News


కస్టమర్లకూ ‘రెపో’ లాభం!

Tuesday 11th June 2019
news_main1560228007.png-26217

- తగ్గింపు ప్రయోజనం త్వరలోనే బదలాయింపు
- సంప్రదాయక వర్గీకరణ వల్లే ఎన్‌పీఏలు అలా...
- బ్యాంకులకు ఏమాత్రం నగదు కొరత లేదు
- ప్రతి బ్రాంచిలోనూ కొత్త ఏటీఎం ఏర్పాటు
- బ్రోకింగ్‌ కస్టమర్ల కోసం ‘ట్రేడ్‌ - 20’
- ‘సాక్షి’ యాక్సిస్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ రవి నారాయణన్‌
- తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పలు కార్యక్రమాలు
- చాలా పథకాలకు అధికారిక బ్యాంకర్లం మేమే

సాక్షి, బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ పరంగా అనేక అడుగులు వేస్తోందని, అందుకే తాము పలు కార్యక్రమాల్లో భాగం కాగలిగామని ప్రయివేటు బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తెలియజేసింది. తెలంగాణలో ప్రస్తుతం తమకు 135 బ్రాంచీలుండగా... ఈ ఏడాది డిసెంబరు ఆఖరునాటికి మరో 30 ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 150 బ్రాంచీలున్నాయని... డిసెంబరు ఆఖరికల్లా రెండు రాష్ట్రాల్లోనూ ఇంచుమించు సమాన సంఖ్యలో బ్రాంచీలుంటాయని యాక్సిస్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ రవి నారాయణన్‌ చెప్పారు. సోమవారమిక్కడకు వచ్చిన సందర్భంగా సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఏపీ, తెలంగాణ సర్కిల్‌ మధుసూధన రావుతో కలిసి ఆయన ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వూ‍్య ముఖ్యాంశాలివీ...
ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం అనేకరకాలుగా ముందుకొస్తున్నట్లు మీరు చెబుతున్నారు. ఏ రకంగానో చెప్పగలరా?

జవాబు: సిద్ధిపేటను నగదు రహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మేం 10 గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఖాతాలు తెరిచాం. అన్ని దుకాణాలకూ ఈడీసీ మెషిన్లు అందజేశాం. ఇక ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌కు, గనులు-భూగర్భ వనరుల శాఖ లావాదేవీలకు, ఇసుక నిర్వహణ వ్యవస్థకు, ఫాస్టాగ్‌ సొల్యూషన్స్‌కు, ఫిషరీస్‌ విభాగ బ్లూ రివొల్యూషన్‌ పథకానికి, పశు సంవర్థక శాఖ గొర్రెలు-మేకల పథకానికి ఇలా అన్నిటికీ మేం అధికారిక బ్యాంకరుగా వ్యవహరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ డెయిరీకి కూడా నగదు నిర్వహణ సేవలందిస్తున్నాం. 

ప్ర. ఇలాంటి ఒప్పందాలు మిగతా ఏ రాష్ట్రంతోనైనా ఉన్నాయా?
జ: గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక... ఇలా చాలా రాష్ట్రాలతో రకరకాల అంశాలకు సంబంధించి ఒప్పందాలున్నాయి. పలు సేవలందిస్తున్నాం. ఇలాంటివన్నీ మా నుంచి కాకుండా స్థానికంగా ఉండే ప్రభుత్వాన్ని బట్టే ఉంటాయి. ప్రభుత్వం ముందుకొచ్చి పారదర్శకంగా, వేగవంతమైన సేవలందిస్తామంటే ఇలాంటివి ఎన్నయినా సాధ్యమవుతాయి.

ప్ర. సరే! ఆర్‌బీఐ గడిచిన ఆరు నెలల్లో రెపోరేటు ముప్పావు శాతం... అంటే 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. కానీ ఏ బ్యాంకూ దీన్ని పూర్తిగా వినియోగదారుకు అందించలేదు. ఎందుకని?
జ: నిజం! ఆర్‌బీఐ మూడు దఫాలుగా రెపో రేటు తగ్గించినా అదింకా పూర్తిగా వినియోగదారు స్థాయికి చేరలేదు. కాకపోతే మా బ్యాంకయినా, ఏ బ్యాంకయినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గతంలో ఇలాంటివి వినియోగదారు స్థాయికి బదిలీ కావటానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆ ప్రక్రియ మెరుగుపడి, వేగవంతమయింది. మొదట డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించటంతో మొదలై.. మెల్లగా రుణాలపై రేట్లు కూడా తగ్గుతాయి. త్వరలోనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాం. కాకపోతే ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడు చెప్పలేం.

ప్ర: మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే యాక్సిస్‌ బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు తగ్గుతాయని చెబుతున్నా కావటం లేదు. ఎందుకని?
జ: మిగతా ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే ఎన్‌పీఏలకు కేటాయింపుల విషయంలో మేం చాలా సంప్రదాయకంగా వ్యవహరిస్తున్నాం. అంటే ఎక్కువ కేటాయింపులు చేస్తున్నాం. ఏ కొంచెం అవకాశమున్న ఖాతాలనైనా దాచకుండా ఎన్‌పీఏలుగా వర్గీకరిస్తున్నాం. ఈ కారణాల వల్లే మా ఎన్‌పీఏలు కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇలా వ్యవహరించటం బ్యాంకు ఆరోగ్య రీత్యా మంచిదే. 

ప్ర: ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీల సంక్షోభం మాటేంటి? ఇందులో మీ బ్యాంకు వాటా ఎంత?
జ: సంక్షోభం కొలిక్కి వస్తుందనే నేను భావిస్తున్నాం. చర్చల ప్రక్రియతో ఇలాంటి సంక్షోభాలను మరింత ముదరకుండా నివారించవచ్చన్నది నా నమ్మకం. మాకు వీటిలో ఎంత వాటా ఉందనేది ఇప్పుడు చెప్పటం సాధ్యం కాదు. 

ప్ర: మీకింకా నగదు కొరత ఉందా? ఏటీఎంలు తగ్గిస్తున్నారా?
జ: అలాంటిదేమీ లేదు. ఇపుడు ఆర్‌బీఐ అందరికీ పుష్కలంగా నగదు అందుబాటులో ఉంచుతోంది. కొత్త వాటితో సహా ప్రతి బ్రాంచిలోనూ ఏటీఎంను ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి మాకు 4,050 బ్రాంచీలు, 11,801 ఏటీఎంలు ఉన్నాయి. మున్ముందు బ్యాంకింగ్‌ కార్యకలాపాలన్నీ జరుపుకోవటానికి వీలయ్యే సెల్ఫ్‌ సర్వీస్‌ ఏటీఎంల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం.

ప్ర: బ్రోకింగ్‌ సేవల విషయానికొస్తే మీరెందుకు చాలా వెనకబడ్డారు? 
జ: నిజమే! ఇప్పుడొచ్చిన డిస్కౌంట్‌ బ్రోకరేజీలు, ఇతరులతో పోలిస్తే యాక్సిస్‌ డైరెక్ట్‌ కొంత వెనకబడినట్టే. కాకపోతే మేం కస్టమర్ల సంఖ్యపై కాకుండా మా కస్టమర్లకు ఈ సేవల్ని ఎంత మెరుగ్గా అందించగలమనే అంశంపైనే దృష్టి పెడుతున్నాం. ఇటీవలే ట్రేడ్‌-20ని అమల్లోకి తెచ్చాం. దీనిద్వారా షేర్లకు సంబంధించి ఏ లావాదేవీకైనా రూ.20 మాత్రమే వసూలు చేస్తాం. కాకపోతే కస్టమర్లు తమ ఖాతాల్లో రూ.75వేల సగటు బ్యాలెన్స్‌ నిర్వహించాలనే షరతు ఉంది. బ్రోకింగ్‌ సేవల్నిపుడు బాగా విస్తరిస్తున్నాం. మా మొబైల్‌ బ్యాంకింగ్‌, బ్రోకింగ్‌ యాప్‌లు చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయి. You may be interested

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ చేతికి జేపోర్‌ బ్రాండ్‌

Tuesday 11th June 2019

డీల్‌ విలువ రూ.110 కోట్లు   ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) కంపెనీ ఎథ్నిక్‌ వేర్ బ్రాండ్స్‌- జేపోర్‌, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌లను కొనుగోలు చేస్తోంది. జేపోర్‌ బ్రాండ్‌ను రూ.110 కోట్లకు, టీజీ అప్పారెల్‌ అండ్‌ డెకార్‌ బ్రాండ్‌ను  రూ.25 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ తెలిపింది. ఈ డీల్‌ 30- 45 రోజుల్లో పూర్తవ్వగలదని  పేర్కొంది. ఎథ్నిక్‌  అప్పారెల్‌,

‘బేసిక్‌ సేవింగ్స్‌’ ఖాతాలకు మరిన్ని ఉచిత సేవలు

Tuesday 11th June 2019

నిబంధనలను సడలించిన ఆర్‌బీఐ   ముంబై: బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు ఇకపై చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలను కూడా ఉచితంగా పొందే అవకాశం వచ్చింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు కనీస బ్యాలన్స్‌ ఉంచాలని బ్యాంకులు ఇకపై నిర్దేశించకూడదు. ఎటువంటి కనీస బ్యాలన్స్‌ అవసరం లేకుండా నిర్వహించేందుకు వీలున్నవే బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు. చెక్‌బుక్‌తోపాటు ఇతర సదుపాయాలు కోరుకుంటే, బ్యాంకులు కనీస బ్యాలన్స్‌ ఉంచాలని ప్రస్తుతం కోరుతున్నాయి. అయితే,

Most from this category