News


రెపో తగ్గింది.. మరి వడ్డీయో?

Friday 7th June 2019
news_main1559886729.png-26146

  • రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ
  • దీనితో తొమ్మిదేళ్ల కనిష్ఠం 5.75 శాతానికి
  • ఆరుగురు బోర్డు సభ్యుల ఏకగ్రీవ నిర్ణయం
  • గత ఆరునెలల్లో 0.75 శాతం తగ్గిన రెపో
  • కానీ రుణాలపై ఆ మేరకు వడ్డీ తగ్గించని బ్యాంకులు
  • డిపాజిట్లపై వడ్డీకి మాత్రం ఎప్పటికప్పుడు కోతలు
  • ఇలాగైతే రుణాల్లో వృద్ధి ఉండదంటున్న రేటింగ్‌ సంస్థలు
  • బ్యాంకర్లతో మాట్లాతానన్న ఆర్‌బీఐ గవర్నర్‌

ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25 శాతం చొప్పున రేటును ఆర్‌బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళతర వైఖరికి’ మార్చింది. 
ఏంటీ రెపో...
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా ఈ విషయంపై తన అసంతృప్తికి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్‌ 5 వరకూ ఆర్‌బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ‍ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04 శాతం. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. 
రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే...
ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్‌బీఐ శ్రీకారం చుట్టింది. బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. 
భారత్‌ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ నెలకొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా రేటు కోత నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే...
- అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశిత శ్రేణి 2 శాతానికి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. 
- మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధి లేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. దేశీ వాహన రంగం గతుకుల రోడ్డుపై ప్రయాణం కొనసాగిస్తోంది. అధిక ఫైనాన్స్ వ్యయం, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) తగ్గిపోవడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మే నెల్లో ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు విక్రయాలు సైతం 20 శాతానికి మించి తగ్గిపోయాయి. 
- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది.
- అంతర్జాతీయంగా వృద్ధికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. 
- ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు స్పీడ్‌కు మరిన్ని రేటు కోతలు తప్పవని సంకేతాలు ఉన్నాయి. బ్యాంకుల రుణరేటు తగ్గింపు తప్పనిసరి పరిస్థితులను ఆయా అంశాలు సృష్టిస్తాయని పరిశీలికులు భావిస్తున్నారు. 

వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్‌...
బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్‌ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను మాత్రం తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లూ కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చని ఇటీవల పలు రేటింగ్‌ ఏజెన్సీలు కూడా అభిప్రాయపడటం గమనార్హం. You may be interested

బ్యాంకుల మొండిచేయి!

Friday 7th June 2019

ఆర్‌బీఐ రేటు కోత ప్రక్రియకు శ్రీకారం చుట్టినా, బ్యాంకులు మాత్రం భారీ రేటు తగ్గింపులకు ఎటువంటి హామీలూ ఇవ్వకపోతుండడం గమనించాల్సిన విషయం. ఆర్‌బీఐ రేటు తగ్గింపు వృద్ధికి ఊతం ఇస్తుందని ఒకపక్క పేర్కొంటున్న బ్యాంకులు, అయితే  తాము ఏ మేరకు రేటు తగ్గింపును చేపడతాయన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. తమకు అందివస్తున్న ప్రయోజనాన్ని కస్టమర్‌కు బదలాయించండంటూ స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ చేస్తున్న సూచనలను వాస్తవంలో అమలు చేయడంపై

పసిడిలో లాభాల స్వీకరణ

Friday 7th June 2019

ఏడు రోజుల వరుస ర్యాలీ అనంతరం పసిడి ఫ్యూచర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 5.50డాలర్లు నష్టంతో 1,337.15డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల పరిస్థితులు పసిడి ధరకు ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి రాత్రి అమెరికాలో ఉద్యోగ గణాంకాల విడుదల కానున్న

Most from this category