ఓఎన్జీసీలో వాటా విక్రయం!
By Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటంలో (డిజిన్వెస్ట్‌మెంట్) భాగంగా చమురు దిగ్గజం ఓఎన్జీసీలో 5 శాతం దాకా వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో ఈ విక్రయం ఉండనుంది. ఓఎఫ్ఎస్ వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) గతవారం అమెరికాలో రోడ్‌షో కూడా నిర్వహించింది. నిర్దిష్టంగా ఎంత మొత్తం వాటాలు విక్రయిస్తుందన్నదీ వెల్లడి కాకపోయినా సుమారు 3- 5 శాతం మేర డిజిన్వెస్ట్‌మెంట్ ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ ప్రస్తుత షేరు ధర ప్రకారం దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 11,300 కోట్ల దాకా రావొచ్చు. ఓఎన్జీసీలో కేంద్రానికి మొత్తం 67.45 శాతం వాటా ఉంది.
గతంలో 5 శాతం విక్రయం...
2012 ఆర్థిక సంవత్సరంలో కూడా ఓఎన్జీసీలో కేంద్రం దాదాపు 5 శాతం వాటాల విక్రయించి రూ.12,750 కోట్లు సమీకరించింది. అప్పట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆదుకోవడంతో ఈ విక్రయ ప్రతిపాదన గట్టెక్కింది. ఆ తర్వాత మళ్లీ మరిన్ని వాటాలు విక్రయించడానికి ప్రయత్నించినప్పటికీ.. సబ్సిడీల భారంతో ఓఎన్జీసీ షేరుపై ప్రతికూల ప్రభావాల కారణంగా కుదరలేదు. అయితే, బ్యారెల్ క్రూడాయిల్ రేటు 70 డాలర్ల పైకి చేరిన పక్షంలో సబ్సిడీ భారాన్ని పంచుకోవాలంటూ ఓఎన్జీసీని అడగాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టడం ప్రస్తుతం సంస్థ షేరుకు సానుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. దీంతో వాటాల విక్రయం సజావుగా జరగొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2016 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ భారంలో వాటాల విధానాన్ని ఉపసంహరించారు. దీంతో అప్పటిదాకా 60 శాతం దాకా వాటాలు భరిస్తున్న ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాల సబ్సిడీ భారం ఆ సంవత్సరం 10 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాత పూర్తిగా తొలిగిపోయింది.
ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 80వేల కోట్లు..
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఽడిజిన్వెస్ట్మెంట్ మార్గంలో గతేడాది రికార్డు స్థాయిలో రూ. 1 లక్ష కోట్లు సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో కేంద్రానికి ఉన్న 51 శాతం వాటాను ఓఎన్జీసీ గతేడాది రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేయడం కూడా ఇందుకు దోహదపడింది. అయితే, ఈసారి ఇప్పటిదాకా డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా కేవలం రూ. 9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సమీకరించిన నిధుల్లో ఇది కేవలం సగమే కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్ల సామర్ధ్యానికి అనుగుణంగా.. మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడకుండా స్వల్ప స్థాయుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ నిర్వహించే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఓఎన్జీసీతో పాటు కోల్ ఇండియాలో 5 శాతం వాటాలు విక్రయించాలని కూడా కేంద్రం యోచిస్తోంది. కోల్ ఇండియా ప్రస్తుత షేరు ధర ప్రకారం దీని ద్వారా మరో రూ. 9,100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంస్థ ఓఎఫ్ఎస్ కోసం ఈ ఏడాది జూన్‌లో దీపం విభాగం విదేశాల్లో రోడ్‌షోలు కూడా నిర్వహించింది. అటు ఇండియన్ ఆయిల్ (3 శాతం మేర), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (10 శాతం దాకా)లో సైతం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా గణనీయంగా నిధులు సమకూర్చుకోవచ్చని కేంద్రం యోచిస్తోంది.
You may be interested
4, 5 తేదీల్లో ఆర్బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు
Wednesday 29th August 2018హైదరాబాద్: పెన్షన్ సమస్యలపై కేంద్రంతో పోరాడుతున్నా ఒక్కటీ పరిష్కారం కావటం లేదని ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్’ హైదరాబాద్ శాఖ మండిపడింది. ఆర్థిక మంత్రిని పలుమార్లు కలసి పెన్షన్ అప్డేషన్, పెన్షన్ ఆప్షన్ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరినా స్పందించలేదన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ సెప్టెంబర్–4, 5 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 14,500 మంది ఉద్యోగులు మూకుమ్ముడి సెలవులో ఉంటారని ఫోరం కార్యదర్శి ఎం.ఎస్.హరిశంకర్
రెండు వారాల గరిష్టం నుంచి పతనం
Wednesday 29th August 2018న్యూయార్క్/ముంబై:- పసిడి ధర బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి పడిపోయింది. అమెరికా-చైనాల మధ్య జరిగిన చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో పాటు, పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణతో వల్ల ఆసియా మార్కెట్లో పసిడి ధర నేలచూపు చూస్తోంది. నేడు ఆసియాలో భారత కాలమాన ప్రకారం ఉదయం 10:00లకు ఔన్స్ పసిడి 4.60డాలర్లు నష్టపోయి 1,209.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య రెండురోజుల పాటు