుయేట్లకు జాయినింగ్‌ లెటర్లు ఇచ్చామని, వీరిలో 40 శాతం మంది ఈ క్యూ1లో ఉద్యోగాల్లో చేరారని, మిగిలిన వాళ్లు ఈ క్యూ2లో చేరతారన్న అంచనాలున్నాయని తెలిపింది. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) 11.5 శాతంగా ఉంది.

మరిన్ని విశేషాలు...

  • ఆదాయం రూపాయిల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 11 శాతం, సీక్వెన్షియల్‌గా 0.4 శతం వృద్ధి చెందింది. 
  • ఆదాయం డాలర్ల పరంగా చూస్తే, ఏడాది కాలంలో 9 శాతం వృద్ధి చెందింది. 
  • గత క్యూ1లో 25 శాతంగా, మార్చి క్వార్టర్‌లో 25.1 శాతంగా ఉన్న నిర్వహణ మార్జిన్‌ ఈ క్యూ1లో 24.2 శాతానికి తగ్గింది.  నికర మార్జిన్‌ 21.3 శాతంగా నమోదైంది. వేతన పెంపు, రూపాయి బలపడటం ప్రభావం చూపాయి. 
  • ఇతర ఆదాయం సీక్వెన్షియల్‌గా 40 శాతం పెరగడంతో లాభదాయకత మెరుగుపడింది. 
  • స్థూల లాభం(వడ్డీ, ట్యాక్స్‌లను కలుపుకొని)3 శాతం క్షీణించి రూ.9,220 కోట్లకు చేరింది. 



You may be interested

విదేశాలకు వెళ్లాలనుకుంటే రూ.18,000 కోట్లు గ్యారంటీ ఇవ్వాలి

Wednesday 10th July 2019

నరేష్‌ గోయల్‌కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్‌) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్‌ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్‌ సర్క్యులర్‌ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల

భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు

Wednesday 10th July 2019

మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌ వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్‌ ఎంతో కాలంగా అమెరికన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించలేది లేదంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. గత నెల 28న జీ-20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్‌, మన దేశ ‍ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన

Most from this category