News


ఆరోగ్యం..ఆయుష్మాన్‌!

Saturday 2nd February 2019
news_main1549110857.png-23986

  • గతేడాది కన్నా 16 శాతం అధిక కేటాయింపులు
  • మొత్తం రూ.61,398 కోట్లు..అందులో ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.6400 కోట్లు
  • 2022 నాటికి 1.5 లక్షల వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు
  • ఎయిమ్స్‌లకు రూ.3599.65 కోట్లు..ఎన్‌హెచ్‌ఎంకు రూ.రూ.31,745 కోట్లు
  • బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం


న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6400 కోట్లను ఆయుష్మాన్‌ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్‌ భారత్‌కు)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా కేటాయింపులు జరపడం గమనార్హం. ఇతర విశేషాలు..
-జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) లో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌, వెల్‌సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్ల కేటాయింపు.
-జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రూ.1,350.01 కోట్ల కేటాయింపు.
-ఈ పథకం కింద 2022 నాటికి దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉప ఆరోగ్య కేంద్రాల్ని హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేం‍ద్రాలుగా తీర్చిదిద్దుతారు. రక్తపోటు, డయాబెటిస్‌, కేన్సర్‌, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు ఈ కేంద్రాల్లో చికిత్స అందిస్తారు.
-జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పథకానికి రూ.31,745 కోట్లు కేటాయించారు.
-ఎన్‌హెచ్‌ఎంలో అంతర్భాగమైన రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై)కు రూ. 156 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం గతేడాది కన్నా రూ.1844 కోట్లు తక్కువ కావడం గమనార్హం.
-ఎయిడ్స్‌, అసురక్షిత లైంగిక వ్యాధుల నివారణ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం రూ.400 కోట్లు అధికం.
-ఎయిమ్స్‌కు రూ.3599.65 కోట్ల కేటాయించారు.
-జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి కేటాయింపులను రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గించారు.
-కేన్సర్‌, డయాబెటిస్‌, హృద్రోగ సంబంధ వ్యాధుల నివారణ, నియంత్రణ కార్యక్రమానికి కేటాయింపులను రూ.295 కోట్ల నుంచి రూ.175 కోట్లకు తగ్గించారు.
-టెర్షరీ కేర్‌(ప్రత్యేక సంరక్షణ, చికిత్సలు) కార్యక్రమాలకు కేటాయింపులను రూ.750 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గించారు.
-నర్సింగ్‌ సేవల ఆధునీకరణకు రూ.64 కోట్లు, ఫార్మసీ స్కూల్స్‌, కళాశాలల బలోపేతానికి రూ.5 కోట్లు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల(పీజీ సీట్లు) ఆధునీకరణకు రూ.800 కోట్లు కేటాయించారు.
-ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు(డిగ్రీ సీట్లు), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేం‍ద్రాల బలోపేతానికి రూ.1,361 కోట్ల కేటాయింపు. కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.2 వేల కోట్లు, రాష్ట్రాల్లో ప్రభుత్వ పారామెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు.

‘ఆయుష్మాన్‌’తో 3 వేల కోట్లు ఆదా: పీయూష్‌
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇప్పటిదాకా ఉచితంగా వైద్యం చేయించుకున్న సుమారు 10 లక్షల మంది పేదలు రూ.3 వేల కోట్లను ఆదాచేసుకున్నారని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చౌక ధరలకే ఔషధాల్ని అందిస్తోందని, గుండెలో అమర్చే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరల తగ్గింపుతో లక్షలాది మంది పేదలు ప్రయోజనం పొందారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్‌ ఆసుపత్రులు పనిచేస్తున్నాయని, అందులో 14 ఆసుపత్రుల్ని ఎన్డీయే ప్రభుత్వమే ప్రారంభించిందని అన్నారు. పేదలకు ఆరోగ్య సేవల్ని చేరువచేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉటంకిస్తూ..2030 నాటికి ఎలాంటి అవాంతరాలు లేని సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. అలాంటి ఆరోగ్య భారత నిర్మాణంలో మహిళలనూ సమాన భాగస్వాముల్ని చేస్తామని తెలిపారు.



You may be interested

మధ్య తరగతి వారికి మేలు

Saturday 2nd February 2019

రూ.5 లక్షల వరకు ఐటీ మినహాయింపుపై జైట్లీ న్యూఢిల్లీ: ఈ బడ్జెట్‌లో వార్షికాదాయం రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపుతో మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ 2019-20 మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఉందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనుందని అన్నారు. ఈమేరకు జైట్లీ తన

పర్యావరణానికి రూ.3,111 కోట్లు

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: పర్యావరణ మంత్రిత్వ శాఖకు మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,111.20 కోట్లు కేటాయించింది. గత కేటాయింపులతో పోలిస్తే ఇది 20.27 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ప్రాజెక్టు టైగర్‌కు రూ.350 కోట్లు, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌కు రూ.30 కోట్లు వెచ్చించనుంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(సీపీసీబీ)కి రూ.100 కోట్లు, జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్య్లూబీ)కు గత ఏడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువ అంటే రూ.12 కోట్లు ప్రత్యేకించింది. నేషనల్‌

Most from this category