STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు

Saturday 20th July 2019
news_main1563598587.png-27199

డాబర్‌ ఇండియా లాభం రూ.364 కోట్లు

  • 10 శాతం వృద్ధి 
  • 9 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా  నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.330 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని డాబర్‌ ఇండియా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,081 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డిమాండ్‌ మందగమనంగా ఉన్నప్పటికీ, మంచి ఫలితాలు సాధించామని కంపెనీ సీఈఓ మోహిత్‌ మల్హోత్ర చెప్పారు. 

ఐసీఐసీఐ లాంబార్డ్‌ లాభం రూ.310 కోట్లు

  • 7 శాతం వృద్ధి 
  • 8 శాతం తగ్గిన ప్రీమియమ్‌ ఆదాయం 

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.310 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికరలాభం, రూ.289 కోట్లతో పోల్చితే 7 శాతం వృద్ది సాధించామని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. స్థూల ప్రత్యక్ష ప్రీమియమ్‌ ఆదాయం(జీడీపీఐ) రూ.3,774 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.3,487 కోట్లకు చేరిందని పేర్కొంది. వ్యవసాయ బీమా రంగాన్ని మినహాయిస్తే, జీడీపీఐ రూ.2,964 ​కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.3,488 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఈ విషయంలో పరిశ్రమ వృద్ధి(14 శాతం) కంటే ముందున్నామని వివరించింది. ఐసీఐసీఐ గ్రూప్‌నకు చెందిన ఈ బీమా సంస్థ వాహన, ఆరోగ్య, పంటల, అగ్ని ప్రమాద, వ్యక్తిగత, సముద్ర, ఇంజినీరింగ్‌ బీమా సేవలనందిస్తోంది.

బంధన్‌ బ్యాంకు జూన్‌ క్వార్టర్‌లో రూ.701 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బంధన్‌ బ్యాంకు జూన్ త్రైమాసికం లాభాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. నికర లాభం 45 శాతం పెరిగి రూ.701 కోట్లు, మొత్తం ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.1,723 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.482 కోట్లు, ఆదాయం 1,248 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం కూడా 36 శాతం పెరిగి రూ.1,411 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 48 శాతం వృద్ధి చెంది రూ.312 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 47 శాతం పెరిగి రూ.1,208 కోట్లుగా ఉంది. బ్యాంకు రుణాల పోర్ట్‌ఫోలియో రూ.45,420 కోట్లకు చేరుకుంది. ఇందులోనూ 39 శాతం వృద్ధి నమోదైంది. అలాగే, బ్యాంకు డిపాజిట్లు కూడా క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసుకుంటే 42 శాతం పెరిగి రూ.43,701 కోట్లకు చేరాయి. కాకపోతే స్థూల ఎన్‌పీఏలు 1.26 శాతం నుంచి మొత్తం రుణాల్లో 2.02 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 0.64 శాతం నుంచి 0.56 శాతానికి తగ్గాయి. ‘‘రుణాల వృద్ధి 39 శాతంగా ఉండడంతోపాటు ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉంది. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనంతో బ్యాంకు వ్యాపారంలో వైవిధ్యం నెలకొనడంతోపాటు వృద్ధి తోడవుతుంది’’ అని బంధన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ తెలిపారు. బ్యాంకు మొత్తం రుణ పోర్ట్‌ఫోలియోలో సూక్ష్మ రుణాలు 86 శాతంగా ఉంటాయని చెప్పారు. 

మెప్పించిన ఆర్‌బీఎల్‌ బ్యాంకు

  • జూన్‌ త్రైమాసికంలో లాభం 41 శాతం పెరుగుదల
  • రూ.267 కోట్లుగా నమోదు
  • సమీప కాలంలో ఎన్‌పీఏలు పెరిగే ‍ప్రమాదం
  • ఈ ఏడాది చివరికి 2.5 శాతానికి చేరొచ్చన్న బ్యాంకు

న్యూఢిల్లీ: ఆర్‌బీఎల్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర లాభం 41 శాతం పెరిగి రూ.267 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గడంతోపాటు ఫీజుల ఆదాయం వృద్ధి చెందడం మంచి ఫలితాలకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆర్జించిన లాభం రూ.190 కోట్లుగానే ఉంది. బ్యాంకు మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,690 కోట్ల నుంచి రూ.2,504 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం సైతం రూ.1,364 కోట్ల నుంచి రూ.2,022 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ మార్జిన్‌ 27 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి జూన్‌ త్రైమాసికంలో 4.31 శాతానికి చేరుకుంది. 

ఇండిగోకు అత్యధిక లాభం

  • 43 రెట్ల వృద్ధితో రూ.1,203 కోట్లకు 
  • రూ.9,787 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: విమానయాన సం‍స్థ, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,203 కోట్ల నికర లాభం సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.28 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. గత క్యూ1 నికర లాభంతో పోల్చితే 43 రెట్ల వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ రోనోజాయ్‌ దత్తా తెలిపారు.   ప్రయాణికుల ఆదాయం అధికంగా ఉండటంతో పాటు సరకు రవాణా (కార్గో) విభాగం పనితీరు మెరుగుపడటంతో నికర లాభం  ఈ స్థాయిలో పెరిగిందని  వివరించారు.  మొత్తం ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి రూ.9,787 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 

రూ.17,337 కోట్ల నగదు నిల్వలు.....
కార్యకలాపాల ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.9,420 కోట్లకు పెరిగిందని దత్తా తెలిపారు.  ప్రయాణించిన ప్రతి కిలోమీటర్‌కు వచ్చే రాబడి(ఈల్డ్‌) 13 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ జూన్‌ నాటికి మొత్తం 235 విమానాలతో 70 నగరాలకు సర్వీసులను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ జూన్‌ నాటికి నగదు నిల్వలు రూ.17,337 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.

హిందుస్తాన్‌ జింక్‌ జూన్‌ త్రైమాసికంలో 8 శాతం డౌన్‌
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపు సబ్సిడరీ అయిన హిందుస్తాన్‌ జింక్‌ నికర లాభం జూన్‌ త్రైమాసికంలో 8 శాతం తగ్గి రూ.1,765 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా రూ.4,924 కోట్లకు క్షీణించింది. క్రితం ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,918 కోట్లు, ఆదాయం రూ.5,258 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘నికర లాభం వార్షికంగా ఇదే కాలంలో చూసుకుంటే 8 శాతం, క్రితం త్రైమాసికంతో చూస్తే 12 శాతం మేర తగ్గిపోయాయి. ప్రధానంగా ఎబిట్డా తక్కువగా ఉండగా, తక్కువ పన్ను రేటు రూపంలో కొంత వెసులుబాటు లభించింది’’ అని కంపెనీ స్పష్టం చేసింది. లండన్‌ మెటల్‌ ఎక్సేంజ్‌లో ధరలు తగ్గడమే కంపెనీ లాభం పడిపోవడానికి ప్రధాన కారణమని హిందుస్తాన్‌ జింక్‌ సీఈవో సునీల్‌ దిగ్గల్‌ మీడియాకు తెలిపారు. ఉత్పత్తి రానున్న త్రైమాసికాల్లో మెరుగుపడుతుందని, దీనికితోడు అంతర్గత సామర్థ్యాల మెరుగు, టెక్నాలజీల సాయంతో వ్యయాలను తగ్గించనున్నట్టు చెప్పారు. కంపెనీ వ్యయాలు జూన్‌ త్రైమాసికంలో రూ.3,073 కోట్లుగా ఉన్నాయి. ‘‘మా ప్రాజెక్టుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పూర్తయ్యేందుకు దగ్గర్లో ఉన్నాయి. దీంతో పరిశ్రమలో అగ్రగామిగా మా స్థానం మరింత బలోపేతం అవుతుంది. ప్రపంచస్థాయి గనులతో, తక్కువ వ్యయానికే ఉత్పత్తిదారుగా ఉన్నాం. దీంతో ఎటువంటి మార్కెట్‌ పరిస్థితుల్లో అయినా మా వాటాదారులకు అధిక రాబడులకు అవకాశం ఉంటుంది’’ అని హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ కిరణ్‌ అగర్వాల్‌ తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ లోహ ఉత్పత్తి ఒక శాతం పెరిగి 2,13,000 టన్నులుగా నమోదైంది. జింక్‌ ఉత్పత్తి ఫ్లాట్‌గా 1,72,000 టన్నులుగా ఉంది. 



You may be interested

5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన సీపీఎస్‌ఈ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Saturday 20th July 2019

రూ.10,000 కోట్ల సమీకరణ లక్ష్యం  న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఐదవ  ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ 5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ ఇష్యూ సైజు రూ.8,000 కోట్లు కాగా, రూ.40,000 కోట్ల మేర బిడ్‌లు వచ్చాయని దీపమ్‌ సెక్రటరీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఎఫ్‌ఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ,

విమానయాన రంగం తిరిగి పుంజుకోనుంది

Saturday 20th July 2019

బోర్డు రూమ్‌ వివాదాలు, రుణాల భారం, భవిష్యత్తుపై అనుమానాలు వలన విమానయాన పరిశ్రమ ఇటివల అందరి దృష్ఠిని ఆకర్షిస్తోంది. సాధరణంగా ఈ పరిశ్రమ అధిక స్థిర ఆస్తి వ్యయాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ రంగంలో మార్జిన్లు తక్కువగా ఉంటాయి. వీటికి తోడు విమానయాన రంగ కంపెనీలు సంక్షోభం‍లో చిక్కుకోవడంతో ఈ రంగం ​చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడడంతో పాటు తాజాగా ఇండిగో సంస్థ యాజమాన్య గొడవలు

Most from this category