STOCKS

News


టెల్కోలకు రూపాయి దెబ్బ

Tuesday 9th October 2018
news_main1539058603.png-20946

ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్‌ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్‌ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో అల్లాడుతున్న టెల్కోలకు ఇది మరింత భారంగా మారనుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మూలంగా టెల్కోల ఎబిటా (పన్నుకు ముందు ఆదాయం) 7–8 శాతం మేర తగ్గవచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ హర్ష్‌ జగ్నాని తెలిపారు. ఇక డీజిల్‌ అంశం కూడా తోడైతే ఇది మొత్తం పది శాతం దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత మూలంగా విదేశీ మారకంలో తీసుకున్న రుణాల రీపేమెంట్‌ మరింత పెరుగుతుందని, ఇక నెట్‌వర్క్‌ విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ వ్యయాలు కూడా పెరుగుతాయని ఆయన తెలియజేశారు. 2018 మార్చి 31 నాటికి పరిశ్రమ మొత్తం రుణ భారం రూ. 4.7 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో విదేశీ రుణం సుమారు రూ.1 లక్ష కోట్ల దాకా ఉంది. దీనిలో మళ్లీ 70 శాతం రుణాలు డాలర్‌ మారకంలోనే ఉన్నాయి. ఇదే టెల్కోలను కలవరపెడుతోంది.
టవర్‌ కంపెనీలకు కూడా సెగ..
దేశీయంగా 4.7 లక్షల టెలికం టవర్లుండగా... వీటిలో సుమారు పావు శాతం టవర్లు మాత్రమే నామమాత్రపు డీజిల్‌ వాడకంతో నడుస్తున్నాయి. మిగతావన్నీ ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడినవే. ప్రస్తుతం రేట్ల పెరుగుదల వల్ల టెలికం టవర్‌ సైట్ల ఇంధనాల వ్యయాలు పెరగనున్నాయి. సాధారణంగా టవర్‌ సైట్‌ల నిర్వహణకు సంబంధించి డీజిల్‌ వ్యయాలు పరిశ్రమకు సుమారు రూ.13,000 కోట్ల మేర ఉంటోంది. డీజిల్‌ రేట్లు సుమారు 15 శాతం పెరిగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఎబిటాపై 3–4 శాతం ప్రభావం పడి... కంపెనీల ఎబిటా దాదాపు రూ. 2,000 కోట్ల మేర తగ్గనుంది. ఒకవైపు.. రిలయన్స్‌ జియో ప్రారంభించిన రేట్ల యుద్ధంతో భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్, వొడాఫోన్‌ ఇండియాలు ఇప్పటికే నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఇక దీనికి రూపాయి, డీజిల్‌ కూడా తోడైతే ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. డీజిల్‌ రేట్ల పెరుగుదల సెగ కేవలం టెలికం ఆపరేటర్లకే కాకుండా కొన్ని టవర్‌ కంపెనీలకు కూడా తగలనుంది. టవర్‌ సైటు ఇంధన వ్యయాలను కొన్ని సందర్భాల్లో టవర్‌ కంపెనీలు, టెల్కోలు కలిసి భరిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా టవర్‌ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో విద్యుత్, ఇంధన వ్యయాల వాటా సుమారు 30–40 శాతం మేర ఉంటుంది. తమ తమ ఒప్పందాలను బట్టి డీజిల్‌ రేట్ల పెరుగుదలలో కొంత భాగాన్ని మాత్రమే టవర్‌ కంపెనీలు.. టెల్కోలకు బదలాయించగలుగుతాయి. అయితే, సౌర విద్యుత్, ఫ్యుయల్‌ సెల్స్‌ వంటి పునరుత్పాదక విద్యుత్‌ వనరులను వినియోగిస్తూ.. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున రేట్ల భారం మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చని టవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. 2011–12లో ఒక్కో మొబైల్‌ టవర్‌ నిర్వహణకు ఒక్కో సంస్థ రోజుకు 7.34 లీటర్ల డీజిల్‌ ఖర్చు పెట్టేదని, ఇది 2015–16 నాటికి 4 లీటర్లకు తగ్గిపోయిందని వివరించాయి. You may be interested

గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ విస్తరణ

Tuesday 9th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఎండీ గుబ్బ నాగేందర్‌ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 9th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కోల్‌ ఇండియా:- ఎన్‌ఎల్‌సీ ఇండియా సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జేఎంసీ ప్రాజెక్ట్స్‌:- వివిధ మార్గాలలో రూ.514 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. ఎన్‌బీసీసీ:- జైపూర్‌లో ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌ పునర్నిర్మాణానికి రాజస్థాన్‌ ప్రభుత్వంతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మొత్తం ఒప్పందం విలువ రూ.250 కోట్లుగా ఉంది. ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌:- ఈ సెప్టెంబర్‌ సిమెంట్‌ అమ్మకాల్లో 32శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే

Most from this category