STOCKS

News


నేడే ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Monday 5th November 2018
news_main1541397997.png-21713

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) సోమవారం జూలై- సెప్టెంబర్‌ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ప్రస్తుత క్యూ2లో వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం సగానికిపైగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. మొండి బకాయిల కోసం అధిక కేటాయింపులు, నికర వడ్డీ ఆదాయంలో స్వల్ప వృద్ధి, తక్కువ నిర్వహణ/ఇతర ఆదాయం వంటి అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. నొమురా, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎమ్‌కాయ్‌ రీసెర్చ్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌ వంటి సంస్థలు బ్యాంక్‌ నికర ఆదాయం వార్షిక ప్రతిపాదికన ప్రస్తుత క్యూ2లో 40-97 శ్రేణిలో తగ్గొచ్చని అంచనా వేస్తున్నాయి. అధిక కేటాయింపుల వల్ల రూ.740 కోట్ల నష్టం వాటిల్లొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 

కేటాయింపులు..
వార్షికంగా, త్రైమాసికం పరంగా తగ్గుదల ఉన్నప్పటికీ కేటాయింపులు ఇంకా అధికంగా ఉండొచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఎన్‌పీఎల్‌ (నాన్‌-పర్ఫార్మింగ్‌ లోన్‌) పెరుగుదల, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా అధిక ఎంటీఎం (మార్క్‌-టు-మార్కెట్‌) ప్రొవిజన్స్‌ వల్ల కేటాయింపులు పెరగొచ్చని తెలిపాయి. కేటాయింపులు తగ్గొచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌, నొమురా పేర్కొన్నాయి.  

ఎన్‌ఐఐ, రుణ వృద్ధి
ప్రస్తుత క్యూ2లో వార్షికంగా చూస్తే బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ)లో వృద్ధి 10 శాతానికిపైగా ఉండొచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. రుణ వృద్ధి 5-10 శాతం శ్రేణిలో ఉండొచ్చని తెలిపాయి. మార్జిన్లు స్థిరంగా ఉంటాయని అంచనా వేశాయి. ‘బ్యాంక్‌ రుణ వృద్ధి పరిశ్రమ కన్నా తక్కువగానే ఉండొచ్చు. అయితే మార్జిన్లు స్థిరంగా ఉంటాయి. ఎన్‌ఐఐ వృద్ధి 16.5 శాతంగా ఉండొచ్చు’ అని ప్రభుదాస్‌ లీలాధర్‌ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ రుణ వృద్ధి దాదాపు 10 శాతంగా ఉండొచ్చని కోటక్‌ అంచనా వేసింది. నికర వడ్డీ  మార్జిన్లు ఫ్లాట్‌గా లేదా తగ్గొచ్చని తెలిపింది. 2.8 శాతం సమీపంలో ఉండొచ్చని పేర్కొంది. ఇక ఎన్‌ఐఐ వృద్ధి దాదాపు 13.4 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. రిటైల్‌ రుణాల వృద్ధి బలంగా ఉండొచ్చని ఎమ్‌కాయ్‌ అంచనా వేసింది. వడ్డీయేతర ఆదాయం ఫ్లాట్‌గా ఉండొచ్చని కోటక్‌ పేర్కొంది. 

రుణ నాణ్యత
త్రైమాసికం పరంగా చూస్తే ప్రస్తుత క్యూ2లో బ్యాంక్‌ రుణ నాణ్యతలో కొంత మెరుగుదల కనిపించొచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేశాయి. మొండిబకాయిల నిలకడగా ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నాయి. అయితే ప్రస్తుత ఎన్‌పీఏల వల్ల రిస్క్‌ ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. స్థూల మొండి బకాయిలు క్వార్టర్‌ పరంగా 33 శాతానికి తగ్గొచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా వేసింది. క్వార్టర్‌ పరంగా స్థూల మొండి బకాయిలు 50 బేసిస్‌ పాయింట్లమేర తగ్గొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. స్థూల మొండి బకాయిలు తగ్గొచ్చని కోటక్‌ కూడా అంచనా వేసింది. 

గమనించాల్సిన కీలక అంశాలు..
♦ రుణ నాణ్యతకు సంబంధించి బ్యాంక్‌ పనితీరు. అలాగే గైడెన్స్‌ ఎలా ఉన్నాయో చూడాలి.
♦ రిటైల్‌ ఎన్‌పీఏలు ఏ విధంగా ఉన్నాయో గమనించాలి. 
♦ ఎన్‌సీఎల్‌టీ అకౌంట్ల రికవరీ ఎలా ఉందో చూడాలి. 
♦ పవర్‌ సెక్టార్‌ అసెట్స్‌పై బ్యాంక్‌ అంచనాలు
♦ లిక్విడిటీ అంశంపై మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలు



You may be interested

ఫార్మా...డౌన్‌

Monday 5th November 2018

ఫార్మా షేర్లకు సిప్లా రెండో త్రైమాసిక ఫలితాలు షాకినిచ్చాయి. నేడు సిప్లా ప్రకటించి క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అందుకోలేకపోవడంతో సిప్లా షేర్లు 8శాతం పతనమైంది. సిప్లా కౌంటర్లో వెల్లువెత్తిన అమ్మకాలు క్రమంగా పుంజుకుంటూ ఇదే ఫార్మా రంగంలో మిగతా షేర్లను ముంచాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ మధ్యాహ్నం‍ ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం నష్టపోయింది. ఇదే సమయంలో దివీస్‌ల్యాబ్స్‌ 3శాతం నష్టపోయింది.

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Monday 5th November 2018

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ) షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. నేడు ఇండెక్స్‌ 2,930.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త వెలువడిన నేపథ్యంలో ఈ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే 2శాతం లాభపడి 2,983.20 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గత

Most from this category