STOCKS

News


అంచనాలు తల్లకిందులు

Friday 5th October 2018
news_main1538730308.png-20894

అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్‌ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వరుసగా మూడు రోజుల పాటు సమావేశమై... ఒక్క నివారణ చర్య లేకుండా ముగించేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన జరిగిన ఎంపీసీ కమిటీ నాలుగో ద్వైమాసిక సమావేశం, చివరికి కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథ విధానాన్నే కొనసాగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బెంచ్‌మార్క్‌ రెపో రేటు 6.5 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. రివర్స్‌ రెపో 6.25 శాతంలోనూ మార్పు లేదు. పెరిగే చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతుండం మన దేశ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నా... అందుకు తన వైపు నుంచి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి ‘క్రమంగా కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్‌ టైటనింగ్‌)కు మార్చింది. అంటే ఇకపై సమీప భవిష్యత్తులో రేట్ల పెంపే గానీ, తగ్గేందుకు అవకాశాల్లేవని సంకేతాలిచ్చింది. మధ్య కాలానికి ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణాన్ని) 4 శాతానికి నియంత్రించాలన్న విధానానికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి పేర్కొంది. నిజానికి కీలక రేటును కనీసం పావు శాతం అయినా పెంచుతారని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. రూపాయి బలహీనత చూసి కొందరయితే... ఈ పెంపు అర శాతం కూడా ఉండొచ్చని అనుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తర్వాత రూపాయి ఫారెక్స్‌ మార్కెట్లో 74 స్థాయిని కోల్పోయింది. స్టాక్‌ మార్కెట్లు మాత్రం ఆర్‌బీఐ విధానంతో కకావికలం అయ్యాయి. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అస్థిరతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి కఠినతరం అవుతుండడం మనదేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలకు పెద్ద సవాళ్లుగా ఆర్‌బీఐ పేర్కొంది. ఈ తరహా సమస్యల ప్రభావాన్ని తటస్థ పరిచే విధంగా దేశీ స్థూల ఆర్థిక మూలాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగానే ఉంటుందని అంచనా వ్యక్తం చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశాల రక్షణాత్మక విధానాలు, కరెన్సీ యుద్ధాల ముప్పు, అమెరికాలో పాలసీ సాధారణంగా మారడం అన్నవి దేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సమస్యలుగా ఎంపీసీ అభిప్రాయపడింది. ఎంపీసీ ఆగస్ట్‌లో జరిగిన సమావేశంలో పాలసీ రేట్లను పావు శాతం పెంచిన విషయం గమనార్హం. 
రూపాయి ఇప్పటికీ బాగానే ఉంది: ఉర్జిత్‌
దేశీయ కరెన్సీ రూపాయి విలువను మార్కెట్‌ శక్తులే నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఆర్‌బీఐకి ఎటువంటి టార్గెట్‌, బ్యాండ్‌ లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇప్పటికే మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ చివరి నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 400.5 బిలియన్‌ డాలర్లని, ఇవి పది నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు. ‘‘ఆగస్ట్‌లో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం తర్వాత రూపాయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. వెలుపలి శక్తుల నుంచి వచ్చే అంతర్జాతీయ సమస్యల ప్రభావం పడకుండా ఉండే దేశం కాదు మనది. రూపాయి పతనం కొన్ని అంశాల్లో పలు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మోస్తరుగానే ఉంది’’ అని ఉర్జిత్‌ చెప్పారు. 
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో (అక్టోబర్‌-మార్చి) రిటైల్‌ ద్రవ్యోల్బణం రూ.3.9-4.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఆహార ధరలు ఊహించనంత అనుకూలంగా ఉండడమే కారణం. 2019-20 మొదటి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని, సమస్యలు ఎదురైతే కొంత అధికంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మధ్య కాలానికి వినియోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ, ఇటూగా) తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగానే... క్రమంగా కఠినతరమనే విధానం తీసుకున్నట్టు తెలిపింది. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు అన్నది రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిమితం చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొనడం గమనార్హం. ‘‘అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతలు దేశీయంగా ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముడిసరుకుల ధరలు వేగంగా పెరిగి, ధరలు కూడా పెరిగితే, అది రిటైల్‌ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. రానున్న కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగేందుకు రిస్క్‌ ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. పప్పులు, వంట నూనెలు, పంచదార, పండ్లు, కూరగాయల ధరలు ఈ సమయంలో అసాధారణ స్థాయిలో సానుకూలంగా ఉన్నాయి. దేశీయ క్రూడ్‌ బాస్కెట్‌ ధర వేగంగా బ్యారెల్‌కు 13 బ్యారెళ్ల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులతో ఉన్నాయి. కరెన్సీల విలువలు తగ్గుముఖం పడుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏ ప్రభావం జూన్‌లో గరిష్టానికి చేరి తగ్గుముఖం పడుతోంది’’ అని ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ తన విశ్లేషణను తెలియజేసింది. 
ద్రవ్యలోటు లక్ష్యాలను దాటితే ప్రమాదమే
ద్రవ్యలోటు లక్ష్యాలను దాటకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ సూచించింది. లక్ష్యాలు తప్పితే ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం పడడమే కాకుండా, మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ‘‘కేంద్రం లేదా రాష్ట్రాల స్థాయిలో ద్రవ్యలోటు కట్టుతప్పితే అది ద్రవ్యోల్బణ అంచనాలపై, ప్రైవేటు పెట్టుబడులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’’ అని ఆర్‌బీఐ ఎంపీసీ తెలియజేసింది. 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ పరిస్థితి కుదుటపడుతుంది
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుందని, పరిస్థితిని ఇది సద్దుమణిగేట్టు చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి నిర్మాణాత్మక సంస్థాగత చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. నూతన యాజమాన్యానికి ఆర్‌బీఐ సహకారం ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. ఈ తరహా సమస్యలను నివారించేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల అస్సెట్‌ లయబిలిటీ మధ్య అంతరాలు తలెత్తకుండా (ఏఎల్‌ఎం) మార్గదర్శకాలను బలోపేతం చేయనున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా కమర్షియల్‌ పేపర్ల వంటి స్వల్పకాలిక రుణాలపై ఆధారపడే ఎన్‌బీఎఫ్‌సీ ఫైనాన్సింగ్‌ సంస్థలకు సంబంధించి ఈ విషయాన్ని ప్రస్తావించింది. గత రెండు సంవత్సరాల్లో ఎన్‌బీఎఫ్‌సీలు, వాటి ఆస్తుల వృద్ధిలో భారీ పెరుగుదల ఉంది. అవి తమకున్న వనరుల్లో వివిధ మూలాలపై ఆధారపడ్డాయి. ఇందులో స్వల్పకాలిక కమర్షియల్‌ పేపర్లు కూడా ఉన్నాయి. ఇవే ఏఎల్‌ఎం అంశాలకు దారితీశాయి’’ అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. స్వల్పకాలిక రుణాలపై అధికంగా ఎన్‌బీఎఫ్‌సీలు ఆధారపడడాన్ని హ్రస్వదృష్టి విధానంగా మరో డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య అభివర్ణించారు. ఇది సంస్థలపైనే కాకుండా వ్యవస్థాగత స్థిరత్వంపైనా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 
ఎంపీసీ అంచనాల కంటే ఎక్కువే వృద్ధి...
రేట్లను మార్చాల్సిన అవసరం లేదన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ద్రవ్యోల్బాణానికి సంబంధించి ప్రభుత్వ అంచనాలు, ఆర్‌బీఐ ఎంపీసీ అంచనాలకు మాదిరే ఉన్నాయి. అయితే, వృద్ధి రేటు ఎంపీసీ పేర్కొన్న దాని కంటే ఎక్కువే నమోదవుతుందని నమ్ముతున్నాం.
- సుభాష్‌చంద్ర గార్గ్‌, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి 

హైలైట్స్‌
♦ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్ సహా ఐదుగురు సభ్యులు రేట్లను యతాథతంగా ఉంచేందుకు ఓటు వేస్తే... చేతన్‌ఘటే మాత్రం పావు శాతం పెంపునకు ఓటేశారు. 
♦ రెపో రేటు 6.5 శాతం. రివర్స్‌ రెపో రేటు 6.25. సీఆర్‌ఆర్‌ (నగదు నిల్వల నిష్పత్తి) 4 శాతం. బ్యాంకు రేటు 6.75 శాతం. 
♦ అక్టోబర్‌- మార్చి మధ్య ద్రవ్యోల్బణం అంచనా 3.8-4.5 శాతం. 
♦ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని మితంగా ఉంచుతుంది.
♦ చమురు ధరల పెరుగుదలతో వినియోగ వ్యయాలపై ప్రభావం ఉంటుంది. కార్పొరేట్ల మార్జిన్లు తగ్గొచ్చు. 
♦ దేశీయంగా కఠినమైన ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులపై ప్రభావం చూపించొచ్చు.
♦ అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలు మరింత అసమానంగా మారాయి. ఎగుమతుల అంచనాలపై అస్థిరత నెలకొంది. 
♦ ద్రవ్యలోటు అంచనాలను దాటితే ద్రవ్యోల్బణంపై ప్రభావం. 
♦ వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ఆటుపోట్లు ఇవన్నీ మన దేశ వృద్ధికి పెద్ద ముప్పు.
♦ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం.
♦ తదుపరి విధాన సమీక్ష డిసెంబర్‌ 3-5 మధ్య.You may be interested

రూపీ @ 74

Friday 5th October 2018

ఇండియన్‌ రూపాయి నిట్టనిలువునా కుప్పకూలింది. ఇప్పటికే క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయిపై.. ఆర్‌బీఐ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నాం 2:45 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 73.64 వద్ద ప్రారంభమైంది. తర్వాత

3శాతం నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Friday 5th October 2018

ముంబై:- ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.  అందులో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగ బ్యాంకు సూచి ఇంట్రాడేలో దాదాపు 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు సూచి గత ముగింపు(2,777.80)తో పోలిస్తే దాదాపు 2.75శాతం (71 పాయింట్లు) నష్టంతో 2,706.55 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా సెంట్రల్‌ బ్యాంకు 6శాతం నష్టపోయింది. ఇండియన్‌

Most from this category