STOCKS

News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ‘రికార్డ్‌’ లాభం

Friday 19th April 2019
Markets_main1555649413.png-25215

- రిటైల్‌, టెలికం విభాగాల జోరు 
- 10 శాతం పెరిగిన క్యూ4 నికర లాభం
- 19 శాతం వృద్ధితో రూ.1,54,110 కోట్లకు ఆదాయం
- తగ్గిన జీఆర్‌ఎమ్‌
- రిలయన్స్‌ జియోకు 30 కోట్ల వినియోగదారులు 
- ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. రిటైల్‌, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్‌ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్‌, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రికార్డ్‌ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. రిటైల్‌ వ్యాపారం 52 శాతం, డిజిటల్‌ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ది చెందాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. పెట్రో కెమికల్‌ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది.
10 శాతం పెరిగిన లాభం...
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది.  దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018-19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్‌ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్‌, పెట్రో కెమికల్స్‌ మార్జిన్‌ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి​రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. 
రిటైల్‌ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా,  టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
పెట్రో కెమికల్స్‌ విభాగం...తగ్గిన జీఆర్‌ఎమ్‌ !
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్‌ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది.  రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్‌ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది.  ఎబిట్‌ మార్జిన్‌ 19 శాతంగా నమోదైంది. అయితే  స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్‌ఎమ్‌(ఒక్కో బ్యారెల్‌కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్‌ఎమ్‌ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్‌, మార్కెటింగ్‌ సెగ్మెంట్‌ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది. 
రిటైల్‌ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి !
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్‌ వ్యాపారం ఆదాయం 52 శాతం పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం  ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది. 
రిలయన్స్‌ జియో...జిగేల్‌ !
టెలికం విభాగం రిలయన్స్‌ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్‌ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్‌పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది.

ముకేశ్‌ అంబానీ మాట....
గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్‌ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది.  రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్‌ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది. 



You may be interested

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

Friday 19th April 2019

న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) వెల్లడించింది. రిలయన్స్‌ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93

నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Friday 19th April 2019

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు సైతం పనిచేయవు. మార్కెట్లో ట్రేడింగ్‌ తిరిగి సోమవారం మొదలవుతుంది. 

Most from this category