News


టాటామోటర్స్‌ నష్టాలు రూ.26, 961కోట్లు

Friday 8th February 2019
news_main1549605204.png-24081

  • ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం
  • వరుసగా మూడో క్వార్టర్‌లోనూ నష్టాలే
  • కంపెనీ జోరుకు జేఎల్‌ఆర్‌ బ్రేక్‌లు

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. ఒక్క త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. వరుసగా మూడో క్వార్టర్‌లోనూ కంపెనీ నష్టాలనే ప్రకటించింది. విలాస కార్ల విభాగం, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) వన్‌టైమ్‌ అసెట్‌ ఇంపెయిర్‌మెంట్‌(రూ.27,838 కోట్లు) కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. జేఎల్‌ఆర్‌ మూలధన పెట్టుబడులకు సంబంధించిన పుస్తక విలువను తగ్గించడానికి ఈ అసాధారణమైన వ్యయాన్ని ప్రకటించామని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాల్ఫ్‌ స్పెత్‌ తెలిపారు. చైనాలో అమ్మకాలు తగ్గడం, తరుగుదల అధికంగా ఉండటం, పెట్టుబడి వ్యయాల అమోర్టైజేషన్‌ కారణంగా ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వాహన పరిశ్రమ మార్కెట్‌, సాంకేతిక, విధాన సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్త మోడళ్లు, విద్యుదీకరణ, ఇతర టెక్నాలజీల కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వస్తోందని వివరించారు.
4 శాతం ఎగసిన ఆదాయం...
గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్‌ తెలిపింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...స్టాండోలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.212 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.618 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,186 కోట్ల నుంచి రూ.16,477 కోట్లకు ఎగసింది. జేఎల్‌ఆర్‌ ఆదాయం 1 శాతం తగ్గి 620 కోట్ల పౌండ్లకు చేరింది. వడ్డీ వ్యయాలు రూ.321 కోట్లు పెరిగి రూ.1,568 కోట్లకు ఎగిశాయి. జేఎల్‌ఆర్‌ రిటైల్‌ అమ్మకాలు 6 శాతం తగ్గి 1,44,602కు, హోల్‌సేల్‌  అమ్మకాలు 11 శాతం తగ్గి 1,41,552కు చేరాయి.  దేశీయంగా అమ్మకాలు 0.5 శాతం తగ్గి 1,71,354కు చేరాయి. జేఎల్‌ఆర్‌ అంతర్జాతీయ అమ్మకాలు జనవరిలో 11 శాతం తగ్గి 43,733కు పడిపోయాయి. జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 9 శాతం, ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు 12 శాతం చొప్పున తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎబిట్‌ మార్జిన్‌ స్వల్పంగా నెగిటివ్‌గా ఉండొచ్చని, ఫలితంగా పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల నష్టాలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
మార్కెట్‌  వాటా పెరుగుతోంది...
దేశీయ వ్యాపారం జోరు కొనసాగుతోందని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు. తమ మార్కెట్‌ వాటా పెరుగుతోందని, లాభదాయకత వృద్ది కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. టర్న్‌ అరౌండ్‌ 2.0 వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. జేఎల్‌ఆర్‌ సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.  అయితే వ్యాపారం భవిష్యత్తులో బాగుండేలా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యయాల నియంత్రణ, క్యాష్‌ ఫ్లోస్‌ మెరుగుపరచుకోవడం, తదితర చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
భారీగానే బ్రెగ్జిట్‌ భారం....
బ్రెగ్జిట్‌ విషయమై ఎలాంటి ఒప్పందం కుదరలేనందున ఇంగ్లాండ్‌లో జేఎల్‌ఆర్‌ ప్లాంట్లను రెండు నుంచి మూడు వారాల పాటు మూసివేయాల్సి వస్తుందని టాటా మోటార్స్‌ తెలిపింది. బ్రెగ్జిట్‌ కారణంగా ఉత్పత్తి సంబంధిత సమస్యలు తలెత్తి దీర్ఘకాలంలో జేఎల్‌ఆర్‌ లాభదాయకత దెబ్బతింటుందని పేర్కొంది.You may be interested

అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం

Friday 8th February 2019

8 స్థానాలు పురోగతి న్యూఢిల్లీ: అంతర్జాతీయ మోథోసంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరచుకుంది. 2018లో ఈ సూచీ 44 వద్ద ఉండగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది. 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఈ సూచీ రూపొందింది. ఈ సూచీలో అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల

రుణాలిక బిందాస్‌

Friday 8th February 2019

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ రివర్స్‌ రెపో కూడా ఇదే స్థాయిలో కోత ఇకపై తటస్థ విధానానికి సెంట్రల్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌ దాస్‌ నేతృత్వంలో నిర్ణయాలు గృహ, వాహన రుణాల వడ్డీ రేటు తగ్గే అవకాశం ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా

Most from this category