STOCKS

News


ఎస్‌బీఐ లాభం రూ.838 కోట్లు

Saturday 11th May 2019
news_main1557551401.png-25670

  • తగ్గిన మొండి భారం 
  • మెరుగైన రుణ నాణ్యత 
  • రానున్నవి మంచి రోజులే
  • ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ 

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్‌) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో రూ.7,719 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు.  మొత్తం ఆదాయం రూ.68,436 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.75,671 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌2.95 శాతంగా నమోదైందని వివరించారు. రానున్నదంతా మంచి కాలమేనన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న తమ అనుబంధ కంపెనీలు,  ఎస్‌బీఐ కార్డ్‌, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లను త్వరలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని చెప్పారు. 

ఏడాది లాభం రూ.6,547 కోట్లు...
ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2017-18లో రూ.6,547 కోట్ల  నికర నష్టాలు రాగా(స్టాండ్‌ఆలోన్‌), గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) వచ్చిందని రజనీశ్‌ చెప్పారు. కీలకమైన కొన్ని ఒత్తిడి ఖాతాలకు వంద శాతం కేటాయింపుల కారణంగా నిర లాభం తగ్గిందని వివరించారు.  కన్సాలిడేటెడ్‌ పరంగా చూస్తే,  2017-18లో రూ.రూ.4,187 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,069 కోట్ల నికర లాభం వచ్చిందని చెప్పారు. ఆదాయం రూ.3.01 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, దేశీయ రుణాలు 14 శాతం పెరగడంతో మొత్తం రుణ వృద్ధి 12 శాతంగా నమోదైందని తెలిపారు. 

మెరుగుపడిన రుణ నాణ్యత
ఎస్‌బీఐ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 10.91 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చినాటికి 7.53 శాతానికి తగ్గాయని రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 5.73 శాతం నుంచి 3.01 శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,23,427 కోట్ల నుంచి రూ.1,72,750 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.1,10,855 కోట్ల నుంచి రూ.65,895 కోట్లకు తగ్గాయని తెలిపారు.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.37,000 కోట్ల రికవరీ జరిగిందని, బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పారు. తాజా మొండి బకాయిలు గత క్యూ4లో రూ.7,505 కోట్లకు, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.32,738 కోట్లకు చేరాయని తెలిపారు. తాజా మొండి బకాయిలు తక్కువగా ఉండటం, రివకరీలు పెరగడం, కేటాయింపులు పెరగడం వల్ల స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయని వివరించారు. 

79 శాతానికి పీసీఆర్‌...
 ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 12.6 శాతం పెరిగి 79 శాతానికి చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, 4.1 శాతం మెరుగుపడింది. ఎస్సార్‌ స్టీల్‌, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల దివాలా ప్రక్రియ తుది దశలో ఉందని, వీటికి సంబంధించిన రూ.16,000 కోట్ల బకాయిలు వసూలు కాగలవని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.3,487 కోట్ల రుణాలిచ్చామని, వీటిల్లో 1,125 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని వివరించారు. కాగా మార్చి చివరి నాటికి బ్యాంక్‌ టైర్‌ వన్‌ మూలధనం 9.62 శాతంగానే ఉంది. దీంతో క్యూఐపీ విధానంలో ఈ బ్యాంక్‌ నిధులు సమీకరించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. 

అంతా శుభమే...

అన్ని అంశాల్లో మంచి పనితీరు కనబరిచాం. టర్న్‌ అరౌండ్‌ సాధించాం. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయి. భవిష్యత్తులో ఎలాంటి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అంతా శుభమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం రుణ వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 
ఎస్‌బీఐ చైర్మన​ రజనీశ్ కుమార్‌ చెప్పారు. 

  • రజనీశ్‌ కుమార్‌ కామెంట్‌ 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఈపీఎఫ్‌వో నోటీసులు

Saturday 11th May 2019

ఉద్యోగుల పీఎఫ్ నిధులు  జమచేయనందుకు షోకాజ్ నోటీసులు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్‌ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకు గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జెట్ ఎయిర్‌వేస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయీలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన

‍నిఫ్టీ ప్యాక్‌లో ఇవి చౌకగా..!

Friday 10th May 2019

నిఫ్టీ-50 ఇటీవల రికార్డు గరిష్ట స్థాయి 11,856 వరకు వెళ్లింది. అప్పటి నుంచి దిద్దుబాటులోకి వెళ్లింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తుండడంతో సూచీల ర్యాలీ రివర్స్‌ అయింది. గరిష్ట స్థాయిల నుంచి ఇండెక్స్‌ ఇప్పటికే 5 శాతం దిద్దుబాటుకు గరైంది. ఐదు రోజులు, 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను కూడా ఇండెక్స్‌ బ్రేక్‌ చేఇంది. అమ్మకాలు ఎక్కువగా లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే, ఇప్పటికీ నిఫ్టీ-50లో

Most from this category